గుట్టలు మాయం!

ABN , First Publish Date - 2020-12-01T05:02:09+05:30 IST

మట్టిమాఫియా రెచ్చిపోతోంది. కళ్లు మూసి తెరిచేలోపు గుట్టలకు.. గుట్టలను మాయం చేస్తోంది. అర్ధరాత్రి వేళ ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతుండటంతో నిన్న చూసిన గుట్ట నేటికి పంటచేనులా మారుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గుట్టలు మాయం!
నర్సింహుల గుట్ట వద్ద జరుగుతున్న మట్టి తవ్వకాలు (ఫైల్‌)

అర్ధరాత్రి వేళ రెచ్చిపోతున్న మట్టిమాఫియా 

ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా తవ్వకాలు 

పట్టించుకోని అధికారులు

రఘునాథపాలెం మండలంలో సాగుతున్న దందా

రఘునాథపాలెం, నవంబరు 30 : మట్టిమాఫియా రెచ్చిపోతోంది. కళ్లు మూసి తెరిచేలోపు గుట్టలకు.. గుట్టలను మాయం చేస్తోంది. అర్ధరాత్రి వేళ ప్రభుత్వ స్థలాల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతుండటంతో నిన్న చూసిన గుట్ట నేటికి పంటచేనులా మారుతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రఘునాథపాలెం మండలంలోని నర్సింహులగుట్ట, పువ్వాడ ఉదయ్‌కుమార్‌నగర్‌ శ్మశానవాటిక పక్కనే ఉన్న గుట్ట, చింతగుర్తి సమీపంలోని గుట్టలు మాయమవుతుండగా.. ప్రభుత్వ భూముల్లో గుంతలు పెట్టి మరీ మట్టిని మాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొంత డబ్బు ఉంటే చాలు దాన్ని నెలరోజుల్లో డబుల్‌ చేయాలి అంటే మట్టిని అమ్ముకుంటే చాలు అన్నచందంగా తయారైంది అంటే అతిశయోక్తి కాదు. 

అర్ధరాత్రే ఆయుధం..

మట్టి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుండటంతో ఆ వ్యాపారం వైపు ఇటీవల చాలా మంది మక్కువ చూపుతున్నారు. అయితే పగటి వేళ మట్టి కావాల్సిన వారి నుంచి ఆర్డర్లు తెచ్చుకోవటం.. అర్ధరాత్రి సమయాల్లో యంత్రాలు పెట్టి భారీ వాహనాలతో రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో ఖమ్మానికి అతిచేరువలో ఉన్న గ్రామాల్లోని గుట్టలు మాయమవుతున్నా అధికారులు పట్టించుకోకపోవటం పట్ల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆయా ప్రాంతాల ప్రజలు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటంలేదనే ఆరోపణలున్నాయి. అధికారుల మామూళ్ల మత్తు రూ.లక్షల మట్టి తరలుతున్నా పట్టించుకోవటంలేదని పలువురు అంటున్నారు. అనుమతులు తీసుకుంటే ఏం లాభం.. అర్ధరాత్రి దండుకుంటే చాలు అన్నచందంగా మట్టిమాఫియా రెచ్చిపోతోందని పలువురు అంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా రూ.లక్షల విలువైన మట్టిని తరలిస్తున్నారు. 

వాల్టా చట్టానికి తూట్లు..

ప్రభుత్వ గుట్టల్లో చిన్న పుల్లను కదిలించినా చట్ట ప్రకారం తప్పవుతుంది. కానీ ప్రస్తుతం ఈచట్టం కేవలం చట్టుబండగా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గుట్టలు మాయం చేసే క్రమంలో పెద్ద పెద్ద వృక్షాలు నేలకొరుగుతున్నాయి. అటవీశాఖ చట్టప్రకారం దీనిని పెద్ద నేరంగా భావిస్తారు. కానీ మండలంలో ఎన్నో గుట్టలు రాత్రికి రాత్రి మాయం అవుతున్నా , చెట్లు నేలకొరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోవటంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి మాఫియా ఆగడాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2020-12-01T05:02:09+05:30 IST