వైభవంగా మత్స్యగిరీశుడి కల్యాణం

ABN , First Publish Date - 2020-11-29T06:01:32+05:30 IST

మత్స్యగిరి లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆగమశాస్త్రం ప్రకారం గర్భాలయానికి ఎదురుగా ఉన్న మండపంలో కల్యాణ వేడుకలను అర్చకులు నిర్వహించారు.

వైభవంగా మత్స్యగిరీశుడి కల్యాణం
మత్స్యగిరీశుడి కల్యాణ తంతు నిర్వహిస్తున్న అర్చకులు

వలిగొండ, నవంబరు 28: మత్స్యగిరి లక్ష్మీనరసింహుడి కల్యాణోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఆగమశాస్త్రం ప్రకారం గర్భాలయానికి ఎదురుగా ఉన్న మండపంలో కల్యాణ వేడుకలను అర్చకులు నిర్వహించారు. మండపాన్ని పచ్చని తోరణాలు, పుష్పాలతో అలంకరించి, స్వామి, అమ్మవారిని అధిష్ఠింపజేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ, ముక్కోటి దేవతలు ఆహూతులుగా సృష్టికర్త బ్రహ్మదేవుడి సమక్షంలో నృసింహుడు లోక కల్యాణార్థం సకల సంపదలకు నెలవైన లక్ష్మీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశారు. శ్రీహరికి పట్టు పీతాంబరాలు మంగళసూత్రం, ముత్యాల తలంబ్రాలు దేవస్థానం తరపున ఈవో గుత్తా మనోహర్‌రెడ్డి దంపతులు సమర్పించారు. కల్యాణ తంతు మద్వాచార్యులు శ్రీమన్నారాయణ పర్యవేక్షణలో దేవస్థాన ప్రధానార్చకుడు ప్రతాపం శ్రీనివాసాచార్యులు తదితరులు నిర్వహించారు.


అన్నదానం

స్వామివారి కల్యాణ వేడుకలను తిలకించేందుకు వచ్చిన భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


కల్యాణంపై కరోనా ఎఫెక్ట్‌

మత్స్యగిరి లక్ష్మీనరసింహ స్వామి కల్యాణ వేడుకలపై కరోనా ఎఫెక్ట్‌ పడింది. ప్రజలు కల్యాణం తిలకించేందుకు  దేవస్థాన అధికారులు అనుమతి నిరాకరించారు. పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతినిచ్చారు. దీనికి తోడుగా వాతావరణ ప్రభావంతో కూడా సమీప గ్రామాల ప్రజలు కొద్దిమంది మాత్రమే స్వామివారి కల్యాణ వేడుకలకు తరలివచ్చారు.

Updated Date - 2020-11-29T06:01:32+05:30 IST