‘తెలుగు వాగ్ధాటి’ గరికిపాటి

Published: Fri, 28 Jan 2022 00:51:23 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తెలుగు వాగ్ధాటి గరికిపాటి

అధ్యాపనం, అవధానం, ప్రవచనం ప్రధాన భూమికలుగా ఉన్న వైవిధ్యభరితమైన జీవన గమనంలో నుంచి ఉత్తుంగ శిఖరాలకు ఎగసినగొప్ప కెరటం గరికిపాటి. సనాతనతకు, ఆధునికతకు వారధిగా నిలుస్తూ, తెలుగు పద్యాన్ని రెపరెపలాడిస్తూ, అవధానాన్ని అందలం ఎక్కిస్తున్న తెలుగు ప్రవచన ప్రభాకరుడు ఈ ‘పద్మ’ పురస్కార శోభితుడు.


నేటి కాలంలో తెలుగువారికి బాగా పరిచయమైన పేరు గరికిపాటి నరసింహారావు. యూట్యూబ్ వంటి సోషల్ మీడియా, ఏబీఎన్ వంటి ఛానల్స్ ద్వారా ప్రతిరోజూ కొన్ని లక్షలమంది ఆయన ప్రసంగాలను వింటూ ఉంటారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ మొదలు పవన్ కల్యాణ్ సినిమా చూసి పరవశించే పల్లెటూరి పిల్లాడి వరకూ ఎందరెందరో ఆయన మాటలకూ అభిమానులుగా మారిపోయారు. అంతటి అభిమానధనాన్ని పొందిన ఐశ్వర్యవంతుడు గరికిపాటి.


ఈ భాగ్యవంతుడిని ఈ ఏడాది ప్రతిష్ఠాత్మకమైన ‘పద్మశ్రీ’ వరించింది. గరికిపాటి కేవలం కవి, పండితుడు, ప్రవచనకర్త మాత్రమే కాదు, ప్రఖ్యాత అవధాని కూడా. పద్మశ్రీ ప్రదానం ద్వారా, తెలుగువాడి సంతకంగా అభివర్ణించే ‘అవధాన విద్య’కు ఘన గౌరవం దక్కినట్లయింది. గరికిపాటిని మేటిగా నిలిపింది సాటిలేని అతని వాగ్ధాటి. తెలుగు పలుకులో ఇంత చమత్కారం ఉందా, తెలుగు నుడికారంలో ఇంత మమకారం ఉందా, మాటవిరుపులో ఇంత మైమరుపు ఉందా? అని నేటితరం యువతకు కూడా తెలిసేట్టు చెప్పే ప్రసంగప్రతిభ ఆయన సొత్తు.


నన్నయ్య నుంచి నవకవి వరకూ, ఆదిశంకరాచార్యుడు నుంచి ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రవిశంకర్ వరకూ అనేక పేర్లు ఆయన ప్రసంగంలో వినిపిస్తూ ఉంటాయి. ‘కనకధారాస్తోత్రం’ నుంచి కారల్ మార్క్స్ ‘కాపిటల్’ వరకూ ఆయన ఉటంకిస్తూ ఉంటారు. పద్యాలు, శ్లోకాలు, సామెతలు, పిట్టకథలు, వ్యాకరణ సూత్రాలు, పెద్దోళ్ల గోత్రాలు ఒకటేమిటి? అప్పుడే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ వరకూ అన్నింటినీ ఆయన ప్రసంగంలో వినవచ్చు.


ఇందరు కవులు, అవధానులు, ప్రవచనకర్తలు ఉండగా, గరికిపాటివారికే అంతటి ఆకర్షణ ఎందుకు వచ్చింది? ఆయన ఎంచుకున్న ఉపన్యాస శిల్పమే అందుకు ప్రధాన కారణం. అదే ఆయనను సరికొత్తగా నిలబెట్టింది. అందుకు తన అవధాన ప్రజ్ఞ జత కట్టింది. చిన్నప్పటి నుంచీ అలవడిన చదువరితనం కలిసొచ్చింది. ప్రశ్నించే లక్షణం పనికొచ్చింది. నిరంతర సాధన తోడునీడై నిలిచింది.


