మాస్క్‌ ఫ్రీ అమెరికా

May 15 2021 @ 07:26AM

టీకా రెండు డోస్‌లు వేయించుకున్నవారికి మాత్రమే

లేకపోతే మాస్క్‌ తప్పనిసరి.. అమెరికా సీడీసీ ప్రకటన

వాషింగ్టన్‌, మే 14: ప్రాణం మీదకు వస్తున్నా, మూతికి గుడ్డ కట్టుకోవాలంటే.. అదే మాస్క్‌ వేసుకోవాలంటే మనకే కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరికీ చిరాకే. ఎంత తొందరగా ఈ మాస్క్‌ తీసేద్దామా అని మనవాళ్లే కాదు, అమెరికా వాళ్లు కూడా ఎదురుచూస్తున్నారు. మనకంటే ముందు అక్కడి వారికే వ్యాక్సిన్‌ లభించినట్టు, మాస్క్‌ నుంచి కూడా వారికి ముందే విముక్తి లభించింది. పూర్తిగా వ్యాక్సిన్‌ తీసుకున్నవారు బహిరంగ ప్రదేశాల్లో, జనసమ్మర్థ ప్రాంతాల్లో, ఇళ్లు, కార్యాలయాల వంటి ప్రదేశాల్లో మాస్క్‌లు పెట్టుకోవాల్సిన అవసరం లేదని అమెరికాలోని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ) తాజాగా ప్రకటించింది. దాంతో రోజ్‌ గార్డెన్‌లోని ఓ సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఆయన బృందం మాస్క్‌లకు బైబై చెప్పేశారు. 


‘ఈ రోజు అమెరికాకు శుభదినం‘ అని బైడెన్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. దీంతో మహమ్మారి వ్యాప్తికి ముందటి జీవితంలోకి అమెరికా ముందడుగు వేసినట్టయిందని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త విధానాలను వెల్లడిస్తూ ‘‘అందరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి.. లేదంటే వ్యాక్సిన్‌ వేయించుకునే వరకు మాస్క్‌ ధరించండి’’ అని స్పష్టం చేశారు. ‘‘ఇటువంటి సాధారణ పరిస్థితులకు ఎప్పుడొస్తామా అని మననం ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నాం’’అని సీడీసీ డైరెక్టర్‌ రాచెల్‌ వాలెన్‌స్కీ అన్నారు. బైడెన్‌ ప్రభుత్వం, సీడీసీ ప్రకటించిన కొత్త విధానాలు ఒకవైపు చాలామందికి ఊరటనివ్వగా, మరోవైపు కొత్త సందేహాలకు తెరతీశాయి. వ్యాక్సిన్‌ వేయించుకున్నవారినీ, వేయంచుకోనివారినీ ఎలా గుర్తించాలని పలువురు తలలు పట్టుకుంటున్నారు. లక్షలాదిమంది అమెరికన్లు వ్యాక్సిన్లు వేయించుకున్నారు. 65 ఏళ్లకంటే తక్కువ వయసుగల వారందరూ పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకోలేదనే విషయాన్ని గుర్తిస్తూ ‘వ్యాక్సిన్‌ వేసుకునే వరకూ వారంతా తమను తాము కాపాడుకోవాల’ని అధ్యక్షుడు బైడెన్‌ సూచించారు. 


మాస్క్‌ వేసుకోనివారిని తామేమీ అరెస్ట్‌ చేయమని, అమెరికా ప్రజలు తమ పొరుగువారి పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని విశ్వసిస్తున్నట్టు ఆయన చెప్పారు. కాగా, మాస్క్‌కు బైడెన్‌ బై చెప్పగానే, మన దేశంలో రెండు డోసులు వ్యాక్సిన్‌ తీసుకున్న చాలామంది కూడా మాస్క్‌ తీసేయాలని అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే, కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో అది చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సిన్‌ అనేది కేవలం ఒక అదనపు రక్షణ కవచం మాత్రమేనని వారు స్పష్టం చేస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఆసుపత్రి పాలయ్యే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు. పూర్తిగా వ్యాక్సిన్‌ వేసుకున్నప్పటికీ కూడా కొవిడ్‌ నిబంధనలు పాటించడం తప్పనిసరని చెప్పారు.


Follow Us on:

తాజా వార్తలుమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.