పుదుచ్చేరి నుంచి రాజ్యసభ సీటు బీజేపీకి గర్వకారణం: మోదీ

Sep 28 2021 @ 13:06PM

న్యూఢిల్లీ: పుదుచ్చేరి నుంచి బీజేపీ తరఫున తొలిసారి రాజ్యసభ సభ్యుడి ఎన్నిక పార్టీలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అసోం నుంచి రాజ్యసభకు ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికైన కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్, మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ఎల్.మురుగన్‌లకు కూడా ప్రధాని ఓ ట్వీట్‌లో అభినందనలు తెలిపారు. ''పుదుచ్చేరి నుంచి తొలిసారి బీజేపీ నుంచి రాజ్యసభకు ఎస్.సెల్వగణపతి ఎన్నిక కావడం పార్టీ కార్యకర్తలందరూ గర్వించే విషయం. పుదుచ్చేరి ప్రజలు బీజేపీ ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. పుదుచ్చేరి ప్రగతి కోసం పనిచేస్తూ ముందుకు సాగుదాం'' అని ప్రధాని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. పుదుచ్చేరి నుంచి ఏకైక రాజ్యసభ సీటుకు సెల్వగణపతి సోమవారంనాడు ఏకగ్రీవంగా (పోటీలేకుండా) ఎన్నికయ్యారు. ఏఐఎన్ఆర్‌సీతో పొత్తు పెట్టుకుని పుదుచ్చేరిలో బీజేపీ అధికారంలో ఉంది. కాగా, పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు బీజేపీ పోటీ చేయలేదు. దీంతో టీఎంసీ నేత సుస్మితా దేవ్ పశ్చిమబెంగాల్ నుంచి రాజ్యసభకు ఎలాంటి పోటీ లేకుండా ఎన్నికయ్యారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.