అధికారం.. అక్రమం

ABN , First Publish Date - 2021-10-31T05:30:00+05:30 IST

అధికార పార్టీ నాయకుల అండతో వినుకొండలో యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతుంది.

అధికారం.. అక్రమం
వెంకుపాలెం సమీపంలో పంట భూమిలో మట్టిని తోడేందుకు సిద్ధంగా ఉన్న జేసీబీ

వినుకొండలో మట్టి తరలింపు 

అధికార పార్టీ అండతో యథేచ్ఛగా

అటవీ సమీప ప్రాంతాల్లో తవ్వకాలు

చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు 

  

వినుకొండ, అక్టోబరు 31: అధికార పార్టీ నాయకుల అండతో వినుకొండలో యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా మూడు పూలు.. ఆరు కాయలు అన్న చందంగా కొనసాగుతుంది. వినుకొండ ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అమాంతంగా పెరగడంతో పట్టణానికి ఇరువైపులా కోకొల్లలుగా వెంచర్లు వెలిశాయి. ఈ వెంచర్ల చదునుకు పెద్ద ఎత్తున మట్టి అవసరం ఏర్పడింది. దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు అక్రమార్కులు మట్టి వ్యాపారం మొదలు పెట్టారు. వారికి అవసరమైన మట్టి కోసం ఏకంగా అటవీ సమీప ప్రాంతాలనే ఎంపిక చేసుకున్నారు. తవ్విన మట్టిని రాత్రి వేళల్లో గుట్టుచప్పుడుగా రవాణా చేస్తూ రూ.లక్షలు దండుకుంటున్నారు. వినుకొండ మండలం వెంకుపాలెం కురవ సమీపంలోని పంట భూములను మట్టి క్వారీలుగా మర్చారు. కొత్తగా ఎవరూ మట్టి వ్యాపారంలోకి రాకుండా దౌర్జన్యాలకు సైతం దిగుతున్నారు. నూజెండ్ల మండలం ఐనవోలు సమీపంలోని వల్లేరు వాగును అధికార పార్టీ మద్దతుదారులు ఆక్రమించుకుని ఇసుక క్వారీలను ఏర్పాటు చేసుకుని వ్యాపా రం చేస్తున్నారు. ఇటీవల ఒకరిపై ఒకరు పోటీతో  రెవెన్యూ, పోలీసులకు ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో రంగ ప్రవేశం చేసిన అధికారులు వారి వాహనాలను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఆయా వాహనాలను పోలీస్‌స్టేషన్‌ నుంచి కొందరు తీసుకెళ్లినట్లు సమాచారం. అధికారులను సైతం లెక్కచేయ కుండా అధికార పార్టీ అండతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శ నమని పలువురు ఆరోపిస్తున్నారు.

 

Updated Date - 2021-10-31T05:30:00+05:30 IST