మాస్క్‌ మౌత్‌... ఇలా చెక్‌ పెడదాం!

ABN , First Publish Date - 2022-01-25T05:30:00+05:30 IST

మాస్క్‌ ధారణ మన జీవనశైలిలో భాగమైపోయింది. అయితే మాస్క్‌తో కొవిడ్‌ నుంచి రక్షణ దక్కే మాట నిజమే అయినా, ధరించినప్పుడు మనం చేసే పొరపాట్లతో కొత్త సమస్యలు బయల్దేరుతున్నాయి. అలాంటి ఓ తాజా సమస్య ‘మాస్క్‌ మౌత్‌’. ....

మాస్క్‌ మౌత్‌... ఇలా చెక్‌ పెడదాం!

మాస్క్‌ ధారణ మన జీవనశైలిలో భాగమైపోయింది. అయితే మాస్క్‌తో కొవిడ్‌ నుంచి రక్షణ దక్కే మాట నిజమే అయినా, ధరించినప్పుడు మనం చేసే పొరపాట్లతో కొత్త సమస్యలు బయల్దేరుతున్నాయి. అలాంటి ఓ తాజా సమస్య ‘మాస్క్‌ మౌత్‌’. 


కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ మాస్క్‌ ధరించడం తప్పనిసరి. వేరొకరి నుంచి వైరస్‌ సోకకుండా ఇది మనకు రక్షణ కల్పిస్తుంది. కానీ గంటలకు గంటలు మాస్క్‌ పెట్టుకోవడంవల్ల నోటి ఆరోగ్యం దెబ్బతిని ‘మాస్క్‌ మౌత్‌’ అనే కొత్త సమస్య తలెత్తుతోంది. అయితే తగిన జాగ్రత్తలు, సూచనలు పాటిస్తే ఈ సమస్యను సులువుగా అధిగమించవచ్చు.


మాస్క్‌ ధరించినప్పుడు ఇలా...

మాస్క్‌ ధరించడం మన జీవనశైలి కాదు. కాబట్టి ఎంతో కొంత అసౌకర్యానికి లోనవడం సహజం. ఫలితంగా మాస్క్‌ ధరించినప్పుడు, మనకు తెలియకుండానే మనం ముక్కుతో కాకుండా, నోటి ద్వారా వేగంగా, గాలిని పీల్చుకోవడం మొదలుపెడుతున్నాం. ఇలా చేయడం వల్ల నోట్లో లాలాజలం తయారీ తగ్గుతుంది. దాంతో దంతాల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే నీళ్లు తాగే ప్రతిసారీ మాస్క్‌ను తొలగించక తప్పదు. మునుపటిలా గబుక్కున నీళ్లు నోట్లో పోసుకునే పరిస్థితి లేదు కాబట్టి, దాహం వేసినా, మాస్క్‌ తొలగించే అవసరం ఉండడంతో, నీళ్లు తాగాలనే కోరికను అణుచుకునే స్వభావం పెరుగుతోంది. దాంతో ఒంట్లో నీళ్ల శాతం తగ్గి, డీహైడ్రేషన్‌కు గురవుతూ ఉంటాం. ఫలితంగా నోరు పొడిబారే సమస్య పెరుగుతోంది. మాస్క్‌ ధరించడం వల్ల వదిలిన గాలినే మళ్లీ పీల్చుకునే ఇబ్బందీ ఉంటోంది. మాస్క్‌ ధరించినప్పుడు, సాధారణం కంటే ఎక్కువ కార్బన్‌డయాక్సైడ్‌ మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా నోట్లోని మైక్రోబ్స్‌ అసిడిటీ మోతాదు పెరుగుతుంది. దాంతో ఇన్‌ఫెక్షన్‌, దంతక్షయం, చిగుళ్ల వ్యాధులకు గురయ్యే అవకాశాలూ పెరుగుతాయి. రాత్రుళ్లు ఆలస్యంగా చిరుతిళ్లు తినీ, శీతల పానీయాలు, తీయగా ఉండే ఇతరత్రా పానీయాలు తాగి నోరు శుభ్రం చేసుకోకపోవడం లాంటి అలవాటు ఉన్నవాళ్లకు ఈ రకమైన నోటి సమస్యలు రెట్టింపుగా ఉంటాయి.


