గ్రామపంచాయతీలకు విద్యుత్‌ షాక్‌

ABN , First Publish Date - 2022-05-26T05:52:41+05:30 IST

గ్రామపంచాయతీలకు విద్యుత్‌ షాక్‌

గ్రామపంచాయతీలకు విద్యుత్‌ షాక్‌

పెరిగిన విద్యుత్‌ చార్జీలతో అదనపు భారం

వచ్చే నిధుల్లో ఎక్కువ భాగం బిల్లులకే..

జిల్లాలో 461 జీపీలకు రూ.65.7లక్షల చెల్లింపు


మహబూబాబాద్‌ రూరల్‌, మే 26 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పెంచిన విద్యుత్‌ చార్జీలతో గ్రామపంచాయతీలకు షాక్‌ కొడుతోంది. పెరిగిన విద్యుత్‌ బిల్లులతో జీపీలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది. ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో ఎక్కువ భాగం విద్యుత్‌ బిల్లులు చెల్లించడానికే సరిపోతోందని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్‌ భగీరథ నీరు సరిపోను అందకపోవడంతో గ్రామాల్లో ఉన్న మంచినీటి బావుల ద్వారా తాగునీరు అందిస్తున్నారు. దీంతో సదరు తాగునీటి బావుల విద్యుత్‌ మోటార్ల బిల్లులు, వీధిలైట్లు, జీపీ భవన విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. మహబూబాబాద్‌ జిల్లాలోని 16 మండలాల పరిధిలో 461 జీపీలు ఉండగా ఏప్రిల్‌ నెలలో  కేవలం విద్యుత్‌ బిల్లులు రూ.65.7లక్షలు చెల్లించినట్లు సర్పంచులు పేర్కొంటున్నారు.


విద్యుత్‌ బిల్లులు పెరగడంతో అదనపు బారం...

విద్యుత్‌ చార్జీల పెంపు గ్రామ పంచాయతీలకు తలనొప్పిగా మారింది. వచ్చిన నిధులను గ్రామంలో అభివృద్ధి కోసం కేటాయింపులు చేసుకుని ప్రగతిపథంలో నిలపుదామనుకున్న పాలకులు విద్యుత్‌ బిల్లులకే అధిక మొత్తంలో చెల్లించాల్సి రావడంతో తలలు పట్టుకున్నారు. మహబూబాబాద్‌ మండలంలోని ఓ గ్రామంలో జనవరి, ఫ్రిబవరి మాసాల్లో రూ.3వేల చొప్పున విద్యుత్‌ బిల్లులు రాగా,  మార్చి నెలలో రూ.6500, ఏప్రిల్‌లో ఏకంగా రూ.9800 చెల్లించినట్లు చెప్పారు. జీపీ ఖాతాల్లో నిధులు జమకావడంతో ఈ -పంచాయతీ వెబ్‌సైట్‌లో నమోదవుతాయి. వెంటనే జిల్లా పంచాయతీ అధికారి మండల పంచాయతీ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు బిల్లులు చెల్లించాలని మెసేజ్‌లు చేస్తారు. విద్యుత్‌ బిల్లులు ఆలస్యంగా చెల్లిస్తే ఫైన్‌ పడుతుంది. దీంతో ఆలస్యంగా బిల్లులు చెల్లించిన పంచాయతీ కార్యదర్శులకు డీపీవో మెమోలు జారీ చేయడం జరుగుతుంది. 


వచ్చిన నిధులు చెల్లింపులకే...

జీపీలకు వచ్చిన నిఽధులు మొత్తం చెల్లింపులకే కేటయించాల్సి వస్తోంది. విద్యుత్‌ బిల్లులు, ట్రాక్టర్‌ ఈఎంఐ, జీపీ సిబ్బందికి వేతనాలను చెల్లించడం జరుగుతుంది. 500 జనాభా ఉన్న జీపీకి మల్టీపర్పస్‌ కింద ఒక సిబ్బంది చొప్పున, 500 జనాభా కంటే ఎక్కువగా  ఉన్నా పాత జీపీల్లో కనీసం 3 నుంచి 8 మంది సిబ్బందిని కాంట్రాక్టు ప్రాతిపదికన పద్ధతిపై సర్పంచులు నియమించుకున్నారు. ఒక్కొక్కరికి ప్రతి నెల రూ.8500 వేతనం చెల్లిస్తున్నారు. చెత్త సేకరణకు కొనుగోలు చేసిన ట్రాక్టర్‌ డౌన్‌ పేమెంట్‌ ఈఎంఐకి ప్రతి గ్రామ పంచాయతీ నెలకు సుమారు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం నిధులు ఇచ్చినట్టే ఇచ్చి బిల్లుల రూపంలో లాక్కుంటుందని సర్పంచులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌ బిల్లులను సకాలంలో చెక్కులను ఎస్టీవోలో జమ చేస్తున్నప్పటికి చెక్కులు పాస్‌ కావడానికి మూడు నెలల నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. దీంతో ఆ చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయి. దీంతో విద్యుత్‌ అధికారులు సర్పంచులపై జరిమానాల రూపంలో విద్యుత్‌ చార్జీలతో అదనంగా అదనపు భారం విధిస్తున్నారని వాపోతున్నారు. దేశానికి పట్టు కొమ్మలైన గ్రామ పంచాయతీలకు సంబంధించి వీధిలైట్లు, మంచినీటి బావుల మోటర్లు, జీపీ భవనాలకు ఉచితంగా విద్యుత్‌ సరఫరాను అందించాలని సర్పంచ్‌లు డిమాండ్‌ చేస్తున్నారు. ఆదిశగా పాలకులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


విద్యుత్‌ బిల్లులకే అధిక మొత్తంలో చెల్లిస్తున్నాం : ఈసం స్వామి, సర్పంచ్‌ జంగవాని గూడెం, మండలం కొత్తగూడ 

గ్రామ పంచాయతీకి వచ్చిన నిధుల్లో అధిక మొత్తంలో విద్యుత్‌ బిల్లులకే చెల్లిస్తున్నాం. గత ఏప్రిల్‌ మాసంలో పెరిగిన విద్యుత్‌ చార్జీలకు జీపీలకు అదనంగా ఆర్థిక భారం పడుతుతోంది. ఒక్కొ గ్రామపంచాయతీ సుమారు రూ.10 వేలకు పైగానే విద్యుత్‌ బిల్లులు చెల్లించాల్సి వస్తుంది. దీనికి తోడు ట్రాక్టర్‌ ఈఎంఐ, జీపీ సిబ్బంది వేతనాలు ఇలా ప్రతి నెల నిధుల నుంచి అత్యధికంగా చెల్లింపులకే సరిపోతున్నాయి. 

Updated Date - 2022-05-26T05:52:41+05:30 IST