మాస్టర్‌ప్లాన్‌పై దోబూచులాట

ABN , First Publish Date - 2021-07-27T05:41:33+05:30 IST

మాస్టర్‌ప్లాన్‌-2041 ప్రజలకు అర్థం కాకుండా వీఎంఆర్‌డీఏ చివరి వరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టనిపిస్తోంది.

మాస్టర్‌ప్లాన్‌పై దోబూచులాట

తెలుగులో ఇంకా అందుబాటులోకి రాని వివరాలు

అభ్యంతరాలు తెలిపేందుకు నాలుగు రోజులే గడువు

వచ్చే నెలాఖరు వరకూ సమయం ఇవ్వాలని డిమాండ్‌

నేడు వీఎంఆర్‌డీఏ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


మాస్టర్‌ప్లాన్‌-2041 ప్రజలకు అర్థం కాకుండా వీఎంఆర్‌డీఏ చివరి వరకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టనిపిస్తోంది. మొత్తం ఇంగ్లీష్‌లో ఉందని, ఏమీ అర్థం కావడం లేదని, తెలుగులో ప్లాన్‌ వివరాలు పొందుపరచాలని కోరుతూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా ఒకసారి ఇలాగే జరిగింది. అందరికీ అర్థమయ్యే భాషలో వివరాలు వుంచాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నా...దానిని ఉద్దేశపూర్వకంగానే విస్మరించారు. అలా చేస్తే అభ్యంతరాలు వేల సంఖ్యలో వస్తాయని మౌనం దాల్చారు. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా ప్రతినిధులు మాస్టర్‌ ప్లాన్‌ను తెలుగులో పెట్టాలని డిమాండ్‌ చేయగా, దానికి వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కోటేశ్వరరావు అంగీకరించారు. కానీ అది సోమవారం వరకు అందుబాటులోకి రాలేదు. ఈ మాస్టర్‌ ప్లాన్‌పై అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి ఈ నెల 31వ తేదీ వరకే గడువు ఉంది. అంటే ఇంకో నాలుగు రోజులు. ఈలోపు దానిని డౌన్‌లోడ్‌ చేసుకొని, అర్థం చేసుకొని, అభ్యంతరాలు వ్యక్తంచేయడానికి సమయం సరిపోదు. కాబట్టి ఇంకో నెల రోజులు గడువు పెంచాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. 


నేడు బీజేపీ ధర్నా


మాస్టర్‌ప్లాన్‌-2041ను వ్యతిరేకిస్తూ మంగళవారం వీఎంఆర్‌డీఏ కార్యాలయం ముందు ధర్నా చేయాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. ఎన్ని విజ్ఞప్తులు చేసినా తెలుగులో వివరాలు పొందుపరచకపోవడం, మాస్టర్‌ప్లాన్‌ రహదారుల సర్వే నంబర్లు ప్రచురించకపోవడం, గత మాస్టర్‌ ప్లాన్‌ వివరాలు ఎక్కడా ప్రస్తావించకపోవడం, దానికి కొనసాగింపు కొత్త మాస్టర్‌ ప్లాన్‌ లేకపోవడం వంటి అంశాలపై ధర్నా చేయనున్నామని పార్టీ నగర అధ్యక్షుడు ఎం.రవీంద్ర తెలిపారు.


సామాన్యులకు గృహ వసతి ఏదీ

అజ శర్మ, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక


వీఎంఆర్‌డీఏ తయారుచేసిన మాస్టర్‌ ప్లాన్‌ ‘సరకు తక్కువ-సోది ఎక్కువ’ రీతిలో ఉంది. తెలుగులో వివరాలు లేవు. కాబట్టి సెప్టెంబరు 30 వరకు అభ్యంతరాలకు సమయం ఇవ్వాలి. వీఎంఆర్‌డీఏ అసలు లక్ష్యం సామాన్యులకు గృహ వసతి కల్పించడం. ఈ ప్లాన్‌లో ఆ ప్రస్తావన ఎక్కడా లేదు. ఇది అంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పెరిగేలా రూపొందించారు. మెట్రో రైలు ప్రతిపాదన ఒక్క అంగుళం కదల్లేదు. దాని కోసం భూ సేకరణ, ల్యాండ్‌ పూలింగ్‌ అంటూ పేదలు, రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమర్థనీయం కాదు. ఈ ప్లాన్‌ ఆమోదిస్తే...సామాన్యులు ఇక గృహాలు నిర్మించుకునే పరిస్థితి ఉండదు. అనుమతులు రావు. ఈ ప్లాన్‌ను ప్రజావసరాలకు అనుగుణంగా మార్చాలి.

Updated Date - 2021-07-27T05:41:33+05:30 IST