మాయావతి మాయ మాయం!

Published: Mon, 14 Feb 2022 03:32:53 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మాయావతి మాయ మాయం!

తొలి రెండు దశల్లో ఎక్కువ సీట్లు

ముస్లింలు, ఓబీసీలకే కేటాయింపు

బీజేపీ-బీ టీమ్‌గా విమర్శల వెల్లువ

జాతవుల్లో అయోమయం

ఇతర దళిత ఓట్లపైనా పార్టీల కన్ను

బీఎస్పీ అధినేత్రి భవితను తేల్చే ఎన్నిక


ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం, ఫైర్‌బ్రాండ్‌ నాయకురాలు, బహుజన సమాజ్‌  పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రభావం ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా కనిపించడం లేదు. పైగా బీఎస్పీ.. అంటే బీజేపీకి ‘బీ-టీం’ అనేమాట వినిపిస్తోంది. తొలి 2 దశల ఎన్నికల్లో ముస్లింలు, ఓబీసీలతోపాటు జాట్లకు ఎక్కువ టికెట్లు ఇవ్వడం ద్వారా బీజేపీకి మేలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు బెహన్జీకి కుడిభుజమైన లాల్జీవర్మ ఎస్పీతో చేతులు కలపడం, ప్రచారానికి మాయావతి దూరంగా ఉండడం, దళితుల్లో నెలకొన్న అయోమయం వంటివి పార్టీపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది.


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ‘‘మా దగ్గర పోటీ యోగి, అఖిలేశ్‌ మధ్యే ఉన్నది సార్‌ .. బెహన్జీ (మాయావతి) ప్రభావం ఏమంతగా లేదు. మా జాతవులు అఖిలేశ్‌కే మద్దతిస్తున్నారు’’ అని ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌కు చెందిన డ్రైవర్‌ వికాస్‌ చెప్పారు. పశ్చిమ యూపీలో జరిగిన తొలి దశ పోలింగ్‌లో పాల్గొని వచ్చిన వికాస్‌ చెప్పిన మాటలు యూపీ రాజకీయ చిత్రపటం పట్ల కొంత వరకూ స్పష్టతనిస్తాయి. యూపీలో ముఖ్యమంత్రి పదవి ఎవరికి దక్కుతుందనే విషయంపై అతడికి స్పష్టత లేకపోయినా.. ఎవరు ఎటు వైపు మొగ్గుతున్నారన్న విషయం మాత్రం అతడి మాటల ద్వారా అర్థమవుతోంది. ఢిల్లీలోని టాక్సీ డ్రైవర్లలో అత్యధికులు ఉత్తర ప్రదేశ్‌కు చెందిన వారే. వారిలో చాలా మంది.. ఇదివరకటితో పోలిస్తే యూపీలో నేరచరితులు ఇప్పుడు తగ్గిపోయారని, యోగి ఆదిత్యనాథ్‌ నేరచరితులపై గట్టి చర్యలు తీసుకున్నారని అంటున్నారు. ఉదాహరణకు.. ‘‘బెహన్జీ, అఖిలేశ్‌ కాలంలో నిలుచున్న మనిషినే దోపిడీ చేసేవారు. ఇప్పుడు మాకు ఆ భయం లేదు’’ అని పశ్చిమ యూపీకి చెందిన టాక్సీ డ్రైవర్‌ రమేశ్‌ సింగ్‌ అన్నారు. యూపీలో సమాజ్‌వాదీ పార్టీ-రాష్ట్రీయ లోక్‌దళ్‌ సీట్లను చీల్చేందుకు బీఎస్పీ తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ పెద్దగా ఫలించకపోవచ్చునని పశ్చిమ యూపీలో ఓటింగ్‌ సరళిని బట్టి అర్థమవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. తొలి రెండు దశల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించిన 109 మంది అభ్యర్థుల్లో 31 మంది ముస్లింలు, 13 మంది ఓబీసీలు ఉన్నారు. అనేక చోట్ల జాట్‌ వర్గీయులను ఆమె నిలబెట్టారు. దీనితో ఆమెను బీజేపీ-బి పార్టీగా విమర్శించేందుకు ప్రత్యర్థులకు అవ కాశం ఏర్పడింది. ఈ వ్యూహం వల్ల ఆమెకే నష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో మాయ క్రియాశీల పాత్ర పోషించకపోవడంతో రాష్ట్రంలో ఉన్న 21 శాతం దళిత ఓటర్లు అయోమయంలో పడ్డారు. భారతీయ జనతా పార్టీ నేతలు మాత్రం సమాజ్‌ వాది పార్టీతో పాటు బీఎస్పీకి, కాంగ్రె్‌సకు సమాన ప్రాధాన్యం కల్పించేందుకు తీవ్ర యత్నాలు చేస్తున్నారు. గతంలో మాయావతి- అఖిలేశ్‌ ఏర్పర్చిన ప్రభుత్వం హయాంలో జరిగిన అక్రమాల గురించి ప్రస్తావిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ‘బువా-బతీజా’ సర్కార్‌ అంటూ విమర్శిస్తుండగా.. మోదీ, ఇతర నేతలు కాంగ్రెస్‌ పై అస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. దీని వల్ల బీఎస్పీ, కాంగ్రెస్‌ పోటీలో నిలిచి ఎస్పీ ఓట్లు చీలుస్తాయన్నది వారి అభిప్రాయంగా కనపడుతోంది.


