అక్రమ సంపాదనకు మాస్టర్‌ ‘ప్లాన’

Jul 25 2021 @ 23:52PM
ఇరుకుగా ఉన్న బంగారు అంగళ్ల వీధి

జోన్ల మార్పులో చేతివాటం

ముడుపులిచ్చినవారికి అనుకూలం

అనుడా రహస్య విచారణ

ప్రొద్దుటూరు, జూలై 25: పట్టణాభివృద్ధి కోసం మాస్టర్‌ప్లాన కొంతమందికి కాసులు కురిపిస్తోందనే ఆరోపణలున్నాయి. 1989లో రూపొందించిన మాస్టర్‌ప్లాన ఇప్పటికీ ప్రొద్దుటూరులో అమలవుతోంది. ప్రతి రెండు దశాబ్దాలకు ఒకమారు పట్టణ ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా పట్టణాభివృద్ధికి ప్లాన చేస్తారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు పట్టణాన్ని మరింత విస్తృతపరిచి అభివృద్ధి చేసేందుకు మున్సిపల్‌ అధికారులు మాస్టర్‌ప్లాన రూపొందించి పంపారు. తూర్పున ఉప్పరపల్లె, పడమర పెద్దశెట్టిపల్లె, ఉత్తరాన గోపవరం, దక్షిణాన పెన్నానది, పోట్లదుర్తి వరకు మున్సిపల్‌ పరిధిని విస్తరించేలా రూపొందించారు. దీంతో ప్రొద్దుటూరు పట్టణ వైశాల్యం గణనీయంగా పెరగనుంది. ఈ మేరకు అన్నమయ్య అర్బన డెవల్‌పమెంట్‌ అథారిటీ (అనుడా) గత నెల 24న డ్రాఫ్ట్‌ నోటిఫికేషన విడుదల చేసింది. అప్పటి నుంచి కొంతమంది నాయకులు అక్రమ సంపాదనకు ప్రణాళికలు రూపొందించారు. తమ పలుకుబడితో మీకు అనుకూలమైన జోన్లు ఏర్పాటు చేస్తామంటూ వ్యాపారులు, ఆస్పత్రుల నిర్వాహకులకు భరోసా కల్పిస్తున్నట్లు సమాచారం. పేరున్న నాయకులు కావడంతో చాలామంది వీరిని ఆశ్రయించి ముడుపులు సమర్పించుకున్నట్లు ఆరోపణలున్నాయి.


ఇందులో కొన్ని మచ్చుకు పరిశీలిస్తే...

గాంధీ రోడ్డుకు సమీపంలో ఉన్న ఒక ఆస్పత్రి ప్రస్తుతం రెసిడెన్షియల్‌ జోనలో ఉండగా దానిని కమర్షియల్‌ జోనలోకి మార్చాలంటూ ఆస్పత్రి నిర్వాహకులు ఓ కౌన్సిలర్‌ను ఆశ్రయించగా రూ.30 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో ప్రాంతంలో మిల్లును కొనుగోలు చేసి ప్రాంతంలో ప్లాట్లు వేస్తున్నారని, దానిని పరిశ్రమ నుంచి రెసిడెన్షియల్‌గా మార్పు చేసేందుకు లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఒక విద్యాసంస్థకు సంబంధించిన విలువైన స్థలాన్ని కూడా రెసిడెన్షియల్‌ జోన కిందకు మార్పు చేస్తున్నట్లు సమాచారం. వివాదాస్పదమైన ఈ స్థలం అంశం కోర్టులో నడుస్తున్నప్పటికీ పెద్దల ప్రయోజనం కోసం మాస్టర్‌ప్లానలో చేర్చినట్లు తెలుస్తోంది.


ఆందోళనలో జనం

మాస్టర్‌ప్లానలో పట్టణంలో పలు రోడ్లు విస్తరణ జాబితాలో ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గాంధీరోడ్డు విస్తీర్ణం 60 అడుగులు కాగా 100 అడుగులకు విస్తరింపజేయనున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న రోడ్డుకు ఇరువైపుల 20 అడుగుల మేర రోడ్డు విస్తరణ జరుగనుంది. చాలా వరకు భవనాలు కోల్పోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా రిలయన్స పెట్రోలు బంకు నుంచి బొజ్జావారిపల్లె వరకు 200 అడుగుల రోడ్డు ఉండేలా ప్లానింగ్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలు కమర్షియల్‌ భవనాలు కొట్టాల్సిన పరిస్థితులు లేకపోలేదు. ఆంధ్రకేసరి రోడ్డు కూడా విస్తరణ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మూడవ పట్టణ పోలీసుస్టేషన నుంచి మడూరు బైపాస్‌ రోడ్డు వరకు వంద అడుగుల వెడల్పు రోడ్డును ప్రతిపాదించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాంతంలో అధికంగా నివశించే పేదలు, దళితుల ఇళ్లు తొలగించాల్సిన పరిస్థితులు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే మెయినబజార్‌, రంగయ్యసత్రం వీధి, సుందరాచార్యుల వీధి, పప్పులబజార్‌ రోడ్డు విస్తరణ జాబితాలో చోటు సంపాదించుకోలేకపోవడం దురదృష్టకరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. 


అనుడా రహస్య విచారణ

మాస్టర్‌ప్లాన అంశంపై పలు ఆరోపణలు రావడంతో అనుడా రహస్య విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. ఈ విషయమై అనుడా ప్లానింగ్‌ ఆఫీసర్‌ శైలజను వివరణ కోరగా మాస్టర్‌ప్లానలో స్వీకరిస్తున్న అభ్యంతరాలు ఇవే చివరివి కావని మరోమారు అభ్యంతరాలు స్వీకరించి ఆ తర్వాత ప్రభుత్వానికి నివేదిక పంపిన తర్వాతనే మాస్టర్‌ ప్లాన ఆమోదం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే 80కిపైగా అభ్యంతరాలు వచ్చాయని వాటిని పరిశీస్తున్నామని, గతంలో ఉన్న రోడ్లను తొలగిస్తామనది అవాస్తవమని రోడ్లను అభివ ృద్ధి చేయడమే తప్ప తొలగించడం మాత్రం ఉండదని తెలిపారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.