ltrScrptTheme3

‘మాస్టర్‌’ మూవీ రివ్యూ

Jan 13 2021 @ 14:00PM

చిత్రం: మాస్టర్‌

వ్యవథి:  179 నిమిషాలు

సెన్సార్‌: యు/ఎ

బ్యానర్‌: ఎక్స్‌బీ ఫిలిం క్రియేటర్

తెలుగు విడుదల: ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ మహేశ్‌ కోనేరు

నటీనటులు:  విజయ్‌, విజయ్‌ సేతుపతి, మాళవికా మోహనన్‌, ఆండ్రియా, అర్జున్‌ దాస్‌, శాంతన్‌ భాగ్యరాజ్‌, నాజర్‌ తదితరులు

సంగీతం:  అనిరుద్‌ రవిచంద్రన్‌

ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌

సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూర్యన్‌

నిర్మాత: గ్జేవియర్‌ బ్రిటో

దర్శకత్వం:  లోకేశ్ కనకరాజ్


కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'మాస్టర్‌'. విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. ఇద్దరు స్టార్స్‌ నటించిన ఈ సినిమాను డైరెక్ట్‌ చేసింది లోకేశ్‌ కనకరాజ్‌. ఈయన దర్శకత్వంలో విడుదలైన నగరం, ఖైది చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరించడంతో 'మాస్టర్‌' సినిమాపై అంచనాలను ఏర్పడ్డాయి. తెలుగులో అదిరింది(మెర్సల్‌), విజిల్‌(బిగిల్‌) చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్‌.. మరి మాస్టర్‌ సినిమాతో ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకున్నాడో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..


కథ:

జేడీ(విజయ్‌) సిటీలోని ఓ పెద్ద కాలేజ్‌లో ప్రొఫసర్‌. తన వ్యక్తిగత కారణాలతో తాగుతూ మత్తులో ఉంటాడు. స్టూడెంట్స్ అందరూ జేడీని ఇష్టపడుతుంటారు. దాంతో మేనేజ్‌మెంట్‌ జేడీపై చర్యలు తీసుకోవడానికి ఇబ్బందిపడుతుంటుంది. అదే సమయంలో కాలేజీలో ఎన్నికలు జరుగుతాయి. అందరూ కాలేజ్‌లో ఎలక్షన్స్‌ వద్దని అంటారు. కానీ జేడీ మాత్రం ఎన్నికలు పెడితే మంచిదని అంటాడు. తన ఆధ్వర్యలోనే ఎన్నిలు జరుగుతాయని, ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే జేడీ.. బాధ్యత తీసుకుని కాలేజ్‌ విడిచి వెళ్లిపోవాలనే కండీషన్‌ మీద ఎన్నిలు నిర్వహిస్తారు. అయితే కాలేజీలో అనుకుండా గొడవలు జరుగుతాయి. కాలేజీ నుండి సస్పెండ్‌ అవుతాడు. అయితే ఈ గ్యాప్‌లో వరంగల్‌లోని బాల నేరస్థులకు మాస్టర్‌గా నియమితుడవుతాడు. మాస్టర్స్‌ అందరూ వెళ్లే ఈ బాల నేరస్థుల వద్దకు జేడీ ఎందుకు వెళతాడు? అసలు భవాని ఎవరు?  భవానీకి, జ్యువనైల్‌ హోంకు సంబంధం ఏంటి? జ్యువనైల్ హోంలో సమస్య ఏంటి? జేడీ ఆ సమస్యను ఎలా సాల్వ్‌ చేశాడు?  అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

సమీక్ష:

కోలీవుడ్‌లో హీరో విజయ్‌కు పక్కా మాస్‌ ఇమేజ్‌ ఉంది. ఈ మధ్య విడుదలైన ఆయన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ దగ్గర సెన్సేషన్‌ను క్రియేట్‌ చేసినవే. తెలుగులోనూ అదిరింది, విజిల్‌ చిత్రాలతో సక్సెస్‌ను సాధించాడు. ఈ క్రమంలో విజయ్‌ హీరోగా ప్రకటించిన సినిమా మాస్టర్‌. ఆసక్తికరమైన విషయమేమంటే అప్పటి వరకు రెండు సినిమాలను మాత్రమే చేసిన దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తాడని తెలియడంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్‌ అయ్యాయి. ఈ అంచనాలకు తగినట్లు విజయ్‌ సేతుపతి కూడా టీమ్‌కు యాడ్‌ అయ్యాడు. భారీ అంచనాల నడుమ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం..అంచనాలను అందుకోవడం సక్సెస్‌ కాలేదనే చెప్పాలి. రెండు బ్లాక్‌బస్టర్‌ సినిమాలు చేసిన డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ ఈ సినిమాను డైరెక్ట్‌ చేశాడా? అనిపించేలా సినిమా ఉంది. సాధారణంగా లోకేశ్‌ కనకరాజ్‌ బలం.. స్క్రీన్‌ప్లే, ఎమోషన్స్‌. ఈ సినిమాలో ఆ రెండు మిస్‌ అయ్యాయి. ఇంటర్వెల్‌ బ్రేక్‌కు కాసేపు ముందే అసలు కథలోకి వెళ్లాడు దర్శకుడు. అప్పటి వరకు హీరో బిల్డప్‌ సీన్స్‌కే సరిపోయింది. పోనీ ఆ బిల్డప్‌ సీన్స్‌ ఏమైనా విజయ్‌ అభిమానులను అలరించేలా ఉన్నాయా? అంటే అది కూడా లేదు. ఇంటర్వెల్‌ బ్రేక్‌, జ్యువనైల్ హోంలో ఆడే కబడీ సన్నివేశాలు మినహా ఏదీ ఆకట్టుకోలేదు. అనిరుధ్‌ సంగీతంలో పాటలు వినడానికి బావున్నాయి కానీ.. తెరపై ఆకట్టుకోలేదు. ఇక బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ సరేసరి. సత్యం సూర్యన్‌ సినిమాటోగ్రఫీ బావుంది. సినిమా వ్యవథి మూడు గంటలుంది. సులభంగా ఓ ముప్పై ఐదు నుండి నలబై నిమిషాల కథను ఎడిట్‌ చేసుకుంటే బావుండేది. ఫస్టాఫ్‌ కంటే సెకండాప్‌ మరీ ల్యాగ్‌గా ఉంటుంది. పాత్రల విషయానికి వస్తే హీరో విజయ్ , డైరెక్టర్‌ను ఫాలో అవుతూ ఆయన చెప్పింది చేసుకుంటూ వెళ్లిపోయాడని పక్కాగా తెలుస్తుంది. ఇక విజయ్‌ సేతుపతి రోల్‌ సినిమాకు హైలైట్‌గా ఉంది. సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ చేశాడు. మాళవికా మోహనన్‌ పాత్ర పరిమితంగానే ఉంది. ఆండ్రియా, అర్జున్‌ దాస్‌, శాంతన్‌ భాగ్యరాజ్‌ తదితరులు వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. సినిమా మొత్తంగా చూస్తే డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌.. విజయ్‌ ఇమేజ్‌ను హ్యాండిల్ చేయలేకపోయాడని అర్థమవుతుంది.


చివరగా.. మాస్టర్‌.. గతి తప్పాడు

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.