సింహాచలం దేవస్థానం సిబ్బంది భారీగా బదిలీ

ABN , First Publish Date - 2022-07-02T06:37:50+05:30 IST

సింహాచలం దేవస్థానం సిబ్బంది భారీగా బదిలీ అయ్యారు. అప్పన్న గిరి ప్రదక్షిణ ఈ నెల 12న జరగనున్న నేపథ్యంలో అంతకు ముందే జరిగిన ఈ బదిలీలు చర్చనీయాంశంగా మారాయి.

సింహాచలం దేవస్థానం సిబ్బంది భారీగా బదిలీ

 మొత్తం 27 మందికి స్థాన చలనం

కొందరికి అన్నవరం, మరికొందరికి కనకమ్మ సన్నిధిలో పోస్టింగ్‌

ఇద్దరు ఏఈవోల్లో ఒకరికి విజయవాడలో పోస్టింగ్‌

గిరిప్రదక్షిణ ముందు అధికారుల సంచలన నిర్ణయం

సింహాచలం, జూలై 1: సింహాచలం దేవస్థానం సిబ్బంది భారీగా బదిలీ అయ్యారు. అప్పన్న గిరి ప్రదక్షిణ ఈ నెల 12న జరగనున్న నేపథ్యంలో అంతకు ముందే జరిగిన ఈ బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. దేవదాయ శాఖ కమిషనర్‌ డాక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవస్థానం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సహాయ కార్యనిర్వహణాధికారుల నుంచి జూనియర్‌ అసిస్టెంట్ల వరకు మొత్తం 27 మందికి స్థాన చలనం కలిగింది.


దేవస్థానం పరిధిలో ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న 12 మంది జూనియర్‌ అసిస్టెంట్లను , నలుగురు సీనియర్‌ అసిస్టెంట్లను అన్నవరంలోని సత్యనారాయణస్వామి ఆలయానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న పన్నెండు మంది జూనియర్‌, నలుగురు సీనియర్‌ అసిస్టెంట్లను ఇక్కడ నియమించారు.  అలాగే నలుగురు జూనియర్‌ అసిస్టెంట్లను, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లను, ముగ్గురు పర్యవేక్షణాధికారులను వన్‌టౌన్‌ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఆలయానికి బదిలీ చేశారు.


అక్కడ పనిచేస్తున్న నలుగురు జూనియర్‌, ఇద్దరు సీనియర్‌ అసిస్టెంట్లను, ముగ్గురు పర్యవేక్షణాధికారులను వీరి స్థానాల్లో సింహగిరిపై నియమించారు. సింహాచల దేవస్థానంలో  సహాయ కార్యనిర్వహణాధికారులు (ఏఈవో)గా పనిచేస్తున్న కె.తిరుమలేశ్వరరావును కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి, కె.రాజేంద్రకుమార్‌ను విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానానికి బదిలీ చేశారు.  ఈనెల అప్పన్న వార్షిక ఉత్సవం గిరిప్రదర్శన జరగనుంది. ఈ సమయంలో ఇంతమంది సిబ్బంది బదిలీ కావడంతో ఉత్సవ నిర్వహణ ఈవో ఎం.వి.సూర్యకళకు సవాలనే చెప్పాలి, 

Updated Date - 2022-07-02T06:37:50+05:30 IST