Green Bawarchi హోటల్‌ భవనంలో భారీ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ లేకుంటే పరిస్థితేంటి..!?

ABN , First Publish Date - 2022-05-29T14:53:14+05:30 IST

Green Bawarchi హోటల్‌ భవనంలో భారీ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ లేకుంటే పరిస్థితేంటి..!?

Green Bawarchi హోటల్‌ భవనంలో భారీ అగ్ని ప్రమాదం ఎలా జరిగింది.. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ లేకుంటే పరిస్థితేంటి..!?

  • సెక్యూరిటీ కార్యాలయంలో దట్టమైన పొగలు
  • భవనంలో చిక్కుకున్న 14 మంది..
  • భారీ క్రేన్‌ సహాయంతో సురక్షితంగా..

పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తతో భారీ ప్రమాదం (Massive Fire Breaks) తప్పింది.. మంటల్లో .. దట్టమైన పొగ మధ్య ఐదంతస్తుల భవనంలో చిక్కుకున్న 14మందిని సురక్షితంగా రక్షించారు.


హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం : రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌కు దగ్గరలో ఉన్న గ్రాండ్‌ స్పైసీ బావర్చి హోటల్‌ (Hotel) భవనంలో శనివారం ఉదయం 10.30 గంటలకు భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రెండో అంతస్తులో ఉన్న యాక్షన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ కార్యాలయంలో జరిగిన షార్ట్‌ సర్క్యూట్‌తో (Short Circuit) ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి రక్షణ చర్యలు చేపట్టారు. ఐదు ఫైర్‌ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. భవనం రెండో అంతస్తులోని గదులు, మెట్ల ప్రాంతంలో దట్టమైన పొగ కుమ్ముకుంది. 3, 4 అంతస్తుల్లో చిక్కుకుని భయంభయంగా టెర్రస్‌పైకి చేరుకున్న 14 మందిని బ్రాంటో స్కైలిఫ్ట్‌ వాహనాన్ని (బాహుబలి క్రేన్‌) ద్వారా సురక్షితంగా కిందకు దింపారు. మంటలను పూర్తిగా ఆర్పివేశాక ఫైర్‌ కంట్రోలర్‌ అధికారులు భవనంలోకి వెళ్లి అగ్నిప్రమాదంపై ఆధారాలను సేకరించారు.


భాగ్యనగరంలో రెండు బాహుబలి యంత్రాలు.. 

భారీ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు పెద్దపెద్ద అంతస్తుల్లో, బాధితులు చిక్కుకున్నప్పుడు వారిని రక్షించడానికి వినియోగించే రెండు బ్రాంటో స్కైలిఫ్ట్‌ వాహనాలు (బాహుబలి క్రేన్‌)  అందుబాటులో ఉన్నట్లు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ క్రేన్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు పేర్కొన్నారు.


కేసు నమోదు..

ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యం వహించిన భవన యజమానిపై కేసు నమోదు చేసినట్లు రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి తెలిపారు. ప్రమాదం ఉదయం జరిగినా  సాయంత్రం వరకూ భవన యజమాని బయటకు రాకపోవడం గమనార్హం. ఐదు అంతస్తుల భవనానికి ఎలాంటి ఫైర్‌ సేఫ్టీ జాగ్రత్తలు తీసుకోలేదని అధికారులు తెలిపారు.


వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ తప్పిన పెను ప్రమాదం..

హైమార్క్‌ చాంబర్‌ భవనం (జీ ప్లస్‌ ఫోర్‌) నాలుగు అంతస్తులు కలిగి ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో బావర్చి హోటల్‌ ఉండగా మొదటి, మూడవ అంతస్తుల్లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు ఉన్నాయి. రెండవ, నాల్గవ అంతస్తుల్లో యాక్షన్‌ సెక్యూరిటీ సర్వీస్‌ కార్యాలయం ఉంది. సాఫ్ట్‌వేర్‌ కార్యాలయాల్లో సుమారు 100 మంది ఉద్యోగులు పనిచేస్తారు. ప్రస్తుతం వర్క్‌ఫ్రమ్‌ హోం ఉండటం, వీకెండ్‌ కావడంతో ఎవరూ లేరు. దీంతో పెనుప్రమాదం తప్పింది. కాగా,  అగ్నిప్రమాద ఘటనతో ఖాజాగూడ జంక్షన్‌ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌, రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ తిరుపతి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనాథ్‌ ఇతర పోలీస్‌ సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దారు.

Updated Date - 2022-05-29T14:53:14+05:30 IST