అక్రమాల మయం

ABN , First Publish Date - 2022-06-19T06:58:13+05:30 IST

పంటల బీమాలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు కదిలారు. అవకతవకలపై విచారణకు ఆదేశించారు. అధికారులను మండలాలకు పంపారు.

అక్రమాల మయం
కోర్టు వివాదంలో ఉండి బీమా మంజూరైన దరిమడుగు సర్వే నెంబర్‌ 840లోని భూమి

పంటల బీమాలో వెలుగుచూస్తున్న అధికారుల మాయాజాలం 

రూ.50వేలపైన పరిహారం జమలపై గందరగోళం

ఆందోళన చెందుతున్న రైతులు   

అవకతవకలపై కదలిక

అసలు రాని వారినుంచి వినతుల స్వీకరణ

‘ఆంధ్రజ్యోతి’ కథనాలపై ఉన్నతాధికారుల దృష్టి

పలుచోట్ల సబ్‌ డివిజన్‌ స్థాయి అధికారులతో విచారణ

రియల్‌ వెంచర్లకూ పరిహారం 

కోర్టు వివాద భూములకు నగదు మంజూరు

ఇడుపూరులో వైసీపీ నేతల భూములకు కేటాయింపు

పంటల బీమాలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు కదిలారు. అవకతవకలపై విచారణకు ఆదేశించారు. అధికారులను మండలాలకు పంపారు. కాగా  బీమా మాయలు అధికారులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. జామాయిల్‌ తోటలకు పరిహారం ఒకచోట ఇవ్వగా, రియల్‌ వెంచర్లకు మరోచోట ఇచ్చారు. అయితే పంటలు సాగుచేసి నష్టపోయిన రైతులకు పరిహారం మంజూరులో ఉదాసీనంగా వ్యవహరించిన ప్రభుత్వం వైసీపీ నాయకుల అక్రమాలకు మాత్రం చేయూతనిచ్చింది. అనధికారికంగా రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు వేసి వాటిని విక్రయించిన సర్వే నంబర్లను సైతం పంట నష్టపరిహారం జాబితాలో చేర్చారు. ముఖ్యంగా కోర్టు వివాదాల్లో ఉన్న సర్వే నంబర్లకు, పంటలు సాగుచేయకుండా ఏళ్ల తరబడి పిచ్చిమొక్కలు పెరిగిన భూములకూ బీమా మంజూరైంది. ఇవన్నీ మార్కాపురం మండలం ఇడుపూరు ఇలాకాలోని అధికారపార్టీ నాయకుల సర్వే నెంబర్లు కావడం విశేషం. పంట నష్టపరిహారం నమోదు కోసం అధికారులపై సదరు నేతలు సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించినట్లు తెలుస్తోంది.

ఒంగోలు, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంటల బీమా మంజూరులో చోటుచేసుకున్న అక్రమాలు, అర్హులకు అన్యాయం ఘటనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీమా మంజూరులో అవకతవకలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మరోవైపు బీమా మొత్తం మంజూరైన లబ్ధిదారులకు నగదు జమ విషయంలో  గందరగోళం నెలకొంది. నాలుగు రోజుల క్రితమే నగదు జమ చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో పేర్లు ఉన్న అనేక మంది తమ ఖాతాలకు నగదు రాలేదని చెప్తున్నారు. ప్రత్యేకించి రూ 50వేల పైబడి మంజూరైన వారి ఖాతాలకు అసలు జమ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే పెద్ద మొత్తంలో పరిహారం మంజూరైన వారి వివరాలు మరోసారి పరిశీలించేలా వారికి తాత్కాలికంగా ఆపారని అధికారవర్గాల సమాచారం. ఈ పరిణామాలతో రైతుల్లో  తీవ్ర అలజడి కనిపిస్తోంది.  అధికారుల తీరుకు నిరసనగా శనివారం కూడా పలుచోట్ల ఆందోళనలు నిర్వహించారు. తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లిలో సచివాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 


విచారణకు ఆదేశం

బీమా పరిహారంలో అవకతవకలపై ఉన్నతాధికారులు కదిలారు. గత నాలుగురోజులుగా ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న ఆందోళనలతోపాటు, ఇందుకు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన  కథనాలపై దృష్టిసారించారు ఆయా ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాలతో సబ్‌డివిజన్‌ స్థాయి అఽధికారులు పలుచోట్ల విచారణలు చేపట్టగా తాజాగా శనివారం దర్శి సబ్‌డివిజన్‌ ప్రాంతానికి సంబంధించి ప్రచురితమైన కథనాలపై విచారణకు జిల్లా వ్యవసాయ అధికారి (డీఏవో) ఆదేశించారు. మరోవైపు పంటల బీమా మంజూరైన లబ్ధిదారుల్లో రూ.50వేలలోపు పరిహారం ఉన్న వారికే నాలుగు రోజులుగా నగదు జమలు అవు తుండగా ఆపై ఉన్నవారు తమ బ్యాంకు అకౌంట్లకు నగదు రాకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. తమకు అర్హత ఉన్నప్పటికీ బీమా రాలేదన్న రైతుల నుంచి అధికారులు వినతులు స్వీకరిస్తున్నారు. 


కలెక్టర్‌ ఆదేశాలతో..

