ఇదేనా రైతు పక్షపాతం?

ABN , First Publish Date - 2022-05-22T05:48:22+05:30 IST

ఇదేనా రైతు పక్షపాతం?

ఇదేనా రైతు పక్షపాతం?

- శాశ్వత ప్రయోజనాలనిచ్చే పథకాలకు మంగళం

- సూక్ష్మ.. యాంత్రిక.. జలకళకు మూడేళ్లుగా నిల్‌

- రైతు భరోసా పేరిట కొద్దిపాటి డబ్బుతో మమ

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం తాము రైతు పక్షపాతమంటూ రైతులకు ఏ రాయితీలూ అందకుండా చేస్తోంది. ఉన్న పథకాలను ఎత్తివేసి దీర్ఘకాలిక ప్రయోజనం కల్పించే వాటికి మంగళం పలుకుతోంది. టీడీపీ హయాంలో రైతులకు లాభసాటిగా ఉన్న పథకాలను పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో రైతులే సొంత డబ్బులు వెచ్చించి పరికరాలు, యంత్రాలు సమకూర్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. పెట్టుబడికే అప్పు చేయాల్సిన స్థితిలో వాటి కొనుగోలు రైతులకు పెనుభారంగా మారింది.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ పెద్దలు రైతులకు ఎంతో చేస్తామన్నారు. శాశ్వత ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. అధికారంలోకి రాగానే రైతుభరోసా పథకాన్ని తీసుకుని వచ్చారు. దీన్ని సాకుగా చూపుతూ గత ప్రభుత్వాలు చేపట్టిన పథకాలను పూర్తిగా పెట్టారు. ముఖ్యంగా సూక్ష్మసేద్య పరికరాలు, వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలను పూర్తిగా నీరుగార్చారు.


సూక్ష్మసేద్యం ఏదీ?

ప్రతిఏటా వేల సంఖ్యలో బిందు, తుంపెర సేద్య పరికరాలు గత ప్రభుత్వాలు రైతులకు అందించేవి. దీనివల్ల తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలోని పంటలను సాగుచేసుకునే అవకాశం కలిగేది. అంతేకాకుండా ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగేందుకు దోహదపడేది. ముఖ్యంగా వాణిజ్య పంటలు ఆయిల్‌పామ్‌, అరటి, జామ, కొబ్బది, మామిడి, జీడిమామిడి, సీతాఫలం తదితర వాటికి బిందు సేద్యం అనువుగా ఉంటుంది. కానీ వైసీపీ ప్రభుత్వం సూక్ష్మ వ్యవసాయ విధానాలకు మంగళం పలికింది. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి సూక్ష్మవ్యవసాయ పథకాల ద్వారా రాయితీపై పరికరాలు అందిస్తామని ప్రకటించారు. నేటికీ ఇది అమలు కాలేదు. జిల్లా 3లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్నాయి. వీటికి సూక్ష్మ వ్యవసాయ పరికరాలు అవసరం.


యాంత్రీకరణకు మంగళం

వ్యవసాయ పనులకు కూలీల కొరత భారీగా ఉంది. రోజుకు రూ.500-600 ఇస్తామన్నా లభించని కూలీలు దొరకని పరిస్థితి. దీంతో వ్యవసాయ యాంత్రీకణ అవశ్యకత పెరిగింది. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబడితో వ్యవసాయ పనులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యవసాయ యాంత్రీకణ కింద గత టీడీపీ ప్రభుత్వం ట్రాక్టర్లు, వీడర్లు, కలుపుతీసే యంత్రాలు, నాట్లు వేసే యంత్రాలు, స్ర్పేయర్లు, హార్వెస్టింగ్‌ యంత్రాలు తదితర వాటిని అందించింది. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం యాంత్రీకణ రాయితీలు ఎత్తివేసింది. రైతు గ్రూపులకు యంత్ర పరికరాలు అందిస్తున్నట్లు ప్రకటించినా అవి ప్రకటనలకే పరిమితం అయ్యాయి. రైతు భరోసా కేంద్రాల్లో కూడా పరికరాలు అందుబాటులో లేవు. తద్వారా ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ దూరం చేసింది. దీనివల్ల రైతులు ఆదాయం భారీగా కోల్పోతున్నారు. పెట్టుబడులు కూడా రావటం లేదు.


బోరుబావులు ఎక్కడ?

సాగునీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాల్లో భూగర్భ జలాలను వినియోగించుకోవటం ద్వారా సాగు విస్తీర్ణాన్ని పెంచాలని గత ప్రభుత్వాలు భావించాయి. దీనికోసం ఇందిర జల ప్రభ, ఎన్టీఆర్‌ జలసిరి పేర్లతో రైతులకు బోర్లు వేయించేవి. రాయితీ ద్వారా డ్రిల్లింగ్‌ చేసి వ్యవసాయ పంపు సెట్లు అందించేవి. వైసీపీ వచ్చాక జగనన్న జల కళ పేరుతో గత పథకానికే పేరు మార్చింది. కానీ పథకాన్ని అమలు చేయటంలో పూర్తిగా విఫలమైంది. నియోజకవర్గానికి ఒక రిగ్‌ బోరు ఏర్పాటు చేసి రైతులకు బోర్లు వేస్తామని ప్రకటించింది. నియోజవర్గానికి ఒక రిగ్గుకు బదులు ఒక బోరు పథకంగా పేరుమార్చి నీరుగార్చింది. బోరు లారీలు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఇలా రైతులకు ఎంతో ప్రయోజనాన్ని అందించే పథకాలను నిర్లక్ష్యం చేస్తోంది.