ఇదీ లెక్క..

యూపీ దళిత ఓటర్లలో 55 శాతం మంది జాతవులు కాగా, పాసీలు 16 శాతం, కనౌజియా, ధోబీలు 16 శాతం, కోరీలు 4.5 శాతం, ధనుక్‌లు 1.5 శాతం, వాల్మీకులు 1.35 శాతం, ఖటిక్‌లు 1.5 శాతం ఉన్నారు. మిగతావారు ఇతరులు. మాయావతి స్వయంగా జాతవ వర్గీయురాలు కనుక గత ఎన్నికల వరకూ జాతవులు అత్యధికంగా బీఎస్పీ వైపు మొగ్గు చూపారు. పాసీలు బీజేపీ, సమాజ్‌ వాది పార్టీల మధ్య విడిపోగా, ఖటిక్‌లు బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు. మిగతా దళిత కులాలు తమ బలమైన అభ్యర్థి ఎటు వైపు ఉంటే అటు వైపు ఓటు వేశారు. 2017 ఎన్నికల్లో జాతవేతర దళితులు అత్యధికంగా బీజేపీకి మద్దతునీయడంతో మొత్తం 86 రిజర్వుడు స్థానాల్లో బీజేపీ 76 స్థానాలు గెలుచుకున్నది. కాగా, గత ఏడాది అక్టోబర్‌ నుంచి జనవరి 8న ఎన్నికల షెడ్యూలు ప్రకటించే రోజు వరకూ మాయావతి ఎటువంటి రాజకీయ సభల్లో పాల్గొనలేదు. షెడ్యూలు ప్రకటించిన తర్వాత ఎన్నికల కమిషన్‌ సభలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. మాయావతి మౌనం పాటించడం ద్వారా బీజేపీకి వ్యూహాత్మక మద్దతు ప్రకటిస్తున్నారని.. ఆమెకు, బీజేపీ నేతలకు మధ్య అవగాహన ఉన్నదని ప్రచారం సాగుతుండడంతో జాతవ వర్గాల్లో అయోమయం నెలకొంది. వారిని తమ వైపునకు తిప్పుకొనేందుకు సమాజ్‌వాదీ పార్టీ కూడా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మరోవైపు.. మాయావతిని విమర్శించిన పలువురు సీనియర్‌ బీఎస్పీ నాయకులు ఇతర పార్టీల్లో చేరడమో, లేక ఆమె వారిని పార్టీ నుంచి బహిష్కరించడమో జరిగింది. 2017 ఎన్నికల్లో బీఎస్పీ 19 సీట్లను గెలుచుకోగా అందులో 15 మంది పార్టీకి రాజీనామా చేశారు.


ఎస్పీ వైపు మొగ్గేనా?

