భూమిపైనే అంగారక గ్రహం... వెళ్లాలనుకునేవారికి ఆహ్వానం...

ABN , First Publish Date - 2021-08-08T21:29:53+05:30 IST

అంగారక గ్రహం వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి, ఆసక్తిగల

భూమిపైనే అంగారక గ్రహం...  వెళ్లాలనుకునేవారికి ఆహ్వానం...

వాషింగ్టన్ : అంగారక గ్రహం వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించి, ఆసక్తిగల నలుగురికి అందులో ఒక ఏడాదిపాటు నివసించే అవకాశం కల్పించాలని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నిర్ణయించింది. అంగారక గ్రహానికి వ్యోమగాములను పంపించే ప్రయత్నాల్లో భాగంగా, అంగారక గ్రహ పరిశోధక పరిస్థితులను ఏర్పాటు చేసి, భవిష్యత్తులో చేయబోయే ప్రయోగాలకు సిద్ధమవడం కోసం  ఈ ఏర్పాటు చేస్తోంది. 


నాసా శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం, హూస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌లో ఉన్న ఓ భవనంలో 1,700 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పరిశోధక వాతావరణాన్ని సృష్టిస్తారు. దీనిని మార్స్ డ్యూన్ ఆల్ఫా అని పిలుస్తారు. దీనిని త్రీడీ ప్రింటర్ సహాయంతో రూపొందించారు.  నలుగురిని ఎంపిక చేసి, ఓ ఏడాదిపాటు దీనిలో నివసించేందుకు ఏర్పాట్లు చేస్తారు. భూమిపై కృత్రిమ వాతావరణ పరిస్థితుల్లో, దీర్ఘకాలం సూక్ష్మ దృష్టితో, జాగ్రత్తగా వ్యవహరిస్తూ వ్యక్తులు ఏ విధంగా స్పందిస్తారో పరిశీలిస్తారు. 


అంగారక గ్రహంలో ఎదురయ్యే సవాళ్లను ఈ కృత్రిమ వాతావరణంలో ఏర్పాటు చేస్తారు. వనరుల పరిమితులు, పరికరాల వైఫల్యం, కమ్యూనికేషన్‌లో అంతరాయాలు వంటివాటిని సృష్టిస్తారు. దీనిలో ఉండేవారు సిమ్యులేటెడ్ స్పేస్‌వాక్స్, సైంటిఫిక్ రీసెర్చ్, వర్చువల్ రియాలిటీని ఉపయోగించడం, రోబోటిక్ కంట్రోల్స్, ఉత్తర, ప్రత్యుత్తరాలు ఇచ్చిపుచ్చుకోవడం వంటివి చేస్తారు. ఈ సందర్భంగా అందుబాటులోకి వచ్చే సైంటిఫిక్ డేటా చాలా ముఖ్యమైనది. దీని ఆధారంగా సిస్టమ్స్‌ను వ్యాలిడేట్ చేస్తారు, సమస్యలకు పరిష్కారాలను అభివృద్ధిపరుస్తారు. 


క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లొరేషన్ అనలాగ్‌ క్రింద మూడు మిషన్స్‌ను నాసా ప్లాన్ చేసింది. వీటిలో మొదటిది వచ్చే ఏడాది సెప్టెంబరు 1 నుంచి నవంబరు 30 మధ్యలో ప్రారంభమవుతుంది. 


ఈ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తిగల అమెరికన్ పౌరులు, లేదా, పర్మినెంట్ రెసిడెంట్స్ దరఖాస్తు చేయవచ్చునని నాసా తెలిపింది. అక్రెడిటెడ్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి ఇంజినీరింగ్, గణితం, లేదా, బయలాజికల్, ఫిజికల్, లేదా, కంప్యూటర్ సైన్స్ వంటివాటిలో STEM ఫీల్డ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసినవారు దరఖాస్తు చేసేందుకు అర్హులని తెలిపింది. STEMలో రెండేళ్ళ డాక్టొరల్ ప్రోగ్రామ్ లేదా మెడికల్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని తెలిపింది. టెస్ట్ పైలట్ ప్రోగ్రామ్‌ను కూడా పరిశీలిస్తామని పేర్కొంది. దరఖాస్తుదారుల వయసు 30 ఏళ్ళ నుంచి 55 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొంది. ఇంగ్లిష్‌లో ప్రావీణ్యం ఉండాలని, శారీరకంగా ఆరోగ్యవంతులై ఉండాలని, ధూమపానం అలవాటు ఉండకూడదని తెలిపింది. 


గతంలో రష్యా కూడా మార్స్ 500 పేరుతో మార్స్ మిషన్‌ను నిర్వహించిందని కెనడాకు చెందిన మాజీ వ్యోమగామి క్రిస్ హాడ్‌ఫీల్డ్ తెలిపారు. దీనిలో సాధారణ వ్యక్తులకు స్థానం కల్పించారని, ఇది సఫలం కాకపోవడానికి కల కారణాల్లో ఇదొకటని వివరించారు.


Updated Date - 2021-08-08T21:29:53+05:30 IST