మీ పిల్లలు సువాసన వెదజల్లే బాడీ స్ప్రేలు వాడేస్తున్నారా..? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోండి!

ABN , First Publish Date - 2021-11-16T18:30:13+05:30 IST

‘ఏ వయస్సుకా ముచ్చట’ అనేది మన నానుడి. మన శారీరక.. మానసిక ఎదుగుదలలు ఒక దానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. బహుశా అందుకే ఈ నానుడి ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. అయితే

మీ పిల్లలు సువాసన వెదజల్లే బాడీ స్ప్రేలు వాడేస్తున్నారా..? అయితే కచ్చితంగా ఇది తెలుసుకోండి!

ఆంధ్రజ్యోతి(16-11-2021)

‘ఏ వయస్సుకా ముచ్చట’ అనేది మన నానుడి. మన శారీరక.. మానసిక ఎదుగుదలలు ఒక దానితో మరొకటి అనుసంధానమై ఉంటాయి. బహుశా అందుకే ఈ నానుడి ప్రచారంలోకి వచ్చి ఉండవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో అమ్మాయిలు త్వరగా ఎదిగిపోతున్నారు. వారు రజస్వల అయ్యే వయస్సు తగ్గుతూ వస్తోంది. దీని వెనకున్న కారణాలేమిటి? ఇది సహజమైన పరిణామమేనా? లేదా ఒక ఆరోగ్య సమస్యా? అనే విషయాన్ని తెలుసుకుందాం. 


‘పిల్ల పెద్దమనిషి’ అయింది అనే మాట ఆడపిల్లలున్న ప్రతి ఇంట్లోనూ వినిపిస్తుంది. పెద్దమనిషి అంటే.. చిన్నపిల్లగానే ఉన్న అమ్మాయి సంతానోత్పత్తికి తగ్గట్టు ఎదిగిందని అర్థం. అయితే 13 - 14 ఏళ్ల వయసులో మొదటి నెలసరి మొదలైతే అంతా సవ్యంగా జరుగుతున్నట్టు లెక్క. దాదాపు మూడు దశాబ్దాలు క్రితం వరకూ ఇలాంటి పరిస్థితి ఉండేది. ఆ తర్వాత అమ్మాయిల శారీరక ఎదుగుదలలో మార్పులు రావటం మొదలుపెట్టాయి. ఇప్పుడు 8 లేదా 9 ఏళ్లకే తొలి నెలసరి మొదలవుతోంది. అంటే  కౌమారం క్రమేపీ ముందుకు జరుగుతోంది. దీనికి అనేక కారణాలున్నాయి. వీటిలో కొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాం. 


హార్మోన్ల అసమతౌల్యం

మనం తినే ఆహార పదార్థాలలో... వాడే ప్లాస్టిక్‌ వస్తువుల్లో రకరకాల రసాయనాలుంటాయి. ఉదాహరణకు ప్లాస్టిక్‌ వస్తువుల్లో ఉండే బిన్ఫినాల్‌, పురుగు మందుల ద్వారా ఆహారపదార్థాల్లోకి ప్రవేశించే ప్రమాదకర రసాయనాలు మహిళల అంతఃస్రావ వ్యవస్థపై ప్రభావం చూపిస్తాయి. ఈ రసాయనాలు శరీరంలో ప్రవేశించటం వల్ల ఈస్ట్రోజన్‌, థైరాయిడ్‌ హార్మోన్లు గాడి తప్పుతున్నాయి. ఈ హార్మోన్లపై ప్రభావం చూపేవాటిని ఎండోక్రైన్‌ డిస్‌రెప్టర్స్‌ అని పిలుస్తారు. ఇవి హార్మోన్లపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతాయి. అప్పుడు కలిగే హార్మోన్ల అసమతౌల్యం వల్ల ఆడపిల్లలు బాల్యం దాటకముందే ఎదిగిపోతున్నారు.


ఆహారం పాత్ర తక్కువే!

పశువులు, కోళ్లకు ఇచ్చే హార్మోన్‌ ఇంజెక్షన్ల ప్రభావం వాటిని తినే వారిపై కూడా పడుతుంది. ఈ హార్మోన్లు పరోక్షంగా ఆడ పిల్లల శరీరాలలోకి ప్రవేశించి వారు త్వరగా ఎదగటానికి కారణమవుతున్నాయనే వాదన ఉంది. ఇది కొంత వరకూ నిజమే అయినా- ప్లాస్టిక్‌ లేదా పురుగుమందులతో పోలిస్తే వీటి వల్ల జరిగే హాని తక్కువే. అంతే కాకుండా గుడ్లు, చికెన్‌ వంటివి మానేయటం వల్ల ఎదుగుదలకు అవసరమైన ప్రొటీన్‌, కాల్షియం వంటివి శరీరానికి అందవు. అందువల్ల వీటిని పూర్తిగా కట్టడి చేయటం అంత మంచిది కాదు. 


మెదడు ప్రమేయం ఉంది..

మన శరీరం ఎదుగుదలకు అవసరమైన హార్మోన్ల విడుదల మెదడు చేతిలో ఉంటుంది. మెదడు పంపే సంకేతాల ఆధారంగానే హార్మోన్లు విడుదలవుతూ ఉంటాయి. పౌష్టికారం బాగా ఎక్కువైతే మెదడు.. శరీరం సంతానోత్పత్తికి సిద్ధంగా ఉందని నిర్థారించుకుని, హార్మోన్ల విడుదలను ప్రేరేపిస్తుంది. కాబట్టి పిల్లలకు తగినంత పౌష్టికాహారం మాత్రమే అందించాలి. అదనపు క్యాలరీలు అందకుండా చూసుకోవాలి. తీపి, కొవ్వులు ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించాలి.