సహస్రావధానిగా, ప్రవచనా ప్రభాకరుడుగా నేడు మన్ననలు పొందుతున్న గరికిపాటి జీవితప్రస్థానం వైవిధ్యభరితం. అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు, కన్నీళ్లు అన్నింటినీ ఎదుర్కొని నిలిచారు. కఠోరమైన సాధన చేశారు. ఆయన ఎదుగుదల కేవలం స్వయంకృషి. మిగిలిన అవధానులకు భిన్నంగా, మూడు పదుల వయస్సు దాటిన తర్వాతే ఆయన అవధానాలను మొదలు పెట్టారు. అనతికాలంలోనే అప్రతిహతంగా దూసుకువెళ్లారు. గరికిపాటి జీవితంలో (1) అధ్యాపనం (2) అవధానం (3) ప్రవచనం మూడు ప్రధానమైన భూమికలు. చాలాకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసినా, విశేషంగా పేరు తెచ్చినవి అవధానం, ప్రవచన క్షేత్రాలు. తాను అవధానిగా మారడానికి పూర్తి ప్రభావాన్ని చూపించింది గుంటూరు వాతావరణం. అందునా డాక్టర్ ప్రసాదరాయ కులపతి (నేటి కుర్తాళ పీఠాధిపతి) ప్రథములు. ఆ తర్వాత ఆచార్య బేతవోలు రామబ్రహ్మం. వీరిద్దరి ప్రేరణ, ప్రోత్సాహం అవధాన రంగంలో, పద్య సారస్వత రంగంలో తనను ఇంతవాడిని చేశాయని గరికిపాటి ఎప్పుడూ చెబుతూ ఉంటారు.


పూర్వరంగంలో, పదేళ్ల పాటు ‘ఆకాశవాణి’ కోసం చేసిన సమస్యాపూరణ, దత్తపది మొదలైన అంశాల సాధన అవధానరంగంలో ఆయనకు చాలా అక్కరకు వచ్చాయి. భువన విజయాలు వంటి రూపకాలు, కవిసమ్మేళనాల ద్వారా ‘ఆశుపద్య విద్య’ మరింత పదునెక్కింది. పద్యరచన ఆయనకు కొత్తగా అబ్బింది కాదు. 17–18 ఏళ్ళ ప్రాయంలోనే నాలుగు శతక రచనలు చేశారు. అలా మొదలైన ఆ సాధన ఆ తర్వాత 1,116 పద్యాల ‘సాగర ఘోష’ వంటి పరమాద్భుత రచన వరకూ చెయ్యి పట్టి నడిపింది. అవధాన ప్రదర్శనలో నిబద్ధతకు పెట్టిందిపేరు గరికిపాటి. పద్యాలను ధారాపాతంగా చెప్పడమే కాక, అన్ని పద్యాలను తిరిగి అప్పజెబితేనే ఆ అవధానం సంపూర్ణమైనట్లు. ధార, ధారణల సమ్మేళనమే ‘అవధానం’. తను ఏనాడూ ధారణను ఎగ్గొట్టిన సందర్భం ఇంతవరకూ రాలేదు. ఆ ధారణ కూడా అసాధారణం. అందుకే ఆయనకు ‘ధారణా బ్రహ్మరాక్షసుడు’ అనే బిరుదు కూడా వచ్చింది. ఆశువుగా చెప్పే పద్యంలోనూ ఎంతో కవితా సుగంధం, చమత్కార బంధం ఉంటాయి. ఆయన అవధానాలు ఆద్యంతం ఆకర్షణాభరితాలు. రచించిన పద్యాలలోనూ అదే సొగసు, సోయగం తొణికిసలాడుతూ ఉంటాయి.


