Key postition: కుటుంబ పార్టీ బాటలో బీఎస్‌పీ.. మేనల్లుడికి మాయావతి కీలక బాధ్యతలు

ABN , First Publish Date - 2022-09-14T02:09:02+05:30 IST

మాయవతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ సైతం కుటుంబ పార్టీ గా..

Key postition: కుటుంబ పార్టీ బాటలో బీఎస్‌పీ.. మేనల్లుడికి మాయావతి కీలక బాధ్యతలు

న్యూఢిల్లీ: మాయవతి (Mayawati) సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ (BSP) సైతం కుటుంబ పార్టీ (Family party)గా రూపుదిద్దుకోనుందా? అవుననే అభిప్రాయానికి తావిస్తూ, బీఎస్‌పీ అధినేత్రి మాయావతి తమ మేనల్లుడు, పార్టీ జాతీయ సమన్వయకర్త ఆకాష్ ఆనంద్‌ (Akash Anand)కు కీలక బాధ్యతలు అప్పగించారు. త్వరలో జరుగనున్న గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో పార్టీ ఆర్గనైజేషన్‌ను పునర్వవస్థీకరించే కీలక బాధ్యత ఆయన భుజస్కంధాలపై పెట్టారు. తద్వారా పార్టీలో నెంబర్-2 స్థానానికి ఆయనను ఫోకస్ చేయాలని మాయవతి అభిలషిస్తున్నట్టు చెబుతున్నారు.


గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగాల్సి ఉండగా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు 2023లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తాయి. ఈ మూడు రాష్ట్రాల్లో పార్టీ పని అప్పగించడం ద్వారా ఆయనను నేరుగా ప్రజలకు చేరువ చేయాలని మాయావతి ఆకాంక్షిస్తున్నట్టు చెబుతున్నారు. ఆకాష్ ఆనంద్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసుకుని 2017లో తిరిగి వచ్చారు. అనంతరం ఆయనకు మాయవతి పార్టీ బాధ్యతలు అప్పగించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్‌పీ ఎన్నికల ప్రచార వ్యూహాలను అతనికి అప్పగించారు. 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో పార్టీ సోషల్ మీడియా కార్యక్రమాలును ఆకాష్ చూసుకున్నారు. 2019లో బీఎస్‌పీతో పొత్తు తెంచుకున్న మాయావతి ఆ తర్వాత పార్టీలో మార్పులు చేర్పులు చేపట్టారు. ఆకాష్ తెరవెనుక నుంచే ఎక్కువగా పార్టీ వ్యవహారాలు చూసుకునే వారు. అయితే, ఎన్నికల ప్రచారం, ర్యాలీల్లో మాయావతి వెంట అడపాదడపా కనిపించే వారు. ఇటీవల మధ్యప్రదేశ్‌లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆకాష్ ప్రచారం చేశారు. పలు జిల్లాల్లో బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రజా సమస్యలు లేవనెత్తమని, మెంబర్‌షిప్ డ్రైవ్‌ ద్వారా పార్టీని పటిష్టం చేయమని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. 


రాజస్థాన్ పర్యటనలో...

కాగా, ప్రస్తుతం రాజస్థాన్‌లోని వివిధ జిల్లాల్లో ఆకాష్ పర్యటిస్తూ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. అసెంబ్లీ  ఎన్నికలకు ముందే జిల్లా స్థాయిలో పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచి, పార్టీ రాష్ట్ర విభాగంలో చేపట్టాల్సిన మార్పులు చేర్పులను మాయావతికి నివేదించనున్నారు. 2018 మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్‌పీ 4 సీట్లు గెలుచుకుంది. 2018 రాజస్థాన్ ఎన్నికల్లో 6 సీట్లు సాధించింది. తాజాగా, గుజరాత్ ఎన్నికలకు ముహూర్తం దగ్గరపడుతుండటంతో ఆకాష్‌ను ప్రధానంగా గిరిజన ప్రాంతాలపై దృష్టి సారించాలని బీఎస్‌పీ ఆదేశించింది. రాబోయే రోజుల్లో వరుస సమావేశాలతో పార్టీ క్యాడర్‌కు ఆకాష్‌ను మరింత దగ్గర చేయాలని మాయావతి ఆలోచనగా ఉంది.

Updated Date - 2022-09-14T02:09:02+05:30 IST