మట్టికొట్టేసి..

ABN , First Publish Date - 2022-08-13T06:09:23+05:30 IST

మట్టికొట్టేసి..

మట్టికొట్టేసి..
పూరగుట్ట జగనన్న కాలనీలోని ఇంటి గదుల్లో నింపిన మట్టి

జగనన్న కాలనీల్లో కొల్లగొట్టేసి..

అక్రమంగా ఎర్రచెరువు మట్టి తోలకం

జగనన్న కాలనీల్లో అమ్ముకుంటున్న వైసీపీ నేతలు

అధిక ధరలకు విక్రయాలు

పట్టించుకోని ఇరిగేషన్‌, పోలీస్‌ అధికారులు


మైలవరం రూరల్‌ : పూరగుట్టలోని జగనన్న కాలనీ కేంద్రంగా అధికార పార్టీ నాయకులు మట్టి దందాకు తెరలేపారు. జలవనరుల శాఖ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వారం రోజులుగా ఎర్రచెరువు నుంచి వేల ట్రిప్పుల మట్టిని తరలిస్తున్నారు. లబ్ధిదారులకు, నాయకుల మధ్య దేవునిచెరువుకు చెందిన కొందరు వ్యక్తులు మధ్యవర్తులుగా ఏర్పడి ఈ తవ్వకాలకు అండగా నిలుస్తున్నారు. లబ్ధిదారుల అవసరాన్ని ఆసరాగా చేసుకున్న మట్టి మాఫియా ఒక్కో ట్రిప్పును రూ.900 నుంచి రూ.1,200కు అమ్ముతోంది. అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం నాయకుల జేబుల్లోకి వెళ్తోంది. పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నా ఇరిగేషన్‌, రెవెన్యూ, పోలీస్‌ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు.

జగనన్న కాలనీల్లో ఇళ్లు కట్టే లబ్ధిదారులకు రూ.400కు రావాల్సిన మట్టిని రూ.వెయ్యి వరకూ అమ్ముతున్నా పట్టించుకునే వారు లేరు. మెరక మట్టికి అధిక రేటు తీసుకుంటున్నారని లబ్ధిదారులు ప్రశ్నిస్తే, ‘మీకు ఇష్టమైతే మట్టి తోలతాం. కష్టమైతే మానుకోండి. ధర ఇంతే. లేకపోతే మట్టి తోలే ప్రసక్తే లేదు.’ అని మట్టి మాఫియా గట్టిగా సమాధానం చెబుతోంది. చేసేది లేక ఇళ్లు కట్టే లబ్ధిదారులు అధిక రేటుకు మట్టిని కొంటున్నారు. ఓపక్క ఇల్లు నిర్మించుకోకపోతే స్థలం లాగేసుకుంటామని అధికారుల బెదిరింపులు, మరోపక్క మట్టి మాఫియా అధిక ధరలతో లబ్ధిదారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంటి మెరకకే రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకూ ఖర్చవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక డబ్బు తీసుకున్నప్పటికీ ట్రక్కు నిండా మట్టిని తీసుకురావడం లేదని, సగం మాత్రమే ఇస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమ మట్టి కష్టాలు తీర్చాలని జగనన్న కాలనీ లబ్ధిదారులు కోరుతున్నారు.


Updated Date - 2022-08-13T06:09:23+05:30 IST