Advertisement

సరిహద్దులు జల్లెడ

Dec 3 2020 @ 00:32AM
కరకగూడెం మండలం అనంతారం ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులు, (ఇన్‌సెట్‌లో) వారోత్సవ సభ దృశ్యం (మావోయిస్టులు విడుదల చేసిన వీడియో ఆధారంగా)

ఏజెన్సీలో పోలీసుల విస్తృత తనిఖీలు 

మావోయిస్టుల కదలికలపై గ్రేహౌండ్స్‌ బలగాల దృష్టి

భయాందోళనలో ఏజెన్సీ ప్రజలు

పీఎల్‌జీఏ వారోత్సవాలను గ్రామగ్రామాన జరపాలని మావోయిస్టుల పిలుపు

మీడియాకు లేఖలు, వీడియోల విడుదల 

చర్ల/కరకగూడెం, డిసెంబరు 2 :  మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలు బుధవారం ప్రారంభమైన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములుగు జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. రంగాపురం, గొల్లగూడెం, దామరతోగు, గుండాల, ఆళ్లపల్లి, కాటాపురం, బీరెల్లి, మంగపేట, మల్లూరు, నరసింహాసాగర్‌ అడవి ప్రాంతాలు ఎక్కువ ఉండటంతో.. ఆయా ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లా కరకగూడెం, ములుగు జిల్లా తాడ్వాయి, మంగపేట, గుండాల పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తుండగా.. గ్రేహౌండ్స్‌ బలగాలు, స్పెషల్‌పార్టీ పోలీసులు విస్తృతంగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో మావోయిస్టు కమిటీల కదలికలు ఉన్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు జల్లెడ పడుతున్నారు. కరకగూడెం ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేయగా.. కొత్తగూడెం వోఎస్డీ కార్యాలయం సీఐ రాజగోపాల్‌ పర్యవేక్షించారు. వలస ఆదివాసీ గ్రామాలలోకి కొత్తవ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీస్‌శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. అయితే ఓ వైపు మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు, మరోవైపు పోలీసు బలగాల తనిఖీలు, కూంబింగ్‌లతో ఏజెన్సీ వాసులు భయంతో వణుకుతున్నారు. ఎప్పుడు ఏంజరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. 

లేఖలు పంపిన మావోయిస్టులు..

మావోయిస్టు పార్టీ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) వారోత్సవాలను గ్రామ, గ్రామాన జరపాలని తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి జగన్‌, భద్రాద్రి కొత్తగూడెం, తూర్పు గోదావరి డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు వారు మంగళవారం చర్ల పాత్రికేయులకు సోషల్‌మీడియా ద్వారా లేఖలు పంపారు. 2000 డిసెంబరు 2న ప్రజా విముక్తి సైన్యాన్ని ఏర్పరుచుకున్న రోజు పీఎల్‌జీఏ అని ఆ లేఖల్లో పేర్కొన్నారు. కామ్రేడ్‌ చారు ముజుందార్‌, కన్హయ్‌ చటర్జీల దిశానిర్దేశంతో  అమరులు శ్యాం, మహేష్‌, మురళి స్ఫూర్తితో వేలాది మంది అమరుల కలను సాకారం చేసుకుని పీఎల్‌జీఏ  ఏర్పాటైందని, ఇది జరిగి నేటికీ 20 ఏళ్లు పూర్తయ్యాయన్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో 4,483 మంది కామ్రేడ్‌లు అమరులవగా అందులో 839మంది మహిళలు ఉన్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు పార్టీపై చేస్తున్న దాడులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజా ఉద్యమాలను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ద్విముఖం, త్రిముఖ, బహుముఖ పథకాలను ప్రకటిస్తున్నాయని ఆరోపించారు. అలాగే సమాధాన్‌ దాడిని తిప్పి కొట్టాలని, దున్నే వారికే భూమి, రైతాంగ కమిటీలకే సర్వాధికారాలు, జల్‌ జంగిల్‌ జమీన్‌ ఆత్మగౌరవ అధికారం కోసం పీఎల్‌జీఏ పోరాడుతుందని, పీఎల్‌జీఏలో యువతీ, యువకులు భర్తీ కావాలని, మోసపూరిత శత్రువు లొంగుబాటను తిప్పికొట్టాలని వారు ఆ లేఖల్లో పేర్కొన్నారు.

వారోత్సవాల వీడియోలు విడుదల  

పీఎల్‌జీఏ వారోత్సవాలకు సంబంధించిన రెండు వీడియోలను కూడా మావోయిస్టులు విడుదల చేశారు. ఆ వీడియోలు పాత, కొత్త చిత్రాలతో మిక్సింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. అనారోగ్యంతో మృతి చెందన కేంద్రకమిటీ సభ్యుడు రామన్నతో పాటు, ఇతర నాయకులకు వారు జోహార్లు తెలిపినట్లు ఆ వీడియోలో ఉంది. ఈ వారోత్సవాల్లో మావోయిస్టుల అగ్రనాయకులు ఆజాద్‌, జగన్‌, శారద, హరిభూషన్‌తో పాటు సుమారు 2వేలమందికిపైగా ఆదివాసులు పాల్గొన్నట్లు సమాచారం. 


Follow Us on:
Advertisement