ఆడపెత్తనం.. అన్నింటా క్షేమం.. పరిశోధనలో బయటపడ్డ నిజం!

ABN , First Publish Date - 2020-11-22T17:31:00+05:30 IST

ప్రపంచంలోని చాలా దేశాల్లో పురుషాధిక్య సమాజాలే ఉన్నాయి. మహిళలు సమానత్వం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.

ఆడపెత్తనం.. అన్నింటా క్షేమం.. పరిశోధనలో బయటపడ్డ నిజం!

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలోని చాలా దేశాల్లో పురుషాధిక్య సమాజాలే ఉన్నాయి. మహిళలు సమానత్వం కోసం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికోకు చెందిన ప్రొఫెసర్ మ్యాటిసన్ అనే పరిశోధకుడికి ఓ సందేహం వచ్చింది. పురుషాధిక్య సమాజంలో సమానత్వం కోసం పోరాడుతూ బీపీ తెచ్చుకుంటున్న మహిళలు.. మహిళాధిక్య సమాజంలో ఎలా ఉంటారు? అనేదే ఆ డౌట్. అంతే హిమాలయాలకు ప్రయాణం అయ్యాడు. కాకపోతే ఏ గురూజీనో కలవడానికి కాదు. ఓ తెగను కలవడానికి. చైనాకు చెందిన మోసో అనే తెగకు చెందిన కొన్ని గ్రామాలు టిబెట్ బోర్డర్‌కు సమీపంలో హిమాలయాల్లో ఉన్నాయి. ఈ గ్రామాల్లో కొన్ని పురుషాధిక్య సమాజాలయితే, మరికొన్ని మహిళాధిక్య సమాజాలు. 


మహిళాధిక్యం ఉన్న గ్రామాల్లో ఆస్తులకు వారసులు ఆడవారే. అలాగే కుటుంబ ఆర్థిక వ్యవహారాలన్నీ మహిళలే చూసుకుంటారు. అంతే కాదండోయ్.. వారికి నచ్చితే ఎంత మంది మగవారనైనా ప్రియులుగా ఉంచుకుంటారు. ఈ తెగలో రెండు రకాల సమాజాలూ ఉండటంతో దీనిపైనే పరిశోధన చేయాలని మ్యాటిసన్ నిర్ణయించుకున్నాడు. ఈ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పురుషాధిక్య గ్రామాలతో పోల్చుకుంటే, మహిళాధిక్యం ఉన్న గ్రామాల్లో ఆడవారు ఆరోగ్యంగా ఉన్నారట. బీపీ, డయాబెటీస్ వంటి రోగాలు, హృదయ సంబంధ వ్యాధులు మహిళాధిక్యం ఉన్న గ్రామాల్లో ఆడవారికి చాలా తక్కువగా వస్తున్నాయట. అదే సమయంలో పురుషాధిక్య గ్రామాల్లో మాత్రం పరిస్థితి దీనికి పూర్తి విరుద్ధం. అదే సమయంలో మహిళాధిక్య గ్రామాల్లోని పురుషుల్లో ఎటువంటి సమస్యలూ కనిపించలేదట. ఆశ్చర్యంగా లేదూ?

Updated Date - 2020-11-22T17:31:00+05:30 IST