‘వివాహ వయస్సు పెంపు బిల్లు ఉపసంహరించుకోవాలి’

ABN , First Publish Date - 2021-12-21T15:04:50+05:30 IST

మహిళల వివాహ వయస్సు పెంచే బిల్లును కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ తిరుచ్చిలో ఆందోళన చేపట్టిన రైతు సంఘాలకు చెందిన 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళల కనిష్ట

‘వివాహ వయస్సు పెంపు బిల్లు ఉపసంహరించుకోవాలి’

- తిరుచ్చిలో రైతుల ధర్నా

- 70 మంది అరెస్టు


పెరంబూర్‌(చెన్నై): మహిళల వివాహ వయస్సు పెంచే బిల్లును కేంద్రప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ తిరుచ్చిలో ఆందోళన చేపట్టిన రైతు సంఘాలకు చెందిన 70 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మహిళల కనిష్ట వివాహ వయసు 21 ఏళ్లకు పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఈ అంశంపై సమతా పార్టీ మాజీ అధ్యక్షురాలు జయా జైట్లీ నేతృత్వంలో నియమించిన నలుగురితో కూడిన బృందం అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి కేంద్రానికి నివేదిక అందజేసింది. ఈ నివేదికలో మహిళ వివాహ కనిష్ట వయస్సు 21కి పెంచాలని సిఫార్సు చేసింది. ఈ పెంపునకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేంద్ర నిర్ణయించింది. ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ తిరుచ్చిలో రైతు సంఘాలు ధర్నా చేపట్టాయి. ఈ విషయమై రైతు సంఘాల ప్రతినిధి అయ్యాకన్ను మాట్లాడుతూ, మారిన ఆహారపు అలవాట్లతో ప్రస్తుతం 10 నుంచి 13 ఏళ్ల వయసుల్లోనే బాలిక శరీరాకృతిలో పలు మార్పులు జరుగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలకు 21 ఏళ్ల వరకు వివాహం చేయని పక్షంలో తల్లిదండ్రులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటారని, దీనిని పరిగణలోకి తీసుకొని ఈ బిల్లును కేంద్రం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-21T15:04:50+05:30 IST