భావజాలానికి హిందుత్వశక్తుల ముసుగులు

ABN , First Publish Date - 2022-09-22T06:40:01+05:30 IST

సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ప్రథమ ప్రధానమంత్రి అయివుంటే భారతదేశం పురోగమించి ఉండేదని నిన్నటి వరకూ చాటిన హిందుత్వశక్తులు...

భావజాలానికి హిందుత్వశక్తుల ముసుగులు

సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ ప్రథమ ప్రధానమంత్రి అయివుంటే భారతదేశం పురోగమించి ఉండేదని నిన్నటి వరకూ చాటిన హిందుత్వశక్తులు, నేడు నేతాజీ సుభాష్ చంద్రబోసు ప్రథమ ప్రధానమంత్రి అయివుంటే దేశం ఆధునికంగా ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని చాటడం ముసుగులు తొడుక్కునే చాతుర్యం తప్ప మరొకటి కాదు. ఒకప్పుడు రాజకీయ అవసరార్థం గాంధేయ సోషలిజాన్ని తమ విధానంగా ప్రకటించిన వీరు, నేడు పటేల్, బోసుల వారసత్వాన్ని అదే రాజకీయ అవసరాల కోసం హైజాక్ చేస్తున్నారు. తమ సిద్ధాంతాల పట్ల చిత్తశుద్ధి, నమ్మకం కనుక వీరు కలిగి ఉంటే తమ పార్టీకి, భావజాలానికి పునాదులైన వీర సావర్కర్, హెడ్గేవార్, గోల్వాల్కర్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, దీనదయాళ్ వంటి నాయకుల ఫోటోలనే చూపించి ప్రజలను ఓట్లు అడిగేవారు. చరిత్రలో అర్ధ సత్యాలను అపరిపక్వ కుటిల వ్యాపారాత్మక సినీ పండితులు, పురాణాలను వల్లించే చరిత్రకారులు, సోషల్ మీడియాల సాయంతో ప్రచారం చేస్తూ ఆధునిక భారతదేశ యువత మస్తిష్కాలను కలుషితం చేసి వారి ఆలోచనలను ప్రభావితం చేస్తున్నారు. జాతిపితను గౌరవించలేని స్థితికి భారతదేశ యువతను దిగజారుస్తున్నారు.


పదిహేడేళ్ల నెహ్రూ పాలన ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి, ఆధునికతకు బలీయమైన పునాదులు పడ్డ యుగం. నెహ్రూ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాలు ఆయన ఈ దేశానికి చేసిన మంచిని చెరిపి వేయలేవు. నెహ్రూను స్వాతంత్ర దినోత్సవ స్మృతుల నుంచి చెరిపివేసే సాహసం చేసిన హిందుత్వశక్తులు, తమకు ఇష్టం లేకపోయినా గాంధీజీని కొనియాడక, ఆయన సమాధికి నమస్కరించక తప్పని పరిస్థితి ఉంది. హిందూ అతివాద నాయకత్వం నేటికీ గాంధీని ప్రత్యక్షంగా ఢీకొట్టలేకపోతోంది. కారణం అంతర్జాతీయంగా చెడ్డ పేరు మూట గట్టుకోవాల్సి వస్తుందని. గాంధీ గొప్పతనం భారతీయులకన్నా విదేశీయులే ఎక్కువ గుర్తించారు. రాజపథ్‌ను కర్తవ్యపథ్‌గా మార్చినంత మాత్రాన, కింగ్ జార్జ్ విగ్రహం స్థానంలో నేతాజీ విగ్రహాన్ని పెట్టుకున్నంత మాత్రాన బానిసత్వ గుర్తులు చెరిపివేసినట్లు కాదు. సంఘ్ ఆర్థిక సిద్ధాంతకర్త దత్తోపంత్ తేంగడి సూచించిన పశ్చిమీకరణ లేని ఆధునీకరణను, గ్రామీణ ఆర్థిక వికాసాన్ని, సర్వే భవంతు సుఖినః అన్న ప్రాచీన భారతావని ప్రవచించిన సామ్యవాద లక్ష్యాన్ని అందుకున్నప్పుడే భారతదేశం బానిసత్వ గుర్తులు చెరుపుకున్నట్లు, బానిసత్వ సంకెళ్ళ నుంచి విడివడినట్లు.

గౌరాబత్తిన కుమార్ బాబు

Updated Date - 2022-09-22T06:40:01+05:30 IST