జల సవ్వడి..

ABN , First Publish Date - 2021-07-17T05:16:14+05:30 IST

జల సవ్వడి..

జల సవ్వడి..
భీమునిపాదంలో జాలువారుతున్న వాటర్‌ఫాల్స్‌

గూడూరు, బయ్యారంలో కనువిందు చేస్తున్న జలపాతాలు

పెరుగుతున్న పర్యాటకుల తాకిడి 


గూడూరు రూరల్‌/బయ్యారం, జూలై 16 : ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలతో మానుకోట జిల్లాలో జల సవ్వడి సంతరించుకుంది. జిల్లాలోని చెరువులు నిండి మత్తళ్లు పోస్తుం డగా జలపాతాల నుంచి వర్షపు నీరు జాలువారుతూ... ఆందాలను కనువిందు చేస్తూ పర్యాట కులను ఆకట్టుకుంటున్నాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన గూడూరు, బయ్యారంలలోని జలపాతాలు కనువిందు చేస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లోని జలపాతాలను చూసేందుకు పర్యాటకుల సందడి నెలకొంది. జిల్లాలోని జలపాతాల ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్ది మౌలిక వసతులు కల్పిస్తే పర్యాటకుల తాకిడి మరింత పెరగనుంది. 


గూడూరులో కనువిందుగా భీమునిజలపాతం...

గూడూరు మండలం సీతానాగారం శివారు కొమ్ములవంచ పరిధి అటవీప్రాంతంలో పచ్చని ప్రకృతి నడుమ నిరంతరం జలదారతో ఆలరిస్తున్న భీమునిపాదం జలపాతం 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న నీటిని చూసి పర్యాటకులు అబ్బురపోతున్నారు.  రోజురోజుకు పర్యాట కుల సందడితో రద్దీగా మారుతోంది. ఆకాశంలో విరిసిన హరివిల్లు మెఘాలను మోసు కొస్తున్నట్లు... రాళ్ల మీద నుంచి దూదిపిందెలు లోయలోకి దూకుతున్నట్లు 70 అడుగుల ఎత్తు నుంచి మంచుతెరలను తలపిస్తూ నీటిదారులు పడుతుంటే చూసే కన్నులకు ఎంతో హాయి. ఆకుపచ్చని ప్రకృతిలో గలగలపారే సెలయేరు. ఒక్కసారిగా మాయమై గుట్టల మీదునుంచి కిందికి జాలువారుతుంటే మనస్సు పులకరిస్తుంది. ప్రకృతి చెక్కిన కొండలు... వాటి మధ్య జలదారలు ప్రవహిస్తున్న తీరును చూసిన మది మైమరపించి పోయి పురివిప్పిన నెమలితీరు ఎగిరి గంతేయాలనిపిస్తుంది. ఆనందాలు పూసిన పొదరిల్లై ఆకాశన్ని అందుకోవాలని, ఆదమరిచి కలకాలం అక్కడే ఉండిపోవాలని అనుకోకుండ ఉండలేం. మనస్సు ప్రశాంతతను కోరుకున్నప్పుడు అందమైన ప్రకృతి ఒడిలో సేద తీరితే బాగుండునని అనుకోవడం సర్వసాధారణం. అలాంటి రమణీయ దృశ్యాలకు నెలవు.. శోభలినే సోయగాలకు నెలవు భీమునిపాదం.. ఈ వర్షకాలంలో పచ్చపచ్చని ప్రకృతిలో గలగల పారె సెలయేటి అలల మధ్య సేదతీరుదాం రండి అంటూ భీమునిపాదం జలపాతం పిలుస్తోంది. 


బయ్యారంలో మూడు జలపాతాలు...

బయ్యారం మండలంలోని మూడు జలపాతాలు ప్రకృతి రమణీయతను చాటుతూ.. అందాలను పర్యాటకులను కనువిందు పరుస్తున్నాయి. చర్లపల్లి గ్రామ సమీప పెద్దగుట్టపై పాండవుల జలపాతం, చింతోనిగుంపు సమీప వంకమడుగు వాగుపై చింతోనిగుంపు జలపాతం, గంగారం– బయ్యారం మండలాల సరిహద్దు ఏడుబావుల జలపాతాలు నీటితో పరవళ్లు తొక్కుతున్నాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మినీ బొగతను తలపించే బయ్యారంలోని జలపాతాల అందాలను వీక్షించేందుకు సమీప ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలివస్తూ ప్రకృతి ఆందాలను ఆస్వాదిస్తూ మానసిక ప్రశాంతతను పొందుతున్నారు. 







Updated Date - 2021-07-17T05:16:14+05:30 IST