ఈ పథకాన్ని అడ్డుపెట్టుకుని..

రైతులకు ఎంతో ప్రయోజనం కల్పించే పథకాలను నీరు గార్చిన ప్రభుత్వం.. రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటోంది. అయితే ఇది ఏమూలకూ సరిపోవడం లేదని రైతులు చెబుతు న్నారు. పైగా చాలామంది అర్హులకు ఈ పథకం వర్తింప జేయలేదని తెలుస్తోంది. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అంటూ రైతులకు ఏ రాయతీలు అందకుండా చేస్తోంది. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించకుండా వ్యవసాయం చేయకుండా ఇతర రంగాలవైపు, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లేలా చేస్తోంది. ఇప్పటికైనా సన్న, చిన్నకారు రైతాంగానికి వినియోగపడే సూక్ష్మ వ్యవసాయ పరికరాలు, యంత్రాలు, బోరుబావులు, వ్యవసాయ పంపుసెట్లు రాయితీపై అందించాలి.


మళ్లీ దరఖాస్తులు..

ప్రభుత్వం సూక్ష్మవ్యవసాయాన్ని నీరుగార్చింది. అయినా రైతులు వారి అవసరాల కారణంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వానికి ఏమైందో ఏమో జిల్లాల పునర్విభజన కారణంగా మళ్లీ దరఖాస్తుల స్వీకరణకు చర్యలు చేపట్టింది. ప్రస్తు తం ఆర్‌బీకేల్లో రైతులు బిందు, తుంపెర సేద్యం పరికరాలాల కోసం కంపెనీల వారీగా దరఖాస్తు చేసుకుంటున్నారు. దీనిపై ఏపీఎంఐపీ ఏపీడీ లక్ష్మీనారాయణ వద్ద ప్రస్తావించగా ప్రభుత్వం సూక్ష్మ వ్యవసాయ పరికరాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. దీనికి సంబంధించి గైడ్‌లైన్స్‌ ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని తెలిపారు.

- ఉమ్మడి జిల్లాగా ఉన్నపుడు సుమారు 18వేల మంది వ్యవసా య బోరుబావుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2వేల మంది రైతులను మొదటి దశలో అర్హులుగా గుర్తించి బోర్లు వేయాలని ప్రభుత్వ నిర్ణయించింది. వీటిని పూర్తి చేసేందుకు వీలుగా నియోజకవర్గానికి ఒక రిగ్‌బోర్‌ లారీ కేటాయిస్తామని ప్రకటించింది. కానీ ఇది కార్యరూపం దాల్చ లేదు. కొన్నిచోట్ల బోర్లు వేసినా అవి నిరుపయోగంగా ఉన్నాయి. 

- ప్రస్తుతం ఆర్బీకేల్లో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఐదుగురు రైతులకు తక్కువ కా కుండా గ్రూపుగా ఏర్పడిన వారికే పరికరాలు అందిస్తున్నారు. అయితే రైతుకు అతి ముఖ్యమైన ట్రాక్టర్‌ వంటి భారీ వ్యయంతో కూడిన యంత్రాలు అందించడం లేదు. ఇలా రైతులు కీలకంగా భావించే జగనన న్న జలకళ, తక్కువ నీటితో అధిక విస్తీర్ణంలో పంటలు పండించే సూక్ష్మవ్యవసాయ పరికరాలు, కూలీల కొరతను అధిగమించేందుకు వీలుగా యాంత్రీకరణ పథకాలను పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు.


బోరుబావులు మంజూరు చేయాలి

మళ్లీ బోరుబావులు మంజూరు చేసి సాగునీటి వనరులు అందుబాటులో లేని రైతులను ఆదుకోవాలి. నదులు, వాగులు, సాగునీటి ప్రాజెక్టులున్న రైతులు చక్కగా సాగు చేస్తున్నారు. కానీ నీరు అందుబాటులో వారికి భూగర్భ జలాలు అందుబాటులోకి తీసుకు రావాలి. బోరు, వ్యవసాయ పంపుసెట్టు, సూక్ష్మవ్యవసాయ పరికరాలు అందించాలి. 

- దాసరి సత్యనారాయణ, రైతు, విజయనగరం


యాంత్రీకరణ లేక ఇబ్బందులు

కూలీలు లభ్యం కావటం లేదు. కూలీల ఖర్చు కూడా భారీగా పెరిగింది. ఈ పరిస్థితిలో యంత్రాల అవసరం ఉంది. కానీ వ్యక్తిగతంగా అందించాల్సిన పథకాలకు ప్రభుత్వం మంగళం పలికింది. గ్రూపులుగా ఏర్పాటయ్యేందుకు రైతులు ముందుకు రారు. పథకాన్ని నీరు గార్చేలా ప్రభుత్వం యత్నిస్తోంది. 

- సీహెచ్‌ లక్ష్మణరావు, రైతు, గంట్యాడ

Updated Date - 2022-05-22T05:48:22+05:30 IST