బాట్లా హౌస్ ఉగ్రవాదులు అమర వీరులు : మౌలానా తౌకీర్ రజా ఖాన్

ABN , First Publish Date - 2022-01-20T00:30:20+05:30 IST

హిందువులను బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇత్తిహాద్

బాట్లా హౌస్ ఉగ్రవాదులు అమర వీరులు : మౌలానా తౌకీర్ రజా ఖాన్

న్యూఢిల్లీ : హిందువులను బెదిరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇత్తిహాద్-ఈ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా ఖాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఉగ్రవాదులను అమర వీరులుగా కీర్తించారు. దర్యాప్తు జరిగి ఉంటే వీరు ఉగ్రవాదులు కాదని వెల్లడై ఉండేదన్నారు. 


తౌఫీర్ ఇటీవల  హిందువులను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, 2009లో తమ ప్రభుత్వం ఏర్పడితే బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్ తనకు చెప్పిందన్నారు. దీనిపై దర్యాప్తు జరిగి ఉంటే, మృతులు ఉగ్రవాదులు కాదని, వారికి అమర వీరుల హోదా ఇవ్వాలని ప్రపంచానికి తెలిసి ఉండేదన్నారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినందుకు తౌఫీర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.


ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ, కేరళ, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో ముస్లింల మద్దతుగల, మెజారిటీగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని మతపరమైన వ్యాఖ్యలు చేసే పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని చెప్పారు. 


బాట్లా హౌస్ ఎన్‌కౌంటర్ కేసు

2008 సెప్టెంబరు 13న ఢిల్లీలో ఐదు వరుస పేలుళ్ళు సంభవించాయి. వీటిలో 30 మంది ప్రాణాలు కోల్పోగా, 100 మందికి పైగా గాయపడ్డారు. అనంతరం 2008 సెప్టెంబరు 19న ఇండియన్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు న్యూఢిల్లీ, ఓఖ్లా, బాట్లా హౌస్‌లోని ఓ ఫ్లాట్‌లో దాక్కున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న ఢిల్లీ పోలీసులు ఈ ఉగ్రవాదులను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఉగ్రవాదులు ఎదురుదాడి చేయడంతో పరస్పరం కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించగా, పోలీసు ఇన్‌స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ అమరుడయ్యారు. మిగిలిన ఉగ్రవాదులను అరెస్టు చేశారు. అరెస్టయిన ఉగ్రవాదుల్లో ఒకడైన అరిజ్ ఖాన్ వురపు జునయిద్‌కు కోర్టు 2021 మార్చి 15న మరణ శిక్ష విధించింది. ఇన్‌స్పెక్టర్ శర్మ హత్య కేసులో ఈ శిక్ష విధించింది. 


Updated Date - 2022-01-20T00:30:20+05:30 IST