హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 80 లక్షల ఆస్తి నష్టం

May 11 2021 @ 11:19AM

  • ఏడు ఆప్టికల్‌, ఓ దుస్తుల దుకాణం దగ్ధం  
  • 10 గంటలు శ్రమించి మంటలను అదుపు చేసిన సిబ్బంది 
  • 80 లక్షల ఆస్తి నష్టం

మూసి ఉన్న షాపుల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వ్యాపారులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పది గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను ఆర్పివేశారు.  ఈ సంఘటన సుల్తాన్‌బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోఠి హనుమాన్‌ టెక్డీ ప్రధాన రహదారిలో చోటు చేసుకుంది.


హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : హనుమాన్‌ టెక్డీ ప్రధాన రహదారిలో ఉన్న నకోడా కాంప్లెక్‌లోని ప్రకాష్‌ అనే వ్యక్తికి చెందిన మహవీర్‌ ఆప్టికల్స్‌ షాపులో ఉదయం 8 గంటల సమయంలో షాట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు వ్యాపించాయి. ఈ షాపునకు ఆనుకొని అఖిలేష్‌కు చెందిన దుస్తుల షాపులు ఉండగా వాటికీ మంటలంటుకున్నాయి. ప్రమాదంలో ఏడు ఆప్టికల్‌ షాపులు, ఒక దుస్తుల దుకాణం దగ్ధమయ్యాయి. ఇతర లైఫ్‌ స్టాల్‌ సామగ్రికి సంబంధించి షాపులు ఉండడంతో నిర్వాహకులు సామగ్రిని తరలించేందుకు తీవ్రంగా శ్రమించారు. సమాచారం అందుకున్న సుల్తాన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ సుబ్బరామిరెడ్డి, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 


నిర్విరామంగా సాయంత్రం 6 గంటల వరకు 4 ఫైరింజన్ల సహకారంతో మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.80లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు, డీఎ్‌ఫవో తెలిపారు. గ్రౌండ్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌లోని షాపుల్లోని సామగ్రి కాలిపోయినట్లు పేర్కొన్నారు. ఈ భవనాకి ఫైర్‌సెఫ్టీ లేకపోవడంతో పాటు కనీసం షాపుల్లోను ఫైర్‌ ఎక్వి్‌ప్‌మెంట్స్‌ లేవని అధికారులు గుర్తించారు. 


ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

నిత్యం రద్దీగా ఉండే హనుమాన్‌ టెక్డీ రోడ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో కాంప్లెక్స్‌లో నివాసం ఉంటున్న ప్రజలు, వ్యాపారులు బయటకు పరుగులు పెట్టారు. దట్టమైన పొగల కారణంగా హనుమాన్‌ టెక్డీ ప్రాంతంలో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.