మాస్క్‌ శుభ్రత ముఖ్యం

ఒకే మాస్క్‌ను రోజుల తరబడి శుభ్రం చేయకుండా వాడడం మూలంగా చర్మ సమస్యలు, పెదవులు చిట్లిపోవడం, నోటి చుట్టూ దురద లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి రీయూజబుల్‌ మాస్క్‌లను ప్రతి రోజూ శుభ్రం చేసుకోవాలి. లేదంటే ప్రతి రోజూ డిస్పోడబుల్‌ మాస్క్‌లను వాడుకోవాలి. 


సరిపడా నీళ్లు తాగాలి

మాస్క్‌ మన దైనందిన జీవితంలో భాగంగా భావించక తప్పదు. కాబట్టి నీళ్లు తాగే ప్రతిసారీ మాస్క్‌ తొలగించడాన్ని ఓ పనిగా భావించకుండా, అలవాటుగా మార్చుకోవాలి. తరచూ నీళ్లు తాగుతూ, షుగర్‌ ఫ్రీ చూయింగ్‌ గమ్‌ నములుతూ ఉంటే డీహైడ్రేషన్‌ దరి చేరకుండా ఉంటుంది. 


మాస్క్‌ మౌత్‌కు అడ్డుకట్ట ఇలా...

  నోటి ద్వారా త్వరగా, వేగంగా గాలి పీల్చకుండా, ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. సరైన బ్రీతింగ్‌ టెక్నిక్స్‌ కోసం ప్రాణాయామం, యోగా సాధన చేయాలి.

మాస్క్‌లను తరచూ మారుస్తూ ఉండాలి. వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

  పెదవులు, నోటి చుట్టు పక్కల లిప్‌ బామ్‌, మాయిశ్చరైజర్‌లను క్రమం తప్పక వాడుతూ ఆ ప్రదేశాలను తేమగా ఉంచుకోవాలి.

  కాఫీ, ఆల్కహాల్‌, తీయగా ఉండే పానీయాలు, తీపి పదార్థాలు డీహైడ్రేషన్‌కు గురి చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. 

  కొబ్బరినీళ్లు, మజ్జిగ లాంటి ఆరోగ్యకరమైన పానీయాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి.

  రోజుకు రెండు సార్లు దంతధావనం చేయాలి. బ్రషింగ్‌ మూడు నిమిషాల పాటు సాగాలి. తర్వాత ఫ్లాసింగ్‌ చేయాలి. టంగ్‌ క్లీనర్‌తో నాలుకను శుభ్రం చేసుకోవాలి. గోరువెచ్చని ఉప్పు నీళ్లతో రోజుకు రెండు నుంచి మూడు సార్లు నోరు పుక్కిలించాలి.

  క్రమం తప్పక దంత వైద్యులను కలుస్తూ, దంతాల మీద ఏర్పడే గారను తొలగించుకుంటూ ఉండాలి.

  షుగర్‌ ఫ్రీ చూయింగ్‌ గమ్‌ నమలడం వల్ల నోట్లో లాలాజలం ఊరుతుంది. దాంతో నోరు డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటుంది.

   భోజనాన్ని స్వీట్‌ లేదా ఐస్‌క్రీమ్‌తో ముగించకుండా క్యారెట్‌ ముక్క, సలాడ్‌, యాపిల్‌తో ముగించండి. ఇవి సహజసిద్ధ క్లీనర్లు.

  ఒంటరిగా నడిచేటప్పుడు, వ్యాయామం చేస్తున్నప్పుడు పరిగెత్తేటప్పుడు మాస్క్‌ ధరించకపోవడమే మేలు.


మాస్క్‌ మౌత్‌ లక్షణాలు

 నోరు పొడిబారడం: నోట్లో సరిపడా లాలాజలం తయారు కాకపోవడం మూలంగా మింగడం, తినడం, మాట్లాడడం ఇబ్బందిగా మారుతుంది. 

  నోటి దుర్వాసన: నోటి శుభ్రత లోపించడం, చిగుళ్ల నుంచి రక్తస్రావంతో కూడిన జింజివైటిస్‌ అనే దంత సమస్యల వల్ల నోటి దుర్వాసన మొదలవుతుంది.

  గార: మాస్క్‌ను గంటల తరబడి ధరించడం వల్ల, నోట్లో బ్యాక్టీరియా పెరిగి, దంతాల చుట్టూ గార ఏర్పడుతుంది. ఇది క్రమేపీ దంతక్షయానికి దారి తీస్తుంది.

Updated Date - 2022-01-25T05:30:00+05:30 IST