సాంప్రదాయంగా బీసీలకు, దళితులకు మధ్య ఉన్న వైరుధ్యం ఉన్నందువల్ల దళిత నేతలు సమాజ్‌వాదీ పార్టీలో చేరినప్పటికీ.. దళిత ఓటు మాత్రం సమాజ్‌వాదీ వైపు మొగ్గు చూపుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. సమాజ్‌వాదీ ప్రభుత్వ హయాంలో దళితులపై ఎక్కువగా అత్యాచారాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కలిసి పోటీచేసినప్పటికీ దళిత ఓటు సమాజ్‌వాదీపార్టీకి బదిలీ కాకపోవడం వల్ల రెండు పార్టీలకూ పెద్దగా ప్రయోజనం కలుగలేదు. మాయావతి గనుక ఇప్పుడు ప్రజల ముందుకు వచ్చి తాను గట్టిగా పోటీలో ఉన్నారని స్పష్టం చేస్తే ఇప్పటికీ జాతవ ఓటర్లలో అత్యధిక శాతం ఆమె పార్టీకే మద్దతునిస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్పీ, బీజేపీ, ఆర్‌ఎల్‌డీ, కాంగ్రెస్‌ జాతవులను తమ వైపునకు తిప్పుకొనేందుకు ప్రయత్నించినప్పటికీ పట్టణ ఓటర్లు మాత్రమే ఎక్కువగా ప్రభావితం అవుతారని, గ్రామీణ ఓటర్లు మాయావతి వైపేమొగ్గు చూపుతారని ఈ వర్గాలు అంటున్నాయి.


ఇతర దళిత వర్గాల ఓట్ల వేటలో

జాతవులు కాక ఇతర దళిత వర్గాల్లో కనిపిస్తున్న ఊగిసలాటను ఉపయోగించుకుని వారిని తమ వైపునకు మళ్లించుకునేందుకు అన్ని పార్టీలూ ప్రయత్నిస్తున్నాయి. ఉదాహరణకు.. సమాజ్‌వాదీ పార్టీ యూపీలో దళిత సమ్మేళనాలను నిర్వహిస్తూ వివిధ కులాలకు చెందిన చిన్న పార్టీలతో పొత్తులు కుదుర్చుకుంది. బీజేపీ కూడా అదే వ్యూహాన్ని అవలంబిస్తూ జాతవేతర దళితుల్లో బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. సామాజిక్‌ సంవాద్‌ పేరుతో బీజేపీ జాతవేతర దళితులను సమీకరిస్తోంది. మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవ క్‌ సంఘ్‌ కూడా ఈ వర్గాల్లో చాలా కాలంగా కింది స్థాయిలో పనిచేయడం బీజేపీకి అనుకూలంగా మారొచ్చు. జాతవేతర దళితులనే కాక జాతవులనూ చీల్చేందుకు బీజేపీ ఆ వర్గానికి చెందిన బేబీ రాణి మౌర్య, దుష్యంత్‌ గౌతమ్‌ వంటి నేతలను రంగంలోకి దించింది. మొత్తమ్మీద.. జాతవ ఓట్ల చీలిక, జాతవేతర దళితులు వివిధ పార్టీల మధ్య ఎంత మేరకు విడిపోతారు అన్న దానిపైనే ఉత్తరప్రదేశ్‌ రాజకీయ చిత్రపటం ఆధారపడి ఉంది.


మాయ భవితవ్యం తేల్చే ఎన్నిక

స్వాతంత్య్రం తర్వాత ఉత్తరప్రదేశ్‌లో దళితులకు కాంగ్రెస్‌ తప్ప రాజకీయ ప్రత్యామ్నాయం కనిపించలేదు. ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీని వ్యతిరేకించి జైలుపాలైన కాంగ్రెస్‌ నాయకుడు రామ్‌ధన్‌.. 1977లో జనతా పార్టీ టికెట్‌పై గెలిచి దళితులకు ఆశాదీపంగా నిలిచారు. జగ్జీవన్‌రామ్‌ను ప్రధానమంత్రి చేయకుండా మొరార్జీ దేశాయ్‌ను ఆ పదవిలో నియమించడంతో రామ్‌ధన్‌ జనతా పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత అనేక మంది దళిత నేతలు ఆవిర్భవించినప్పటికీ కాన్షీరామ్‌ ప్రవేశించేంతవరకూ దళితుల స్వరానికి సరైన గొంతుక లభించలేదు. కాన్షీరామ్‌ వారసురాలిగా యూపీ రాజకీయాలను ప్రభావితం చేసిన మాయావతి రాజకీయ భవిష్యత్తునుఈ ఎన్నికలు నిర్ణయించే అవకాశాలున్నాయి. ఆమె ప్రధాన ఓటు బ్యాంకు అయిన జాతవులే చీలిపోతే ఇక ఆమెకు భవితవ్యం ఉండదని, రాష్ట్రవ్యాప్తంగా దళితులను ప్రభావితం చేసే మరో నాయకత్వం కోసం యూపీ ఎదురు చూడాల్సి ఉంటుందని రాజకీయ వర్గాల అంచనా.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.