మత్స్యగుండం.. కళావిహీనం

ABN , First Publish Date - 2022-07-07T06:26:58+05:30 IST

మత్స్యకన్య, త్రిముఖ శివుడు ప్రతిమలు, రెస్టారెంట్‌ భవనం, వ్యూపాయింట్‌, సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల గులాబీలతో పార్కు..

మత్స్యగుండం.. కళావిహీనం
మత్స్యగుండంలో మత్స్యలింగేశ్వర ఆలయం

- అభివృద్ధికి నోచుకోని పర్యాటక పుణ్యక్షేత్రం  

- భక్తులు, సందర్శకులను ఆకర్షించలేని దుస్థితి 

- మత్స్యగుండం వైపు కన్నెత్తి చూడని సందర్శకులు 

- పర్యాటకంగా అభివృద్ధి చేయాలని స్థానికుల వేడుకోలు 



మత్స్యకన్య, త్రిముఖ శివుడు ప్రతిమలు, రెస్టారెంట్‌ భవనం, వ్యూపాయింట్‌, సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల గులాబీలతో పార్కు.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేవి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.కోటి వ్యయంతో వీటిని అభివృద్ధి చేసింది. మహాశివరాత్రి నాడు ఇక్కడ జరిగే జాతరకు ఇతర జిల్లాలను నుంచి కూడా భక్తులు వస్తుంటారు. అయితే దీని నిర్వహణను అధికారులు పట్టించుకోకపోవడంతో ఇప్పుడు కళావిహీనంగా ఉంది. 


                                  (పాడేరు- ఆంధ్రజ్యోతి) 

ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన మత్స్యగుండం కళావిహీనంగా మారింది. చాలా ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉండడంతో ఎంతో సుందరంగా ఉండే ఆ ప్రాంతం ప్రస్తుతం అధ్వానంగా తయారైంది. దీంతో భక్తులు, సందర్శకులను ఆకర్షించలేని దుస్థితి కొనసాగుతున్నది. చాలా ఏళ్లుగా మత్స్యగుండం నిర్లక్ష్యానికి గురవుతోంది. 2003, 2016 సంవత్సరాల్లో మత్స్యగుండం అభివృద్ధికి చేపట్టిన పనులు సైతం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఎందుకూ ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. 

మత్స్యగుండం అభివృద్ధిపై నిర్లక్ష్యం

2002 సంవత్సరం వరకు మత్స్యగుండం స్థానికులకు మినహా ఇతర ప్రాంతాలకు అంతగా తెలియని పరిస్థితి. ప్రతి ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జాతర నేపథ్యంలో మత్స్యలింగేశ్వరుడ్ని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చేవారు. క్రమంగా ఆ తరువాత నుంచి మత్స్యగుండంపై ముమ్మర ప్రచారం జరగడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు, పర్యాటకులు వచ్చేవారు. దీంతో పర్యాటకపరంగా మత్స్యగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని 2003లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రూ.కోటి వ్యయంతో మత్స్యకన్య, త్రిముఖ శివుడు ప్రతిమలు, రెస్టారెంట్‌ భవనం, వ్యూపాయింట్‌, సుమారుగా రెండు ఎకరాల విస్తీర్ణంలో అనేక రకాల గులాబీలతో పార్కును అభివృద్థి చేశారు. అంత వరకు బాగానే ఉంది. కానీ ఆ తరువాత అధికారులు దాని నిర్వహణ, బాగోగులు చూసుకునే ఏర్పాట్లు చేయలేదు. దీంతో కొన్నాళ్లకే మత్స్యగుండం అధ్వానంగా మారింది. పుష్కరకాలం తరువాత 2016లో వుడా (విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ)ఆధ్వర్యంలో మళ్లీ మత్స్యగుండం అభివృద్ధికి చర్యలు చేపట్టారు. సుమారు రూ.48 లక్షల వ్యయంతో  అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ముఖ్యంగా మత్స్యగుండం నిర్వహణపై అటు దేవదాయ శాఖగాని, ఇటు పర్యాటక శాఖ గాని కనీసం దృష్టి సారించడం లేదు. 

పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో ఉపయోగం....

ప్రకృతి అందాలకు నిలయమైన గిరిజన ప్రాంతంలో పర్యాటకంపరంగా అభివృద్ధి చేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని స్థానికులు, పర్యాటకులు అంటున్నారు. వాస్తవానికి మత్స్యగుండం వంటి ప్రాంతంలో అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా భక్తులను, పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రధానంగా భక్తిపరంగా జరిగే కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనువుగా మందిరాలు, భక్తులు వంటలు, బస చేసేందుకు అనువుగా ఆశ్రమం తరహా నిర్మాణాలు చేపడితే మత్స్యగెడ్డను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతం చక్కగా అభివృద్ధి చెందుతుందని పలువురు అంటున్నారు. అలాగే పర్యాటకులను ఆకట్టుకునేలా విజ్ఞాన, వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతోపాటు సువిశాలమైన ప్రదేశంలో ఉన్న పార్కును అభివృద్ధి చేయడం, పర్యాటకులు బస చేసేందుకు అనువుగా చిన్న చిన్న కాటేజీలు, భోజన సదుపాయానికి రెస్టారెంట్‌లు అందుబాటులోకి తీసుకువస్తే అరకులోయ నుంచి లంబసింగి వెళ్లే పర్యాటకులు పాడేరు ప్రాంతాన్ని సందర్శించి మత్స్యగుండంలో బస చేసేందుకు బాగుంటుందని సందర్శకులు చెబుతున్నారు. ప్రస్తుతం టూరిజం పరంగా అల్లూరి జిల్లాకు ప్రత్యేక గుర్తింపుతోపాటు ఏజెన్సీకి మరింత మంది పర్యాటకులను ఆకర్షించే అవకాశాలున్నాయి. ప్రభుత్వం స్పందించి మత్స్యగుండం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానికులు, భక్తులు, పర్యాటకులు కోరుతున్నారు. 


Updated Date - 2022-07-07T06:26:58+05:30 IST