ఆవేశం వచ్చినప్పుడు, ఆవేదన కలిగినప్పుడు పుట్టిన కవిత్వాన్ని ‘భాష్పగుచ్ఛం’గా లోకానికి అందించారు. ముఖ్యంగా ‘సాగరఘోష’ కావ్యానికి కేంద్ర ప్రభుత్వ గౌరవాలు ఏనాడో వచ్చి ఉండాల్సివుంది. ఎందుకో తప్పిపోయాయి. మానవ జీవన సాగరాన్ని, సముద్ర సంచలనాలను అన్వయం చేసుకుంటూ రచించిన గొప్ప కావ్యం ‘సాగరఘోష’. విశ్వఘోషలా వినిపించే ఈ రచనపై నండూరి రామమోహనరావు ‘విశ్వదర్శనం’ ప్రభావం ఉందని గరికిపాటి చెబుతూ ఉంటారు. తన స్వతంత్ర భావాలపై ధూర్జటి ప్రభావం చాలా ఎక్కువని అంటుంటారు. అవధానాలు, పద్యరచనలు కొనసాగిస్తూనే ఆయన ప్రవచనాల లోనికి లంఘించారు. పెరుగుతున్న శాటిలైట్ ఛానల్స్, ఎదుగుతున్న సోషల్ మీడియా మధ్య గరికిపాటి విశ్వరూపం ఎత్తారు. పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, శతకాలు, స్తోత్రాలు, ఉపనిషత్తులు, వేదవేదాంగాలు మొదలు సమకాలీన రాజకీయాలు, ఆహారం, వ్యవహారం, అలవాట్లు అన్నీ ఆయన ఉపన్యాసాలకు వస్తువులయ్యాయి.


అప్పుడే వచ్చే బ్రేకింగ్ న్యూస్ కూడా అందులో జొరపడుతుంది. దీనికి ‘సామాజిక వ్యాఖ్య’ అనే పేరు ఆయనే పెట్టారు. ఈ విధానం కోట్లమందిని ఆయన చుట్టూ కట్టిపడేసింది. ఇందులో, తన పూర్వ ఉపాధ్యాయుడు ఇంద్రగంటి రామచంద్రమూర్తి ఉపన్యాసబాణీ తనకు ప్రేరణగా నిలిచిందని గరికిపాటి చెబుతారు. ఆ కాలంలో రేడియాలో వచ్చే వార్తలను కూడా కలుపుకొని విశ్లేషిస్తూ ఆ మాస్టారు చేసే ప్రసంగాలు తనను ముగ్ధుడ్ని చేశాయని గుర్తుచేసుకుంటారు. ఇంతటి వైవిధ్యభరితమైన జీవన గమనంలో నుంచి పైకెగసిన గొప్ప కెరటం గరికిపాటి. ఇరవైకి పైగా రచనలు చేశారు. తను వచించే, రచించే ప్రతి పద్యాన్ని ఎప్పటికప్పుడు రాసిపెట్టుకొనే క్రమశిక్షణ ఆయన ప్రత్యేకం.


చదివిన ప్రతి పుస్తకానికీ నోట్స్ రాసుకొనే మరో సుగుణం ఆయన భూషణం. ఆ కీర్తి కిరీటంలో ఎన్నో బిరుదులు, ఘన గౌరవ, సత్కారాలు చేరాయి. స్వర్ణ కంకణాలు అందుకున్నారు. నేడు ‘పద్మ’ విభూషితులయ్యారు. జ్ఞానం మౌనంగా ఉండమని చెబుతోందని, భవిష్యత్తులో మౌనాన్ని ఎక్కువగా అశ్రయించే ప్రయత్నం చేస్తానని గరికిపాటివారు అంటున్నారు. సనాతనతకు -ఆధునికతకు వారధిగా నిలుస్తూ, తెలుగు పద్యాన్ని రెపరెపలాడిస్తూ, అవధానాన్ని అందలమెక్కిస్తూ, తెలుగు వాగ్దేవతను నమ్ముకొని ముందుకు సాగుతున్న మేటి గరికిపాటికి అభినందనలు.-మాశర్మ

సీనియర్ జర్నలిస్ట్

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.