‘ఒంటరి’తో మాటకలిపి.. రాత్రి, పగలు చాటింగ్‌లు చేసి.. చివరికి..

ABN , First Publish Date - 2020-11-12T12:09:00+05:30 IST

ఒంటరి మహిళలే అతడి టార్గెట్‌. మ్యాట్రిమోనిలో..

‘ఒంటరి’తో మాటకలిపి.. రాత్రి, పగలు చాటింగ్‌లు చేసి.. చివరికి..

మ్యాట్రిమోని ద్వారా పరిచయాలు

అవసరాల పేరుతో డబ్బు వసూళ్లు

తెలుగు రాష్ట్రాల్లో 20 మందికి ఎర

విజయవాడ మహిళ నుంచి రూ.11లక్షలు లాగేసిన టెకీ


విజయవాడ(ఆంధ్రజ్యోతి): ఒంటరి మహిళలే అతడి టార్గెట్‌. మ్యాట్రిమోనిలో అందరి ప్రొఫైళ్లు చూస్తాడు. వాళ్ల బయోడేటా సేకరిస్తాడు. ఒకరికి తెలియకుండా మరొకర్ని వలలో వేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తాడు. పగలు, రాత్రి విరామం లేకుండా వాళ్లతో చాటింగ్‌ చేస్తాడు. కొన్ని రోజులు గడిచాక అత్యవసర కారణం చెప్పి, అర్జెంటుగా ఎంతో కొంత డబ్బును ఆన్‌లైన్‌లో బదిలీ చేయించుకుంటాడు. తర్వాత ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేసేస్తాడు. ఇలా ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ టెకీని కృష్ణలంక పోలీసులు బుధవారం పట్టుకున్నారు. 


ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన ప్రదీప్‌కుమార్‌కు వివాహమైంది. హైదరాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్‌వేర్‌తో సంపాదిస్తున్న డబ్బులతోపాటు అదనంగా ఇంకా సంపాదించాలనుకున్నాడు. అందుకోసం అడ్డదారులు తొక్కాడు. తెలుగు మ్యాట్రిమోని డాట్‌ కామ్‌లోకి అడుగుపెట్టాడు. ఇందులో తమ పేరు రిజిస్టర్‌ చేసుకున్న ఒంటరి మహిళలను ఎంపిక చేసుకునేవాడు. బయోడేటాలో ఉన్న ఫోన్‌ నెంబర్‌ను సంపాదించి, వాళ్లకు ఫోన్లు చేసేవాడు. హైదరాబాద్‌లో తాను ఒక పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తున్నానని, నెలకు లక్షలాది రూపాయల వేతనం వస్తుందని నమ్మించేవాడు. ఆ మహిళల బాగోగులు మాత్రమే కాకుండా పిల్లల బాధ్యతను కూడా స్వీకరిస్తానని సెంటిమెంట్‌ను పండించేవాడు. తానొక ఆదర్శవంతుడినని, అవివాహితుడనని, వితంతువును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేవాడు. దీంతో ఆ మహిళలు ఇతడి వలలో పడిపోయేవారు. 


పరస్పరం అర్థం చేసుకుందామంటూ..

తనకు పరిచయమైన ఏ మహిళనూ ప్రదీప్‌కుమార్‌ స్వయంగా కలవలేదు. అందరితోనూ ఫోన్లలోనే సంభాషించేవాడు. వారికి ఎక్కడా అనుమానం రాకుండా వాట్సాప్‌ ద్వారా చాటింగ్‌లు చేసేవాడు. తొలుత మాటలు కలిపినప్పుడు ఒకరినొకరం అర్థం చేసుకుందామని తీపి కబుర్లు చెప్పేవాడు. ఈ మాటలకు ప్రదీప్‌కుమార్‌ నిజంగా ఆదర్శవంతుడని ఆ మహిళలు నమ్మేవారు. ఇలా నెల రోజులపాటు చాటింగ్‌లు చేసి, ఆ మహిళల ఆర్థిక పరిస్థితి గురించి, ఆస్తిపాస్తుల గురించి తెలుసుకునేవాడు. ఆ మహిళలు సంపాదనలో ఉన్నా, వారికి బ్యాంకు ఖాతాలో నిల్వలు బాగా ఉన్నాయని తెలిసినా వదిలిపెట్టేవాడు కాదు. ఒక్కొక్కరికీ ఒక్కో రకమైన కారణాలు చెప్పి ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఉన్న తన ఖాతాకు డబ్బులను బదిలీ చేయించుకునేవాడు. ఈవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 20 మంది నుంచి లక్షలాది రూపాయలను తన ఖాతాలోకి మళ్లించుకున్నాడు. 


వెలుగులోకి ఇలా..

విజయవాడ కృష్ణలంక బాలాజీనగర్‌కు చెందిన ఓ మహిళ భర్తతో వివాదాల కారణంగా విడిపోయింది. నగరంలోని ఓ ప్రైవేటు కన్సల్టెన్సీలో పనిచేస్తోంది. మ్యాట్రిమోనిలో ఉన్న ఆమె ప్రొఫైల్‌ను చూసి ప్రదీప్‌కుమార్‌ పరిచయం చేసుకున్నాడు. లాక్‌డౌన్‌లో ఏర్పడిన ఈ పరిచయం ద్వారా ఇప్పటి వరకు ఆమె నుంచి రూ.11లక్షలు చేజిక్కించుకున్నాడు. తర్వాత  ఎలాంటి పలకరింపులు లేకపోవడంతో ఆమె కృష్ణలంక పోలీసులను ఆశ్రయించింది. దీనిపై కేసు నమోదు చేసిన ఇన్‌స్పెక్టర్‌ సత్యానందం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రదీప్‌కుమార్‌ ఆచూకీని తెలుసుకున్నారు. ఒక బృందాన్ని హైదరాబాద్‌కు పంపి అతడ్ని పట్టుకున్నారు. కాకినాడ టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లోనూ ప్రదీప్‌కుమార్‌పై ఇలాంటి కేసే నమోదైందని తేలింది. ఇంకా ఎవరెవరిని ఈవిధంగా మోసం చేశాడన్న దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. 

Updated Date - 2020-11-12T12:09:00+05:30 IST