రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాయావతి

ABN , First Publish Date - 2022-04-10T19:24:01+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ పార్టీ

రాహుల్ గాంధీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాయావతి

లక్నో : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతరుల గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ పార్టీని ఆయన చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ బీఎస్‌పీని అపఖ్యాతిపాలు చేసేందుకు ప్రయత్నించారని, ఇప్పుడు ఆయన కుమారుడు రాహుల్ కూడా ఆ బాటలోనే నడుస్తున్నారని అన్నారు. 


రాహుల్ గాంధీ శనివారం మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో కలిసికట్టుగా పోరాడుదామని బీఎస్‌పీని కాంగ్రెస్ కోరిందని, ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థిగా మాయావతిని ప్రకటిద్దామని చెప్పిందని తెలిపారు. అయితే మాయావతి ఈ ప్రతిపాదనపై స్పందించలేదన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) వంటివాటికి భయపడి ఆమె ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గెలవడానికి మార్గం సుగమం చేశారని ఆరోపించారు. 


మాయావతి ఆదివారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ బీఎస్‌పీని అపఖ్యాతిపాలు చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. బీఎస్‌పీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్ అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ సీఐఏ ఏజెంట్ అని రాజీవ్ ఆరోపించేవారన్నారు. ఇప్పుడు రాజీవ్ కుమారుడు రాహుల్ కూడా తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ, కేంద్ర దర్యాప్తు సంస్థలకు తాను భయపడిపోతున్నానని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటల్లో లేశమాత్రమైనా నిజం లేదన్నారు. 


బీఎస్‌పీతో పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్ ముందుకు వచ్చిందని రాహుల్ చెప్పిన మాటలను మాయావతి తోసిపుచ్చారు. బీజేపీ విజయానికి బీఎస్‌పీ మార్గం సుగమం చేసిందని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆమె మాట్లాడుతూ, బీజేపీపై కాంగ్రెస్ పోరాటం దయనీయంగా ఉందన్నారు. బీజేపీని ఎదుర్కొనడంలో కాంగ్రెస్ రికార్డును పరిశీలించుకోవాలని, ఆ తర్వాత బీఎస్‌పీ గురించి మాట్లాడాలని హితవు పలికారు. ఎన్నికల ఫలితాలపై ప్రతిపక్ష పార్టీలన్నీ సమీక్షించుకోవాలన్నారు. 


ఉత్తర ప్రదేశ్‌లో 2007 నుంచి 2012 వరకు తన ప్రభుత్వం ఉండేదని, అప్పట్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునేదని ఆరోపించారు. 


403 స్థానాలుగల ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని కూటమి 273 స్థానాలను సాధించి, మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌కు రెండు స్థానాలు, 2.5 శాతం ఓట్లు లభించాయి. 97 శాతం మంది కాంగ్రెస్ అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయారు. బీఎస్‌పీ ఒక స్థానంలో గెలిచింది, 13 శాతం ఓట్లను సాధించింది. 72 శాతం మంది బీఎస్‌పీ అభ్యర్థులు తమ డిపాజిట్లను కోల్పోయారు. సమాజ్‌వాదీ పార్టీ కూటమికి 125 స్థానాలు లభించాయి. 


Updated Date - 2022-04-10T19:24:01+05:30 IST