వధువుకు కానుకగా రూ.51 లక్షల డబ్బు.. 25 తులాల బంగారం.. హాట్ టాపిక్‌గా పెళ్లి వేడుక..!

ABN , First Publish Date - 2022-04-22T09:34:16+05:30 IST

యువతి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించిన మేనమామలు. నలుగురు మేనమామలు కలిసి తమ మేనకోడలి వివాహానికి కళ్లు చెదిరే కానుకులు తెచ్చారు. రూ.51 లక్షల నగదు, 25 తులాల బంగారం...

వధువుకు కానుకగా రూ.51 లక్షల డబ్బు.. 25 తులాల బంగారం.. హాట్ టాపిక్‌గా పెళ్లి వేడుక..!

యువతి వివాహాన్ని అంగరంగ వైభవంగా జరిపించిన మేనమామలు. నలుగురు మేనమామలు కలిసి తమ మేనకోడలి వివాహానికి కళ్లు చెదిరే కానుకులు తెచ్చారు. రూ.51 లక్షల నగదు, 25 తులాల బంగారం, ఒక కిలో వెండి మరియు వివిధ రకాల కానుకలతో పెళ్లిలో హంగామా చేశారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ పెళ్లి రాజస్థాన్‌లోని నాగోర్ జిల్లాలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లో మాయరా అనే ఆచారం చాలా కాలంగా కొనసాగుతోంది. మాయరా ఆచారం ప్రకారం.. వధువు మేనమామ లేదా అమ్మమ్మ కుటుంబసభ్యులు పెళ్లిలో ఖరీదైన కానుకలు తీసుకువస్తారు. ఇటీవల నాగోర్ జిల్లా లాడ్నో గ్రామంలో నలుగురు మేనమామలు కలిసి తమ ఇద్దరు మేనకోడళ్ల వివాహాలకు మాయరా ఆచారం ప్రకారం ఖరీదైన కానుకల వర్షం కురిపించారు. 


లాడ్నో గ్రామంలోని సీతాదేవి అనే మహిళకు ఇద్దరు కూతుర్లు.. ప్రియాంక, స్వాతి ఉన్నారు. సీతాదేవికి మొత్తం అయిదుగురు అన్నలు. వారిలో పెద్ద అన్న రామ్ నివాస్ మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. తన మేనకోడళ్లకు మాయరా కానుకలు ఇవ్వాలని రామ్ నివాస్ మరణించే ముందు తన చివరి కోరికగా తెలిపాడు. అన్న చివరి కోరిక కోసం ఆయన నలుగురు తమ్ముళ్లు కలిసి తమ మేనకోడళ్లు ప్రియాంక, స్వాతి వివాహం వేడుకకు భారీ కానుకలతో హాజరయ్యారు. ఆ కానుకలలో రూ.51 లక్షల నగదు, 25 తులాల బంగారం, ఒక కిలో వెండితో పాటు ఇంకా ఎన్నో ఉన్నాయి.


ఇలా ప్రతీ సంవత్సరం రాజస్థాన్ గ్రామాలలో మాయరా కానుకల గురించి ప్రత్యేక వార్తలొస్తుంటాయి. గత సంవత్సరం కూడా ఒక పెళ్లిలో వధువు మేనమామలు గోనెసంచుల నిండా డబ్బులు తీసుకొని వచ్చి కానుక ఇచ్చారు. ఈ ఆచారం ఎక్కువగా ధనికలు మాత్రమే పాటిస్తున్నారు. ఒకవైపు చూసేందుకు మాయరా కానుకలు కనువిందు చేసినా.. కొన్ని చోట్ల దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి. మాయరా కానుకల కోసం వేధింపులు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి.


Updated Date - 2022-04-22T09:34:16+05:30 IST