మట్టి.. కొల్లగొట్టి..

ABN , First Publish Date - 2021-06-20T05:13:04+05:30 IST

మట్టి.. కొల్లగొట్టి..

మట్టి.. కొల్లగొట్టి..
కేఈబీ కెనాల్‌ వద్ద మట్టి లోడింగ్‌ కోసం వేచి ఉన్న లారీలు

బుసక పేరుచెప్పి అక్రమ రవాణా

జగనన్న కాలనీల్లో మెరక అంటూ దారి మళ్లింపు

వల్లూరుపాలెంలో అర్ధరాత్రి అక్రమ రవాణా

కేఈబీ కెనాల్‌ పూడికతీతలో అవినీతి జమానా

మట్టే కదా.. అని తీసిపారేయొద్దు. జిల్లాలో మట్టి పేరుచెప్పి అధికార పార్టీ నాయకులు రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. కృష్ణానదీ తీరమే లక్ష్యంగా వైసీపీ నేతలు సాగిస్తున్న ఈ దందాలో లారీలకు లారీలు ఇసుక, బుసక మెరక పేరుతో బయటకు తరలుతోంది. అదుపు చేయాల్సిన అధికారులు అలసత్వంగా ఉంటుండగా, పోలీసులు పైపై కేసులు పెట్టి మిన్నకుండిపోతున్నారు.

--------------------------------------------------------------------------

బుసక మాటున ఇసుక

వల్లూరుపాలెంలో యథేచ్ఛగా అక్రమ రవాణా

తోట్లవల్లూరు : వల్లూరుపాలెంలో బుసక క్వారీల మాటున జోరుగా ఇసుక దందా జరుగుతోంది. ఇలా అక్రమంగా తరలిస్తున్న మూడు లారీలను స్థానిక పోలీసులు గురువారం రాత్రి పట్టుకున్నారు. అలాగే, ఈనెల 16వ తేదీన భద్రిరాజుపాలెం వద్ద రెండు ఇసుక లారీలు పోలీసులకు  చిక్కాయి. ఈ ఐదు లారీలు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఉన్నాయి. 

అనుమతుల పేరుజెప్పి..

జగనన్న కాలనీల్లో నివేశన స్థలాలు మెరక చేసేందుకు అధికారులు ఇష్టారాజ్యంగా బుసక క్వారీలకు అనుమతులు ఇస్తున్నారు. కొన్ని గ్రామాల్లో దళితులు సాగు చేసుకునే లంక భూముల్లో మట్టి తరలింపునకు వైసీపీ నేతలు దరఖాస్తులు చేసుకుని రేయింబవళ్లు రవాణా సాగిస్తున్నారు. చీకటి పడ్డాక ఇసుక దందాకు తెరదీస్తున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది నుంచి తనిఖీల భయం లేకపోవటంతో రాత్రి సమయాల్లో అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. పోలీసులు పలు లారీలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నా ఇసుక దందా ఆగట్లేదు.

రెండు లేయర్ల ఇసుక.. ఆపై బుసక

పోలీసులను బురిడీ కొట్టించేలా ఇసుక దందా సాగుతోంది. పది టైర్ల లారీల్లో ట్రక్కు నిండా ఇసుక నింపి, పైన వరస మాత్రం బుసక వేసి మాయ చేస్తున్నారు. చూసిన వారికి బుసక రవాణా జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి బుసక లారీలను అనేకసార్లు పట్టుకున్న ఘటనలున్నాయి. ఇసుక దందాకు బ్రేక్‌ పడాలంటే బుసక రవాణాను కేవలం పగలు మాత్రమే అనుమతించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంపై ఎస్సై వై.అర్జున్‌ మాట్లాడుతూ బుసక క్వారీలకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే అనుమతి ఉందని, ఆ సమయాలు దాటి రవాణా చేసినా లారీలను పట్టుకుని చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

-------------------------------------------------------------------------------

మెరక పేరుతో మాయ

కేఈబీ కెనాల్‌ పూడికతీత పనుల్లో అక్రమాలు

మోపిదేవి : దివిసీమ ప్రాంతానికి ప్రధాన సాగునీటి కాలువగా ఉన్న కేఈబీ కెనాల్‌లో జరుగుతున్న పూడికతీత పనుల్లో అక్రమాలు జరుగుతున్నాయి. ఎలాంటి అనుమతి లేకుండా తవ్విన మట్టిని వేరే ప్రాంతాలకు తరలించి లే అవుట్లు మెరక చేస్తున్నారు. మోపిదేవి మండలంలోని కె.కొత్తపాలెం, బొబ్బర్లంక మధ్యలో కేఈబీ కెనాల్‌ వద్ద మట్టి తవ్వి మోపిదేవి పంచాయతీ శివారు రావివారిపాలెంలో ఉన్న నివేశన స్థలాల లే అవుట్లు మెరక చేస్తున్నారు. 4.7 కిలోమీటర్ల మేర రూ.75.45 లక్షల అంచనాలతో కేఈబీ కెనాల్‌ పూడికతీత పనులు చేపట్టారు. ఈ పనుల్లో భాగంగా వచ్చిన మట్టితో ఇరువైపులా గట్లు పటిష్టపరిచి సర్దుబాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా కేఈబీ కెనాల్‌లో తవ్విన మట్టిని నివేశన స్థలాలు మెరక చేసేందుకు తరలిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోపిదేవి వార్పు నుంచి విజయవాడ వరకు ఉన్న కృష్ణానది కరకట్ట రహదారికి పక్కనే మట్టిని తవ్వుతున్నారు. దీనివల్ల రహదారికి, కరకట్టకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తరచూ వరదలు సంభవిస్తుండటంతో కరకట్టకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పలు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు.  

మట్టి తరలింపునకు అనుమతుల్లేవు : ఎంపీడీవో స్వర్ణభారతి

కేఈబీ కెనాల్‌లో తవ్విన మట్టిని లే అవుట్లకు తరలించటానికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఎంపీడీవో స్వర్ణభారతి తెలిపారు. లే అవుట్ల మెరక, కేఈబీ కెనాల్‌లో మట్టి లభ్యతపై సంబంధిత కాంట్రాక్టర్‌ రాతపూర్వకంగా తెలియజేయగా, ఆ లేఖను ఉన్నతాధికారులకు పంపామన్నారు.





Updated Date - 2021-06-20T05:13:04+05:30 IST