ఎలా పసిగట్టాలి?

ఆడపిల్లల్లో రొమ్ముల ఎదుగుదల కనిపిస్తే వారు కౌమార దశలో అడుగుపెట్టినట్లు లెక్క. రొమ్ముల్లో మార్పులు రావటం మొదలుపెట్టిన ఒకటిన్నర లేదా రెండేళ్లకు నెలసరి మొదలవుతుంది. సాధారణంగా ఈ తరం పిల్లల్లో ఎనిమిదేళ్లకు రొమ్ములు పెరగటం మొదలవుతోంది. కొందరిలో 8 ఏళ్ల లోపే ఈ మార్పులు మొదలవుతున్నాయి. 8 నుంచి 9 ఏళ్ల మధ్య రొమ్ములు స్పష్టంగా కనిపించేటంతగా పెరిగి... నెలసరి స్రావం మొదలవకపోయినా వారిని తప్పనిసరిగా వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి. 


ఎదిగితే ఎదుగుదల ఆగుతుంది

ఆడపిల్లలైనా, మగపిల్లలైనా మెచ్యూరిటీ వచ్చేవరకే ఎత్తు పెరుగుతారు. అందరూ అనుకుంటున్నట్టు పిల్లలు 18 ఏళ్ల వరకూ పెరుగుతూనే ఉంటారనేది నిజం కాదు. అలాగే తల్లితండ్రులు పొడగరులైనంత మాత్రాన పిల్లలూ పొడుగ్గా పెరుగుతారు అని అనుకోవడంలోనూ అర్థం లేదు. ఎత్తు కౌమారంలోకి అడుగు పెట్టిన వయసు మీద ఆధారపడి ఉంటుంది. ఆడపిల్లలు 8 లేదా తొమ్మిదేళ్లకే మెచ్యూర్‌ అయిపోతే, అక్కడి నుంచి ఎదుగుదల నెమ్మదించడం మొదలవుతుంది. నెలసరి మొదలయ్యాక (ఎర్లీ పీరియడ్స్‌) అప్పటి ఎత్తుకు రెండు, మూడు అంగుళాలకు మించి ఆడపిల్లలు పెరగరు. కాబట్టి 8 లేదా 9 ఏళ్లకే ఆడపిల్లల్లో రొమ్ములు ఎదుగుదల గమనిస్తే, వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకువెళ్లాలి.


వాయిదా వేయచ్చు

ఎర్లీ ప్యూబర్టీకి చేరువైన కొందరు పిల్లల్ల్లో కౌమారం ఏకంగా నెలసరితోనే మొదలైపోతుంది. రొమ్ముల ఎదుగుదల లాంటి లక్షణాలు కూడా వీరిలో ఉండకపోవచ్చు. ఇలా ఆరేళ్ల ఆడపిల్లలకూ జరగవచ్చు. ఇలాంటప్పుడు గ్రోత్‌ హార్మోన్‌ను విడుదల చేసే పిట్యూటరీ గ్రంథిలో సమస్య ఉందేమో వైద్యులు గమనిస్తారు. అవసరాన్ని బట్టి చికిత్స చేస్తారు. అలాగే 8 లేదా 9 ఏళ్ల ఆడపిల్లల్లో పీరియడ్స్‌ కనిపిస్తే, సురక్షితమైన ఇంజెక్షన్లతో కౌమారాన్ని ముందుకు నెట్టే వీలు ఉంది. తగిన ఎత్తుకు పెరిగి, తగిన మానసిక పరిణతికి చేరుకున్న తర్వాత పీరియడ్స్‌ మొదలయ్యేలా చేయవచ్చు. 


సమస్యలు ఇవి

త్వరగా రసజ్వాల కావటం వల్ల.. 

ఎత్తు పెరగడం ఆగిపోతారు

మానసికంగా కుంగిపోతారు

రక్తహీనత వేధిస్తుంది


ఇవీ ప్రమాదమే!

డ్రస్సింగ్‌ టేబుల్‌ దగ్గరున్న బాడీ స్ర్పే మీ అమ్మాయి వాడేసిందా? పోన్లే ముచ్చటపడి వాడింది అని తేలికగా తీసుకోకూడదు. సువాసన వెదజల్లే పర్‌ఫ్యూమ్స్‌, బాడీ స్ర్పేలు, సెంటెడ్‌ క్యాండిల్స్‌, డియోడరెంట్లు, మాయిశ్చరైజర్లు, సబ్బులు, రూమ్‌ ఫ్రెష్‌నర్లు, బాడీ వాష్‌లు, క్లీనింగ్‌ ఉత్పత్తులు, కాస్మటిక్స్‌.... ఇవన్నీ లావెండర్‌ ఆయిల్‌ లేదా టీ ట్రీ ఆయిల్‌తో తయారవుతూ ఉంటాయి. ఈ రెండు నూనెలు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ను ప్రేరేపించేవే! మంచి సువాసన వెదజల్లే సౌందర్య సాధనాలన్నింట్లో ఈ ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయని అర్థం చేసుకుని, వాటిని పిల్లలకు దూరంగా ఉంచాలి. అలాగే పిల్లలకు వాడే మాయిశ్చరైజర్లు, సబ్బులు, నూనెలు వాసన లేకుండా ఉండేలా చూసుకోవాలి. 


డాక్టర్‌ బి. శిరీష కుసుమ,

కన్సల్టెంట్‌ పీడియాట్రిక్‌ ఎండొక్రైనాలజిస్ట్‌,

రెయిన్‌బో చిల్ర్డెన్స్‌ హాస్పిటల్‌,

హైదరాబాద్‌.



Updated Date - 2021-11-16T18:30:13+05:30 IST