నీటి పరీక్షలకు మంగళం!

ABN , First Publish Date - 2021-05-25T04:15:45+05:30 IST

కరోనా వేళ కలుషిత నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పారిశుధ్యం, నీటి నాణ్యత.. ఈ రెండింటిలో ఏది లోపించినా ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పవు. కరోనా విజృంభిస్తున్నా చాలా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కొరవడుతోంది. మరోవైపు సురక్షిత నీరు కరువవుతోంది. క్షేత్రస్థాయిలో క్లోరినేషన్‌ పనులు చేపట్టడం లేదు. చాలాచోట్ల ఏళ్ల తరబడి రక్షిత నీటి పథకాలు శుభ్రం చేయడం లేదు. జిల్లాలో 1,097 రక్షిత నీటి పథకాలు, 38 సమగ్ర రక్షిత పథకాలు, 16,195 చేతి పంపులు ఉన్నాయి.

నీటి పరీక్షలకు మంగళం!
ఇచ్ఛాపురంలో నీటి పరీక్షలపై అవగాహన కల్పిస్తున్న సిబ్బంది(ఫైల్‌)


 శుభ్రం చేయని ట్యాంకులు

 కలుషిత నీరే దిక్కు

రోగాలు బారిన పడుతున్న ప్రజలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

కరోనా వేళ కలుషిత నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. పారిశుధ్యం, నీటి నాణ్యత.. ఈ రెండింటిలో ఏది లోపించినా ప్రజలకు తీవ్ర ఇక్కట్లు తప్పవు. కరోనా విజృంభిస్తున్నా చాలా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కొరవడుతోంది. మరోవైపు సురక్షిత నీరు కరువవుతోంది. క్షేత్రస్థాయిలో క్లోరినేషన్‌ పనులు చేపట్టడం లేదు. చాలాచోట్ల ఏళ్ల తరబడి రక్షిత నీటి పథకాలు శుభ్రం చేయడం లేదు. జిల్లాలో 1,097 రక్షిత నీటి పథకాలు, 38 సమగ్ర రక్షిత పథకాలు, 16,195 చేతి పంపులు ఉన్నాయి. వాటి ద్వారా ప్రజలకు నీరు అందుతోంది.  శ్రీకాకుళం, టెక్కలి, పాతపట్నం, పాలకొండ, పలాస, పి.శాసనాం, రాజాం, రణస్థలం ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ప్రజలు తమ నీటి నాణ్యతను ఈ కేంద్రాల్లో పరీక్షించుకునేందుకు అవకాశం ఉంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. నిర్వహణ సరిగా లేకపోవడం ప్రజలకు శాపంగా మారింది. మొక్కుబడిగా నీటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన బోర్లలోని నీటికి ఎక్కడా పక్కాగా పరీక్షలు నిర్వహించడం లేదు. సిబ్బంది ప్రతి నెల తమ పరిధిలోని గ్రామాల్లో నీటి నమూనాలు సేకరించి రసాయనాల పరీక్ష, బ్యాక్టీరియా రిజికల్‌ పరీక్షలు చేయాల్సి ఉంది. ఇలా ఒక్కో నీటి నాణ్యత పరీక్ష కేంద్రంలో నెలకు 300 వరకు నమూనాలు పరీక్షించాల్సి ఉన్నా, అవి నామమాత్రంగానే సాగుతున్నాయి.  నీటి పరీక్ష కేంద్రాలపై ప్రచారం నిర్వహించి నిర్వహణపై తనిఖీలు చేయాలి. ప్రజలు వినియోగించుకునేలా నీటిని అందుబాటులోకి తేవాలి. ప్రతి ఊరిలో చివరి పైపులో బ్లీచింగ్‌ 0.2 పీపీఎం ఉండేలా తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి. రక్షిత పథకాలు ప్రతి నెలా శుభ్రపరచాలి. ఏ తేదీన ఎన్ని గంటలకు శుభ్రం చేశారో రికార్డులు పెట్టి స్థానికులతో సంతకం పెట్టించాలి. ఉన్నతాధికారులకు సమాచారం అందించాలి. కానీ ఇవేవీ పూర్తిస్థాయిలో పక్కాగా జరగడం లేదు. దీంతో తాగునీటి సరఫరా, నాణ్యతపై ఈ ప్రభావం పడుతోంది. ప్రజలకు కలుషిత నీరే దిక్కవుతోంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామీణ తాగునీటి సరఫరాను మెరుగుపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అప్రమత్తంగా ఉన్నాం :

ప్రజలకు ఎలాంటి భయం అవసరం లేదు. నీటి సరఫరా విషయంలో పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్నాం. ఎప్పటికప్పుడు పొటాషియం, నైట్రోజన్‌ తదితర లవణాల పరీక్షలు చేయిస్తున్నాం. నీటి సరఫరాలో ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కరిస్తున్నాం. 

- ఎం.తిరుపతి నాయుడు, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ



Updated Date - 2021-05-25T04:15:45+05:30 IST