మాస్క్‌లేకపోతే స్పాట్‌ ఫైన్‌

ABN , First Publish Date - 2021-07-26T06:03:19+05:30 IST

కరోనా నియంత్రణపై మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన దృష్టిసారించారు.

మాస్క్‌లేకపోతే స్పాట్‌ ఫైన్‌
ఆర్‌కే బీచ్‌లో మాస్క్‌లు ధరించకుండా గుంపుగా చేరిన యువతులు

కరోనా నియంత్రణకు జీవీఎంసీ కార్యాచరణ

జోన్‌ల వారీగా టాస్క్‌ఫోర్స్‌ కమిటీలు

వాణిజ్య సముదాయాలు, హోటళ్లలో తనిఖీలు

రూ.100 నుంచి రూ.25 వేల వరకు జరిమానా

నేటి నుంచే అమలు


(ఆంధ్రజ్యోతి-విశాఖపట్నం)

కరోనా నియంత్రణపై మహా విశాఖ నగరపాలక సంస్థ(జీవీఎంసీ) కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన దృష్టిసారించారు. కొత్తకేసుల నమోదు తగ్గడంతో ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగి మాస్కులు ధరించడాన్ని విస్మరిస్తున్నారని, దీనివల్ల థర్డ్‌వేవ్‌ ముంచుకొచ్చే ప్రమాదం ఉన్నందున కఠినంగా వ్యవహరించాలని కమిషనర్‌ నిర్ణయించారు. మాస్క్‌లు ధరించనివారిపై చర్యలు తీసుకునేందుకు జోన్‌లవారీగా ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేశారు. సోమవారం నుంచే వీరిని రంగంలోకి దింపుతున్నారు.

నగరంలో కరోనా కేసుల నమోదు క్రమంగా తగ్గుతోంది. దీంతో ప్రజల్లో కరోనాపట్ల భయం తొలగిపోవడంతో మాస్క్‌ధారణ, భౌతిక దూరంపాటించడాన్ని విస్మరిస్తున్నారు. దీనివల్ల థర్డ్‌వేవ్‌ విజృంభించే ప్రమాదం ఉన్నందున కఠినంగా వ్యవహరించాలని జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన నిర్ణయించారు. నగరవాసులు బయటకు వస్తే మాస్క్‌ ధరించేలా చేసేందుకు జోన్‌లవారీగా టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేయాలని అదనపు కమిషనర్‌-3 డాక్టర్‌ వి.సన్యాసిరావుని ఆదేశించారు. దీంతో ఆయన అన్ని జోన్లలోని టౌన్‌ప్లానింగ్‌, ప్రజారోగ్యం, రెవెన్యూ విభాగాల నుంచి ఒక్కొక్కరిని ఒక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌గా ఏర్పాటుచేశారు. ఇలా జోన్‌కు పరిధినిబట్టి మూడు నుంచి నాలుగు టీమ్‌లను నియమించారు. ఆయా టీమ్‌లు సోమవారం నుంచి తమ పరిధిలోని దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌, హోటళ్లను సందర్శిస్తాయి. అక్కడ సిబ్బంది ఎవరైనా మాస్క్‌ ధరించకపోయినా, మాస్క్‌లేకుండా కొనుగోలుదారులు లేదా వినియోగదారులు కనిపించినా... ఆ సంస్థ లేదా యజమానికి రూ.25 వేలు జరిమానా విధిస్తారు. అలాగే రోడ్లపై తిరిగేవారెవరైనా మాస్క్‌ ధరించకపోతే వారికి రూ.100 చొప్పున జరిమానా విధిస్తారు. జరిమానాను అక్కడికక్కడే వసూలు చేసి, వెంటనే రశీదును అందజేస్తారు. 

Updated Date - 2021-07-26T06:03:19+05:30 IST