జిల్లాలో గత ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి లక్షా 10వేల మందికిపైగా రైతులకు రూ.275.35 కోట్లు బీమా పరిహారం మంజూరైన విషయం విదితమే. అందుకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలను ప్రకటించిన అనంతరం అనేకమంది రైతులు వివిధ ప్రాంతాల్లో ఆందోళనలకు దిగారు. పలుచోట్ల అర్హత ఉన్నా తమకు రాలేదని, అసలు పంటలు వేయని వారికి మంజూరైందంటూ నిరసనలు చేపట్టారు. ఇలా 10 నుంచి 12 మండలాల్లో నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వీటితోపాటు ఆయా ప్రాంతాల్లో బీమా లబ్ధిదారుల గుర్తింపు తీరు, క్షేత్రస్థాయిలోని సిబ్బంది చేసిన అవకతవకలు, అక్రమాలపై ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాలతో జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దృష్టిసారించారు. కొండపి మండలంలో అక్రమాలపై ఏడీఏ ప్రభాకర్‌, తర్లుపాడు వ్యవహారంపై ఆ ప్రాంత ఏడీఏ బాలాజీనాయక్‌లు శుక్రవారం విచారణ చేపట్టారు. లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. 


నగదు జమల్లోనూ గందరగోళం 

అర్ధవీడు మండలంలో పెద్దఎత్తున అక్రమాలు, అవకతవకలు జరిగిన విషయం వెలుగులోకి రాగా డీఏవో ఆదేశాలతో ఒంగోలు నుంచి శుక్రవారం సాయంత్రం సబ్‌ డివిజన్‌ స్థాయి అధికారిణి లక్ష్మీసాయిసుధ అర్ధవీడు వెళ్లి విచారణ నిర్వహిం చారు. తాజాగా దర్శి ప్రాంతంలో అక్రమాలపై ‘గుండెకోత’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. ముండ్లమూరు, దర్శి వ్యవసాయశాఖ అధికారులను డీఏవో వివరణ కోరడంతో పాటు సమగ్ర విచారణ చేయాలని నిర్ణయుంచారు. ఒంగోలు ఏడీఏ సుభాషిణిని విచారణాధికారిగా నియమించారు. 


జామాయిల్‌ తోటలకు పరిహారం

ముండ్లమూరు మండలంలోని తూర్పుకంభంపాడుకి చెందిన కొంత మంది జామాయిల్‌ తోటలు సాగు చేసి వాటిని మిర్చిగా నమోదు చేయించుకున్నారు. నాలుగు రోజుల క్రితం నష్టపరిహారం పంపిణీ జాబితాలో పేర్లు చూసుకున్న  రైతులు అవాక్కయ్యారు. వాస్తవానికి మిర్చి పంట వేయకుండా పంటల బీమాలో ఎలా నమోదు చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయాధికారులు, వీఏఏలు అవినీతికి పాల్పడి ఇలా అనర్హులను అర్హుల జాబితాలో చేర్చారని వారు ఆరోపించారు. శనివారం తూర్పుకంభంపాడుకు చెందిన రైతులు నష్టపరిహారం పంపిణీలో అక్రమాలు జరిగాయని, ఏడుగురు అక్రమంగా పరిహారం పొందారని గుర్తించారు. జాబితాలో అనర్హుల పేర్లు ఎవరు చేర్చారో విచారించి తగిన చర్యలు తీసుకోవాలని, అర్హులకు పంట నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని  డిమాండ్‌ చేశారు. ఈ విషయమై ఏవో శ్రీధర్‌కు ఫిర్యాదు చేసేందుకు ముండ్లమూరు వచ్చారు. ఆయన అందుబాటులో లేకపోవటంతో స్థానికంగా ఉండే సచివాలయంలో వీఏఏకు అర్జీ ఇవ్వాలని ఏవో తెలిపారు. 


రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు బీమా 

 మార్కాపురం మండలం ఇడుపూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని దరిమడుగులో ఇటీవల కాలంలో వ్యవసాయ భూముల్లో అనధికారికంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేశారు. ఆ భూముల్లో పంటలు సాగు చేసి దశాబ్దాలు గడుస్తోంది. అయితే ఆ భూములకు వైసీపీ ప్రభుత్వం పంటల భీమాలో పంటనష్ట పరిహారం మంజూరు చేసింది. సర్వే నంబరు 818, 825, 831లలో ప్రస్తుతం ఇళ్ల పాట్లు వేశారు. ఇవన్నీ నాలుగైదు ఏళ్ల క్రితమే విక్రయించారు. వాటన్నింటికీ ప్రభుత్వం బీమా పరిహారం మంజూరు చేసింది. దరిమడుగు గ్రామ పరిధిలోని సర్వేనంబర్‌ 415లో పిచ్చిచెట్లు పెరిగాయి. ఆ భూమిలో పత్తి సాగు చేసినట్లు పంట నష్ట పరిహారం మంజూరు చేశారు. ఇక దరిమడుగు ఇలాకాలోని సర్వే నెంబరు 840-1 భూమిపై ప్రస్తుతం హైకోర్టులో కేసు విచారణ సాగుతోంది. కానీ వైసీపీ ప్రభుత్వం ఆ భూమికి సైతం బీమా మంజూరు చేసింది. పంట నష్టపరిహారం నమోదు చేసిన సమయంలో వ్యవసాయాధికారులపై వైసీపీ నాయకులు చేసిన ఒత్తిడితోనే ఈ అక్రమాలు జరిగినట్లు వెల్లడైంది. గ్రామ వ్యవసాయ సహాయకుల లాగిన్లలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వలంటీర్లు అక్రమంగా  పంట నమోదు చేసినట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-06-19T06:58:13+05:30 IST