ltrScrptTheme3

దిగుబడి రాదాయే.. నిల్వలు లేవాయే...

Oct 27 2021 @ 00:08AM
కేసముద్రం మండలం కోరుకొండపల్లిలోని పత్తిమిల్లులో ఉన్న కొద్దిపాటి పత్తి నిల్వలు

తగ్గిన పత్తి దిగుబడి.. 

నిల్వలు లేక జిన్నింగ్‌ మిల్లులు వెలవెల

వరుస వర్షాలతో దెబ్బతిన్న పంట

ధర పెరిగిన సంతోషమేరుగని రైతులు 


మహబూబాబాద్‌ అగ్రికల్చర్‌, అక్టోబరు 26 : మార్కెట్‌లలో తెల్ల బంగారంగా పిలిచే పత్తిపంటకు ధరలు పెరుగుతున్నా... మరోపక్క పంట దిగుబడి రాలేదు. ఏకధాటిగా వర్షాలు కురియడంతో పంట దిగుబడి అమాంతం తగ్గిపోయింది. మార్కెట్‌లలో పత్తికి ధర పెరుగుతున్న నేపథ్యంలో సంతోషించాలా... లేక దిగుబడి తగ్గిందని దిగులు పడాలా అన్న మిమాంసలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు పత్తి రాబడి మీదనే ఆధారపడి నడిచే జిన్నింగ్‌ (పత్తి) మిల్లుల్లో పత్తి నిల్వలు లేక వెలవెలబోతున్నాయి. మరికొద్దిరోజుల్లో అవి మూతపడే ప్రమాదం కూడ పొంచివుంది. 


జిల్లాలో పత్తి ఇలా...

మహబూబాబాద్‌ జిల్లాలో ఈ ఖరీ్‌ఫలో భారీ వర్షాలు కురియడంతో అత్యధికంగా పత్తి సాగు చేశారు. జిల్లాలో 89,591 ఎకరాల విస్తీర్ణంలో పత్తిని సాగు చేశారు. అందులో ముఖ్యంగా మరిపెడ మండలంలో 11,719 అత్యధికంగా సాగు చేయగా నెల్లికుదురు మండలంలో 9,933, తొర్రూరు మండలంలో 9,650, కేసముద్రంలో 7,850, మహబూబాబాద్‌లో 5,430, కురవిలో 8,900, నర్సింహుపేటలో 5,850, పెద్దవంగరలో 5,725, దంతాలపల్లిలో 7,245 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.


వరుస వర్షాలతో దెబ్బతిన్న పంటలు...

గత నెలలో వరుసగా వర్షాలతో పాటు తుపాన్‌లు రావడంతో పత్తి పంటను దెబ్బతీశాయి. వర్షాలు పడుతున్న కొద్దీ మొక్కలు జాలువారి పోయి ఎర్రబడిపోయాయి. పూత, కాత దశలోనే తుపాన్‌లు రావడంతోనూ, కాయకుళ్లు, ఆకుమచ్చ, గులాబీరంగు పురుగు ఆశించాయి. దీంతో కొంతమేర పంటపై ప్రభావం చూపాయి. ఆ తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మొక్కలకు ప్రాణం వచ్చినట్లు అయి కొంతమేరకు జీవం పోసుకున్నాయి. సాధారణంగా పత్తి ఎకరానికి 5 నుంచి 7 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా ఆయా మండలాల్లో 3 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందని రైతులు చెబుతున్నారు. 


ధర పెరిగిన సంతోషం లేదాయే...

ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి గరిష్టంగా రూ.8 వేల వరకు పలుకుతుండగా కనిష్టంగా రూ.3868 ధర పలుకుతోంది. పత్తికి రికార్డుస్థాయిలో ధరలు పలుకుతుండడంతో రైతులు ఓవైపు సంతోషిస్తూనే మరోవైపు దిగుబడి తగ్గిపోవడంతో బాధపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడి వస్తే చాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి పత్తిని మూడుసార్ల వరకు దిగుబడి వస్తుంది. అయితే మొదటి కోతకే ఇలా ఉంటే రెండో, మూడోసారి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దిగుబడి రాకపోవడంతో మొదటి కోత పూర్తికాగానే పత్తి చేలను తీసివేసి మొక్కజొన్న, పెసర, అపరాల పంటలను సాగు చేయడానికి రైతులు సిద్ధపడుతున్నారు. 


జిన్నింగ్‌ మిల్లులు వెలవెల...

జిన్నింగ్‌ మిల్లులలో ఈ నెల మొత్తంలో కేవలం 2 వేల బస్తాల వరకే పత్తి నిల్వలు కొనుగోలు చేశారు. అయితే గతేడాది 15 లారీల వరకు పత్తి నిల్వలు ఖరీదు చేసిన వ్యాపారులు ఈ సారి దిగుబడి లేకపోవడంతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పక్క రాష్ట్రాల్లోను పత్తిని కొనుగోలు చేద్దామన్న పత్తి ధరలు బాగా పెరిగిపోవడంతో గిట్టుబాటు ధర రావడం లేదని చెబుతున్నారు. గతేడాది వచ్చిన దాని కంటే ఈ సారి దిగుబడి తగ్గే అవకాశం ఉందంటున్నారు. 


తగ్గిన దిగుబడి.. : రేనుకుంట్ల కొమ్మన్న, పత్తిరైతు, కేసముద్రం (స్టేషన్‌) 

 పత్తిసాగు చేస్తే ఈ సారి 3–4 క్విం టాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. చాలా మంది రైతులకు మూడు క్వింటాళ్లలోపే దిగుబడి వచ్చింది. భారీగా కురిసిన వర్షాలతో పత్తి చేలన్ని జాలువారిపోయి దూది రాలిపోయింది. ఏకధాటిగా కురిసిన వర్షాలతో నష్టపోవాల్సి వచ్చింది. 10–15 రోజుల వ్యత్యాసంతో వర్షం కురిస్తే బాగుండేది. వరుసగా కురియడం వల్ల నష్టపోయాం. 


కరెంటు బిల్లులు కూడా వచ్చే పరిస్థితి లేదు : హనుమాండ్ల వేణుగోపాల్‌రెడ్డి, పత్తిమిల్లు యాజమాని, కోరుకోండపల్లి 

ఈ సారి పత్తి దిగుబడి లేదు. ఈ కాలంలో 15 లారీల వరకు బేలు తయారు చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దిగుబడి లేని కారణంగా రెండు లారీల బేలు మాత్రమే తయారు చేశాం. ఏడాదిలో 80 వేల బస్తాలు ఖరీదు చేయాల్సి ఉండగా అంతా దిగుబడి రాకపోవచ్చని అర్థమవుతోంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా మిల్లులు సరిగ్గా నడవని కారణంగా 70 మంది వరకు ఉపాధి కోల్పోయే అవకాశాలు కనబడుతున్నాయి. చివరకు డ్రైవర్ల జీతాలు, కరెంటు బిల్లులు కూడా కట్టే పరిస్థితి కనబడడం లేదు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.