మాంగల్యధారణతో మమ!

ABN , First Publish Date - 2021-05-08T03:58:41+05:30 IST

వివాహాలు వేడుకగా జరుపుకుంటామంటే కుదరదు. పరిమిత సంఖ్యలో అతిథులతో... కరోనా నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వివాహాల అనుమతి జారీ ప్రక్రియను తహసీల్దారులకు అప్పగించింది. ఇతర రాష్ట్రాల విషయంలో కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తిలో భాగంగా జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి.

మాంగల్యధారణతో మమ!




విందుకు నో చాన్స్‌

20 మందితోనే వివాహాలు

తహసీల్దారు అనుమతి తప్పనిసరి

లగ్నపత్రిక, ఆధార్‌ నంబర్లు సమర్పించాలి

కరోనా నిబంధనలు పక్కాగా పాటించాలి

లేకుంటే కఠిన చర్యలు 

(శృంగవరపుకోట)

వివాహాలు వేడుకగా జరుపుకుంటామంటే కుదరదు. పరిమిత సంఖ్యలో అతిథులతో... కరోనా నిబంధనలకు లోబడి నిర్వహించుకోవాల్సిందే. లేకుంటే కఠిన చర్యలు తప్పవు. ఈ మేరకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. వివాహాల అనుమతి జారీ ప్రక్రియను తహసీల్దారులకు అప్పగించింది. ఇతర రాష్ట్రాల విషయంలో కలెక్టర్‌ అనుమతి తప్పనిసరి చేశారు. కరోనా రెండో దశ వ్యాప్తిలో భాగంగా జిల్లాలో కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. రోజుకు సగటున 500కు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలో కఠినచర్యలకు ఉపక్రమించారు. అందులో భాగంగా వివాహాలు, శుభకార్యాలపై కఠిన ఆంక్షలు విధించారు. వివాహాలకు సంబంధించి వధూవరుల కుటుంబసభ్యులు 20 మందికి మించి ఉండకూడదు. కొవిడ్‌ తొలిదశలో వివాహాల అనుమతి బాధ్యతను రెవెన్యూ డివిజన్‌ అధికారులకు అప్పగించారు. ఇరువైపులా 50 మంది అతిథులకు అనుమతిచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను 20కు కుదించారు. ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉన్న దృష్ట్యా రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాలకు వెళ్లాలంటే కష్టతరమవుతుంది. అందుకే ఆ బాధ్యతను తహసీల్దారులకు అప్పగించారు. 

ఇవి ఉండాల్సిందే...

 వధూవరులు ఆధార్‌కార్డులు, పెండ్లి శుభలేఖ, లేకుంటే లగ్నపత్రికను దరఖాస్తుతో పొందుపరచాల్సి ఉంటుంది.  వివాహం జరిగే ప్రదేశం రెడ్‌ జోన్‌లో ఉండకూడదు. అందరూ మాస్కులు ధరించాలి. శానిటైజర్‌, చేతుల శుభ్రతకు అవసరమయ్యే ద్రావకాలు అందుబాటులో ఉంచాలి. మనుషుల మధ్య ఒక మీటరు దూరం ఉండేలా చూసుకోవాలి. మద్యం, ఖైనీ, గుట్కా వంటివి వాడకూడదు. ఫంక్షన్‌ హాల్‌లోనే వివాహాలు చేయాలి. ఊరేగింపులు జరపకూడదు. వీటిని అతిక్రమిస్తే వివాహాలను నిలుపుదల చేయడంతో పాటు చర్యలు తీసుకునే అధికారం తహసీల్దారులకు అప్పగించారు. గత ఏడాది కరోనాతో వాయిదా వేసుకున్న వారితో పాటు సంక్రాంతి తరువాత వివాహ సంబంధాలు నిశ్చయించుకున్న వారు ఈ నెలలో శుభ ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లకు నిర్ణయించారు. ఈ నెల 12, 13, 14, 22, 27, 28, 29, 30 తేదీల్లో ముహూర్తాలు అధికంగా ఉన్నాయి. జిల్లాలో వేలాది జంటలు ఈ ముహూర్తాల్లో ఒకటి కానున్నాయి. గత డిసెంబరు తరువాత సాధారణ పరిస్థితులు నెల కొనడంతో వివాహాలు ఘనంగా నిర్వహించాలని ఎక్కువ మంది నిర్ణయించుకున్నారు. కానీ కరోనా కేసులు తమ ఆశలను నీరు గార్చాయని నిర్వాహకులు వాపోతున్నారు. 



Updated Date - 2021-05-08T03:58:41+05:30 IST