MBBS: రాష్ట్రంలో 10,425 ఎంబీబీఎస్‌ సీట్లు

ABN , First Publish Date - 2022-09-08T13:11:24+05:30 IST

జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ ప్రవేశ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలకావడంతో వచ్చే నెల నుంచి

MBBS: రాష్ట్రంలో 10,425 ఎంబీబీఎస్‌ సీట్లు

                                             - వచ్చే నెలలో కౌన్సెలింగ్‌?


అడయార్‌(చెన్నై), సెప్టెంబరు 7: జాతీయ స్థాయిలో వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్‌ ప్రవేశ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలకావడంతో వచ్చే నెల నుంచి అడ్మిషన్ల కోసం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. అయితే, ఈ యేడాది రాష్ట్రంలో ఏకంగా 10,425 ఎంబీబీఎస్‌(MBBS) సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వాస్తవానికి దేశంలో అత్యధిక వైద్య కాలేజీలున్న రాష్ట్రంగా తమిళనాడు(Tamil Nadu) వుంది. మొత్తం 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 5,050 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 32 ప్రైవేటు కాలేజీల్లో 5,375 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో కలుపుకుని మొత్తం 10,425 ఎంబీబీఎస్‌, బీడీఎస్‌(MBBS, BDS) తదితర కోర్సులకు సంబంధించిన సీట్లున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో అఖిల భారత కోటా కింద 15 శాతం సీట్లను కేటాయిస్తారు. మిగిలిన 4,293 సీట్లను రాష్ట్ర కోటా కింద భర్తీ చేయనున్నారు. అయితే, నీట్‌లో వచ్చిన కటాఫ్‌ మార్కుల ద్వారా కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. రాష్ట్ర వాటాలోని 4,293 సీట్లలో ప్రభుత్వ స్కూళ్ళలో చదివిన విద్యార్థులకు 7.5 శాతం సీట్లను కేటాయిస్తారు. 

 

ఒత్తిడిలో ఉన్న విద్యార్థులపై దృష్టి: ఆరోగ్యమంత్రి 

వైద్య కోర్సుల ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు రాష్ట్రం నుంచి హాజరైన విద్యార్థుల్లో 564 మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. ఆ విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించినట్టు చెప్పారు. బుధవారం సైదాపేట మార్కెట్‌ ఆధునికీకరణపై సమీక్షా కార్యక్రమం జరిగింది. ఇందులో పాల్గొన్న మంత్రి సుబ్రమణ్యం మాట్లాడుతూ. 2017లో అన్నాడీఎంకే(AIADMK) ప్రభుత్వం హయాంలో నీట్‌ ప్రారంభమైందన్నారు. ఈ యేడాది 1,45,988 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కాగా, ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలకు చెందిన 17517 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. పరీక్ష ముగిసినప్పటి నుంచి ఇప్పటివరకు వివిధ రకాల కౌన్సెలింగ్‌ నిర్వహించామన్నారు. హాజరైన విద్యార్థుల్లో 564 మంది విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వారిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని తెలిపారు. నీట్‌లో ఉత్తీర్ణులైనా, ఉత్తీర్ణులు కాకపోయినా ఒత్తిడికి గురికావొద్దని, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను గమనించాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-09-08T13:11:24+05:30 IST