Buldozer Justice : శుక్రవారం హింసాకాండ నిందితుని చట్టవిరుద్ధ ఇల్లు కూల్చివేత

ABN , First Publish Date - 2022-06-12T21:26:16+05:30 IST

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్

Buldozer Justice : శుక్రవారం హింసాకాండ నిందితుని చట్టవిరుద్ధ ఇల్లు కూల్చివేత

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ న్యాయం చేస్తోంది. బీజేపీ మాజీ నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ శుక్రవారం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన హింసాకాండకు సూత్రధారి, రాజకీయ నేత జావేద్ మహమ్మద్ చట్టవిరుద్ధంగా నిర్మించిన ఇంటిని ఆదివారం కూలదోసింది. 


శుక్రవారం జరిగిన హింసాకాండలో దుండగులు దాదాపు రెండు చోట్ల పెద్ద ఎత్తున రాళ్ళ వర్షం కురిపించారు. పరిస్థితిని సాధారణ స్థితికి తేవడానికి పోలీసులకు దాదాపు 5 గంటలు పట్టింది. 


జావేద్ ఎటువంటి అనుమతులు లేకుండా ఈ ఇంటిని నిర్మించినట్లు ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థ అధికారులు జారీ చేసిన నోటీసులో తెలిపారు. జావేద్‌కు మే నెలలోనే నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చేయడానికి జూన్ 9 వరకు గడువు ఇచ్చినట్లు పేర్కొన్నారు.  భారీ బందోబస్తు నడుమ రెండు బుల్డోజర్లతో ఈ ఇంటిని కూల్చేవేసే పనులను ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఇంట్లోని ఏసీ, కూలర్, ఫ్రిజ్ వంటి సామగ్రిని పురపాలక సంఘ సిబ్బంది బయటకు తీసుకొచ్చి, పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పెట్టారు. అనంతరం ఇంటి ప్రహరీ గోడ, తలుపులను బుల్డోజర్లతో తొలగించారు. 





ఇదిలావుండగా, జావేద్ కుమార్తె అఫ్రీన్ ఫాతిమా సామాజిక కార్యకర్త అని తెలుస్తోంది. నూపుర్  శర్మ బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ, ప్రవక్త మహమ్మద్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఆమెపై నమోదైన కేసులో దర్యాప్తునకు హాజరుకావాలని ఆమెను మహారాష్ట్ర పోలీసులు కోరారు.



Updated Date - 2022-06-12T21:26:16+05:30 IST