‘సూపర్ 30’ ఆనంద్‌‌కు కెనడియన్ పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రశంస!

ABN , First Publish Date - 2021-02-24T02:01:30+05:30 IST

బిహార్‌కు చెందిన ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు, గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్‌కు కెనడియన్ పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రశంస దక్కింది.

‘సూపర్ 30’ ఆనంద్‌‌కు కెనడియన్ పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రశంస!

ఒట్టావా: బిహార్‌కు చెందిన ‘సూపర్ 30’ వ్యవస్థాపకుడు, గణిత శాస్త్రజ్ఞుడు ఆనంద్ కుమార్‌కు కెనడియన్ పార్లమెంట్‌లో ప్రత్యేక ప్రశంస దక్కింది. నిరుపేద విద్యార్థుల కోసం ఆనంద్ చేస్తున్న స్ఫూర్తిదాయకమైన పనిపై కెనడియన్ ఎంపీ ఒకరు ప్రశంసల జల్లు కురిపించారు. బ్రిటిష్ కొలంబియాలోని మాపుల్ రిడ్జ్, పిట్ మెడోస్ ఎంపీ మార్క్ డాల్టన్ సోమవారం పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆనంద్‌ చేస్తున్న పనిని కొనియాడారు."నిరుపేద విద్యార్థులను ప్రోత్సహించడంలో 'సూపర్ 30' చేస్తున్న స్ఫూర్తిదాయకమైన పని గురించి ఎంత చెప్పిన తక్కువే. భారతదేశంలోని ప్రధాన విద్యా సంస్థలను చేరుకోవడంలో అన్ని అడ్డంకులను అధిగమించడానికి సమాజంలోని నిరుపేద వర్గాల విద్యార్థులకు సహాయం చేయడంలో 'సూపర్ 30' ఎప్పుడు ముందు ఉంటుంది." అని అన్నారు. 


అలాగే విద్యావేత్తలకు స్ఫూర్తినిచ్చేలా ఆనంద్ కుమార్‌పై మాపుల్ రిడ్జ్‌కు చెందిన బిజు మ్యాథ్యూ పుస్తకం రాస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కాగా, 2012లో కెనడాలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆనంద్‌కు అక్కడ ఘన సన్మానం జరిగిన విషయం తెలిసిందే. ఇదిలాఉంటే.. ఆనంద్ కుమార్ స్థాపించిన విద్యా కార్యక్రమం 'సూపర్ 30'.. ప్రతి ఏడాది 30 మంది నిరుపేద విద్యార్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రవేశ పరీక్ష కోసం ఎటువంటి ఫీజు తీసుకోకుండా శిక్షణ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆనంద్‌పై బాలీవుడ్‌లో 'సూపర్ 30' పేరిట హృతిక్ రోషన్ హీరోగా ఓ మూవీ కూడా వచ్చింది.    

Updated Date - 2021-02-24T02:01:30+05:30 IST