3 అడుగులే ఉన్నాడని ఎవరూ జాబ్ ఇవ్వలేదు... ఒక్క ఘటనతో ఈ ఎంబీఏ కుర్రాడికి 40 ఆఫర్లు..!

Published: Thu, 14 Apr 2022 19:00:03 ISTfb-iconwhatsapp-icontwitter-icon
3 అడుగులే ఉన్నాడని ఎవరూ జాబ్ ఇవ్వలేదు... ఒక్క ఘటనతో ఈ ఎంబీఏ కుర్రాడికి 40 ఆఫర్లు..!

ఇంటర్నెట్ డెస్క్: జన్యు పరమైన కారణమో లేక వేరే ఇతర కారణమో తెలీదు కానీ అతడు 3 అడుగులకే పరిమితం అయ్యాడు. అయినా ఆ విషయాన్ని అతడు పెద్దగా పట్టించుకోలేదు. ఉన్నత చదవులు అభ్యసించి.. కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలనుకున్నాడు. అనుకున్నట్లే ఉన్నత చదువులు అభ్యసించాడు. మంచి మార్కులతో ఎంబీఏ పట్టా పొందాడు. అనంతరం ఉద్యోగం కోసం వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి చుక్కెదురైంది. అతడిలో ఉన్న ప్రతిభ కాకుండా వైకల్యాన్ని మాత్రమే చూసిన చాలా మంది ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఒకే ఒక్క ఘటన అతడి జీవితాన్నే మార్చేసింది. ఏకంగా 40 కంపెనీలు అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే..


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతానికి చెందిని అంకేశ్ కోస్తీ (28) ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తల్లి ఫ్యాక్టరీలో బీడీ కార్మికురాలుగా పని చేస్తుంటే.. తండ్రి సెలూన్‌ను నడుపుతన్నాడు. అంకేశ్‌కు ఇద్దరు సోదరులు, ఓ సోదరి కూడా ఉన్నారు. కాగా.. చాలీచాలని డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న తల్లిదండ్రులను చూస్తూ పెరిగిన అంకేశ్.. ఉన్నత చదువులు అభ్యసించి కష్టాలకు పుల్‌స్టాప్ పెట్టాలనుకున్నాడు. మంచి ఉద్యోగం పొంది తల్లిదండ్రులకు ఆసరాగా ఉండాలని భావించాడు. ఆర్థిక సమస్యలు వేధించినా పట్టుదలతో ఎంబీఏ పూర్తి చేశాడు. అనంతరం ఉద్యోగం కోసం వేట ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి చుక్కెదురైంది. ఎత్తు 3 అడుగులే ఉన్న కారణంగా అతడికి ఉద్యోగం ఇచ్చేందుకు కంపెనీలు నిరాకరించాయి. అయితే అంకేశ్ మాత్రం తన ప్రయత్నాన్ని ఆపలేదు. తన వైకల్యాన్ని కాకుండా ప్రతిభను చూసి ఏదో ఒక కంపెనీ తనకు జాబ్ ఆఫర్ చేస్తుందని గట్టిగా విశ్వసించాడు. రెండేళ్లపాటు నిర్విరామంగా ప్రయత్నించినా ఉద్యోగం లభించలేదు. 


ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ సర్టిఫికెట్ పొందేందుకు ఎమ్మెల్యే సిఫార్సు లేఖ అవసరం అవడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రవీణ్ పతక్‌కు కలిశాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే.. అంకేశ్ సమస్యలన్నింటినీ తెలుసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం అతడితో ఓ సెల్ఫీ తీసుకుని.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంకేశ్ చదువు వివరాలను తెలిపి, అతడికి ఉన్న జాబ్ అవసరాన్ని తెలియజేశారు. అంతే.. ఈ ఒక్క ఘటనతో అంకేశ్‌కు ఆఫర్ల వెల్లువలా వచ్చాయి. సుమారు 40 కంపెనీలు అంకేశ్‌కు జాబ్ ఆఫర్ చేశాయి. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశం అయింది. 



Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.