రోదించిన అందనాలపాడు

ABN , First Publish Date - 2022-06-23T05:45:51+05:30 IST

రోదించిన అందనాలపాడు

రోదించిన అందనాలపాడు
మిరియాల మస్తాన్‌రావు మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌

విద్యుదాఘాత మృతులకు కన్నీటి వీడ్కోలు

ముగ్గురు అన్నదాతలకు ఒకే రోజు అంత్యక్రియలు

కన్నీరుమున్నీరైన  బాధిత కుటుంబాలు

డోర్నకల్‌, జూన్‌ 22: డోర్నకల్‌ మండలం అందనాలపాడు గ్రా మంలో ఆభయాంజనేయస్వామి దేవాలయం వద్ద మైకును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన ముగ్గురు అన్నదాతలకు గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు. గ్రామంలో విద్యుదాఘాతానికి  గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డ రైతు లు దుంపల సుబ్బారావు, మిరియాల మస్తాన్‌రావు, గొర్రె వెంకయ్యల మృతదేహాలను మంగళవారం జిల్లా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. అదే రాత్రి గ్రా మానికి తరలించి బుధవారం ముగ్గురు రైతుల అం త్యక్రియలను పూర్తి చేశారు. గ్రామస్తులతో పాటు బంధువులు, సమీప గ్రామాల రైతులు పెద్దఎత్తున తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొని కన్నీటి పర్యంతమయ్యారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి బాధలో ఉన్న ఆ ముగ్గురి కుటుంబసభ్యులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. మృతుల కుటుంబసభ్యులు రోదించిన తీరు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించింది. ముగ్గురు రైతుల కడసారి చూపు కోసం పెద్దఎత్తున తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 

ఒక్కరోజే అంత్యక్రియలు..

అందనాలపాడులో ఒక్కరోజే ముగ్గురి అంత్యక్రియలు నిర్వహించడంతో ఆ పల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. ముగ్గురి మృతదేహాలను వారివారి వ్యవసాయ క్షేత్రాల్లో ఖననం చేశారు. మృతుల బంధువులు ఏపీలోని విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌ నుంచి మంగళవారం రాత్రే అందనాలపాడు చేరుకున్నారు. బుధవారం ఉదయం 10.30 గంటల సమయంలో దుంపల సుబ్బారావు మృతదేహాన్ని అంత్యక్రియల కోసం ఊరేగింపుగా తీసుకువెళ్లారు. కొంత సమయం తర్వాత గొర్రె వెంకయ్య, మస్తాన్‌రావుల మృతదేహాలను సైతం అంత్యక్రియలకు తీసుకుని వెళ్లారు. అదే సమయంలో అందనాలపాడు చేరుకున్న డోర్నకల్‌ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ గొర్రె వెంకయ్య పాడెను మోశారు. అక్కడకు సమీపంలోనే ఖననం కోసం తీసుకువచ్చిన మస్తాన్‌రావు మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. 

అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్‌, డోర్నకల్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు రాంచంద్రునాయక్‌తో కలిసి గొర్రె వెంకయ్య, మస్తాన్‌రావుల మృతదేహాలకు పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం దుంపల సుబ్బారావు కుటుంబసభ్యులను పరామర్శించారు. డోర్నకల్‌ మునిసిపల్‌ చైర్మన్‌ వాంకుడోత్‌ వీరన్న, వైస్‌ చైర్మన్‌ కోటిలింగం, ఎంపీపీ బాలునాయక్‌, డోర్నకల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ భిక్షంరెడ్డి, అందనాలపాడు సర్పంచ్‌ మోహన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కత్తెరసాల విద్యాసాగర్‌, పురుగు అప్పారావు, కనిశెట్టి మోహన్‌రావు, రామనాథం, డీఎస్‌ కృష్ణ, కాంగ్రెస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బత్తుల శ్రీనివాస్‌, నాయకులు కరుణాకర్‌రెడ్డి, రామునాయక్‌, ఊడ్గుల వెంకన్న, కాసం శేఖర్‌ అంత్యక్రియలకు హాజరయ్యారు.

మృతుల కుటుంబాలను ఆదుకుంటాం : ఎమ్మెల్యే రెడ్యా

డోర్నకల్‌ మండలం అందనాలపాడు గ్రామంలో విద్యుదాఘాతంతో మృతిచెందిన దుంపల సుబ్బారావు, మిరియాల మస్తాన్‌రావు, గొర్రె వెంక య్య కుటుంబాలను ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న రైతు బీమాతో పాటు విద్యుదాఘాతంతో మృతిచెందినవారికి ఇచ్చే పరిహారాన్ని త్వరగా అందించేటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు.  

రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి : కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌

ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యుత్‌ ప్రమాదాలు జరిగాయని కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాంనాయక్‌ అన్నారు. డోర్నకల్‌ మండలంలో ఏడాది కాలంలో విద్యుత్‌ షాక్‌తో 10 మందికిపైగా రైతులు, 30కు పైగా పశువులు చనిపోయాయన్నారు.. అయినా విద్యుత్‌ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అందనాలపాడులో విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన ఒక్కొక్క కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2022-06-23T05:45:51+05:30 IST