భారీ స్కామ్.. ఇప్సర్ అరెస్ట్.. తెలంగాణ, తమిళనాడు పోలీసుల సోదాలు

ABN , First Publish Date - 2021-01-25T01:25:06+05:30 IST

భాగ్యనగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది....

భారీ స్కామ్.. ఇప్సర్ అరెస్ట్.. తెలంగాణ, తమిళనాడు పోలీసుల సోదాలు

హైదరాబాద్‌ : భాగ్యనగరంలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది.! 2019లో ఈ భారీ స్కాం ఇప్పుడు పెను సంచలనమైంది. పూర్తి వివరాల్లోకెళితే.. నగరంలో బీహెచ్‌ఈఎల్‌లోని ఓ ఇంట్లో తమిళనాడు, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా సోదాలు చేస్తున్నారు. భారీ బ్యాంక్ రాబరీ కేసులో సోదాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. చెన్నైలోని రూబీ గోల్డ్‌ స్కాంలో యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆయనతో పాటు ఇఫ్సర్‌ సోదరుడు అనీస్‌ రెహమాన్‌, షాపులో పనిచేసే మరో ముగ్గురు మహిళలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వడ్డీలేని రుణాలు ఇస్తానని భారీగా ఆభరణాలు తీసుకుని దాదాపు 1500 మందిని రెహమాన్‌ మోసం చేసినట్లు తెలియవచ్చింది. మొత్తం రూ.300 కోట్లకు విలువైన వెయ్యి కిలోల బంగారాన్ని ఇఫ్సర్‌ సేకరించినట్లు తేలింది. బంగారు విలువకు మూడొంతుల డబ్బు ఇస్తానని జనాలకు మాయమాటలు చెప్పి ఇతను నమ్మించాడు. దీంతో 1500 మంది తమ ఆభరణాలను రుణాల కోసం ఇచ్చారు. దీన్నే అదనుగా చేసుకున్న ఇప్సర్ ఈ భారీ ఆభరణాలతో అడ్రస్ లేకుండా పోయాడు. 


2019లో ఈ భారీ స్కాం జరిగింది. అయితే నాటి నుంచి ఇప్పటి వరకూ రూబీ గోల్డ్‌ యజమాని ఇఫ్సర్‌ రెహమాన్‌ పరారీలో ఉన్నాడు. అయితే ఇవాళ యజమానిని, ఆయన సోదరుడు.. మరో ముగ్గుర్ని అరెస్ట్ చేయడంతో హాట్ టాపిక్ అయ్యింది. అటు తమిళనాడు పోలీసులు.. ఇటు లోకల్ పోలీసులు ఇద్దరూ సంయుక్తంగా సోదాలు నిర్వహిస్తుండటంతో ఈ వ్యవహారం రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ అయ్యింది. అయితే సోదాల్లో ఏమేం దొరికాయి..? ఇంకా ఎన్నిరోజులు సోదాలు చేస్తున్నారు..? ఏయే ప్రాంతాల్లో ఇంకా సోదాలు చేస్తారు..? అనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సోదాలు పూర్తయ్యాక పోలీసు ఉన్నతాధికారులు మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడిస్తారని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.





Updated Date - 2021-01-25T01:25:06+05:30 IST