‘హస్తం’ గూటికి బడంగ్‌పేట మేయర్‌

ABN , First Publish Date - 2022-07-02T17:45:47+05:30 IST

కాంగ్రెస్‌లో గెలిచిన కార్పొరేటర్‌కు మేయర్‌ పదవి అప్పగిస్తే.. తీరా ఇప్పుడు సదరు మేయర్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పి ఆమె తిరిగి ‘హస్తం’ గూటికి

‘హస్తం’ గూటికి బడంగ్‌పేట మేయర్‌

సొంత పార్టీలో చేరేందుకు నిర్ణయం..? 

త్వరలో అధికారిక ప్రకటన


హైదరాబాద్/సరూర్‌నగర్‌: కాంగ్రెస్‌లో గెలిచిన కార్పొరేటర్‌కు మేయర్‌ పదవి అప్పగిస్తే.. తీరా ఇప్పుడు సదరు మేయర్‌ టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పి ఆమె తిరిగి ‘హస్తం’ గూటికి చేరాలని నిర్ణయించుకోవడంతో మంత్రి సబితారెడ్డికి ఒక్కసారిగా షాక్‌కు గుర య్యారు. అయితే తాము పార్టీ మారి తప్పు చేశామని, అందుకే మనస్సు మార్చుకుని తిరిగి సొంత పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నామని మేయర్‌ దంపతులు పేర్కొంటున్నారు. మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తం గా ప్రస్తుతం ఇది హాట్‌ టాపిక్‌గా మారింది. 


కొంతకాలంగా దూరం.. దూరం

 బడంగ్‌పేట మునిసిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి దంపతులు కొంత కాలం గా అధికార పార్టీలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌లోని కొందరు నేతల వ్యవహార శైలి వల్ల తాము తీవ్ర మనస్తాపానికి గురి కావాల్సి వస్తున్నదని, మంత్రి సబితారెడ్డి సైతం అలాంటి నేతల మాటలు నమ్మి తమను దూరం పెట్టారని మేయర్‌ దంపతులు తమ సన్నిహితుల వద్ద వాపోయినట్టు తెలిసింది. దాం తో తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకుని వారం రోజుల కితం ఢిల్లీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిసి వచ్చినట్టు తెలిసింది. తాజాగా గురువారం మరోసారి నగరంలో ఆయనను స్వయంగా కలిసి రావ డం రాజకీయ దుమారం రేపింది. మేయర్‌ స్థాయి నాయకురాలు పార్టీని వీడడం టీఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బగానే భావించవచ్చునని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు టీఆర్‌ఎస్‌ పెద్దలు వారిని సముదాయించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని సమాచారం. 


కాంగ్రెస్‌లో గెలిచి.. టీఆర్‌ఎస్‌ మేయర్‌ పదవి పొంది..

 పారిజాతానర్సింహారెడ్డి 2020 మునిసిపల్‌ ఎన్నికల్లో బడంగ్‌పేట కార్పొరేషన్‌లోని నాదర్‌గుల్‌ 31వ డివిజన్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అయితే ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అధికారం దక్కించుకోవడానికి అవసరమైనన్ని స్థానాలు రాకపోవడంతో పారిజాతారెడ్డిని పార్టీలో చేర్చుకుని మేయర్‌ పదవి కట్టబెట్టారు. అప్పట్లో ఆమె సైతం అయిష్టంగానే కాంగ్రెస్‌ను వీడినట్టు ప్రచారం జరిగింది. కాగా పార్టీలో చేరినప్పటి నుంచే తమపై నిఘా పెట్టారని, తమ వివరాలు తెలుసుకుంటున్నారని, పలు సందర్భాల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా మనస్తాపానికి గురి చేశారని మేయర్‌ దంపతులు కాంగ్రెస్‌ శ్రేణుల వద్ద, తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. అందుకే పార్టీ మారాలనే గట్టి నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పటిష్టంగా ఉన్న కాంగ్రెస్‌కు ఇది ‘ప్లస్‌ పాయింట్‌’గా మారే పరిస్థితి ఉన్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 


ఎమ్మెల్యే సీటు దక్కేనా...?!

  వచ్చే ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పిస్తామంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుంచి కచ్చితమైన హామీ లభించిన తర్వాతే మేయర్‌ దంపతులు పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆ పార్టీ నుంచి రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి వై.అమరేందర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, ఏనుగు జంగారెడ్డి తదితరులు టికెట్‌ రేసులో ఉన్నారు. ఇప్పుడు మేయర్‌ దంపతులు టికెట్‌ హామీతో కాంగ్రెస్‌లో చేరినట్టుగా ప్రచారం జరుగుతుండడంతో వారి పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. వారంతా పార్టీలోనే ఉంటారా.. లేక ఇతర పార్టీల్లో చేరుతారా? అనే చర్చ జరుగుతోంది. మరోవైపు టికెట్‌ ఎవరికి వచ్చినా కలిసి పని చేద్దామంటూ మేయర్‌ భర్త నర్సింహారెడ్డి ఆయా నేతలను కలిసి పేర్కొనట్టు విశ్వసనీయంగా తెలిసింది. 

Updated Date - 2022-07-02T17:45:47+05:30 IST