బుడమేరు మట్టి.. కొల్లగొట్టి..

ABN , First Publish Date - 2022-05-25T06:13:58+05:30 IST

బుడమేరు మట్టి.. కొల్లగొట్టి..

బుడమేరు మట్టి.. కొల్లగొట్టి..
బుడమేరు కట్టను తవ్వేస్తున్న మట్టి మాఫియా

నందివాడ మండలంలో బుడమేరు కట్టను మింగేస్తున్న మట్టి మాఫియా

వేల ట్రాక్టర్ల మట్టి లూటీ

చోటా నాయకుడి నిర్వాకం


మట్టి కోసం బుడమేరు కట్టను తవ్వేస్తున్నారు. వేలకొద్దీ ట్రక్కుల మట్టిని అమ్మేసుకుంటున్నారు. అక్రమంగా తవ్వేసి, ఎకరాలకు ఎకరాలు కలిపేసుకుని, కాలక్రమంలో పట్టాలు సృష్టించేసి లాభించాలని మట్టి మాఫియా అవతారమెత్తిన మండల స్థాయి నాయకుడి దూరాలోచన కాగా, వరదలొస్తే ఎక్కడ ఇబ్బందులు పడతామేమోనని  స్థానికులు భయాందోళన చెందుతున్నారు.



గుడివాడ, మే 24 : నందివాడ మండలం ఇలపర్రు, లక్ష్మీనరసింహపురం గ్రామాల సరిహద్దులో బుడమేరులో మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. బుడమేరు గట్టును నాలుగు కిలోమీటర్ల మేర ఐదెకరాల పరిధిలో తవ్వేస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఎకరం రూ.20 లక్షలు ఉంటుంది. మొత్తంగా మట్టి అక్రమ తవ్వకాల మూలంగా వచ్చిన నష్టాన్ని పక్కనపెడితే, ప్రభుత్వ ఖజానాకు రూ.కోటి మేర కొల్లగొడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఎల్‌ఎన్‌ పురానికి చెందిన మండలస్థాయి నాయకుడు మట్టి మాఫియా అవతారమెత్తి ఈ దారుణాలకు పాల్పడుతున్నాడు. అదేమంటే రాష్ట్రస్థాయి నాయకులు చేస్తే ఒక న్యాయం.. మండల స్థాయి నాయకులకు మరో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నాడు. అధికార పార్టీతో అంటకాగే ఓ నాయకుడి ప్రాపకం సంపాదించిన సదరు నాయకుడు ఎల్‌ఎన్‌ పురం పరిసరాల్లో వివాదాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ డబ్బు కొల్లగొడుతున్నాడు. కాగా, వేల ట్రక్కుల మట్టి తరలుతున్నా రెవెన్యూ, డ్రెయినేజీ, మైనింగ్‌ శాఖల అధికారులు అడ్డుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వరద ముంపునకు అవకాశం

ఎల్‌ఎన్‌ పురంలో మట్టి మాఫియా అవతారమెత్తిన సదరు నాయకుడి ధాటికి బుడమేరు గట్టు నాలుగు కిలోమీటర్ల మేర ఆరు అడుగుల వరకు సన్నగిల్లిపోయింది. దీనివల్ల వరదల సమయంలో బుడమేరు కట్ట తెగి నీరు గ్రామాల మీదకు వచ్చేస్తుందని స్థానికులు భయపడుతున్నారు. చేపల చెరువులు, పంట పొలాలు మునిగిపోయి పూర్తిగా నష్టపోతామని బుడమేరు పరివాహక ప్రాంత రైతులు బెంబేలెత్తిపోతున్నారు. సదరు నాయకుడిపై కేసు నమోదు చేసి, రెవెన్యూ రికవరీ చట్టం కింద కొల్లగొట్టిన మట్టిని తిరిగి పూడ్పించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. 

మట్టి మాకు.. భూమి మీకు..

ఇక్కడ బుడమేరు గట్టుకు ఒకవైపు ఏరు, మరోవైపు చేపల చెరువులు ఉంటాయి. బుడమేరు గట్టు ఆధునికీకరణలో భాగంగా వంద అడుగుల మేర కరకట్టను పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఎంతటి వరద వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. మట్టి మాఫియా అవతారమెత్తిన నాయకుడు చేపల చెరువుల యజమానులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు. చేపల చెరువుల వైపు బుడమేరు గట్టు మట్టిని తాము తీసుకుని, తద్వారా మిగిలిన విస్తీర్ణాన్ని చేపల చెరువుల్లో కలిపేసుకునేలా యజమానులతో మాట్లాడుకున్నాడు. ప్రతిపాదనకు యజమానులు కూడా ఓకే చెప్పడంతో మట్టి తవ్వకాలకు తెరలేచింది. నాలుగు రోజులుగా రేయింబవళ్లు తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై డ్రెయినేజీ డీఈ శిరీషను వివరణ కోరగా, బుడమేరు గర్భంలో మట్టి తవ్వడానికి ఎవరికీ అనుమతులు లేవని, గట్టు జోలికి వెళ్లిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-25T06:13:58+05:30 IST