ఖనిజ నిర్లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-24T05:53:22+05:30 IST

ఖనిజ నిర్లక్ష్యం

ఖనిజ నిర్లక్ష్యం
మహబూబాబాద్‌ జిల్లాలోని బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీ

నల్లరాతి ‘కోట’.. మానుకోట

రాష్ట్రంలోనే ప్రత్యేకమైన  ‘బ్లాక్‌ గ్రానైట్‌’ 

జిల్లాలో 27 లక్షల ఘనపు మీటర్ల నిల్వలు

168 గ్రానైట్‌ క్వారీలు, ఏటా రూ.17కోట్ల ఆదాయం

అనుబంధ పరిశ్రమలు శూన్యం

ప్రతిపాదనలు అమలు చేస్తే నంబర్‌ వన్‌గా జిల్లా


మహబూబాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి) : సహజ వనరుల్లో ఒకటైన నల్లరాయి (బ్లాక్‌ గ్రానైట్‌) ఖనిజ ని ల్వలు మహబూబాబాద్‌ జిల్లాలో అపారంగా ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒంగోలు సమీపంలోని చీమకుర్తిలో ‘గెలాక్సీ’ రకం గ్రానైట్‌ లభిస్తుండగా ‘బ్లాక్‌ గ్రానైట్‌’ రకం లభ్యమయ్యేది కేవలం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌ జిల్లాలోనే అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఆ తర్వాత బ్లాక్‌గ్రానైట్‌ దేశంలో కర్ణాటక రాష్ట్రంలోనే లభిస్తుంది. జిల్లాలో ఉత్పత్తి అయ్యే గ్రానైట్‌ అత్యంత నాణ్యమైంది కావడంతో ఈ రాయికి ఇతర దేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉంది. జిల్లాలోని కేసముద్రం, డోర్నకల్‌, నెల్లికుదురు, కురవి, గూడూరు, మరిపెడ, తొర్రూరు, గార్ల మండలాల్లో అపార నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదై ఉంది. డోర్నకల్‌, కురవి, మరిపెడ, గార్ల మండలాల్లోని గ్రానైట్‌ నిల్వలు ఉన్నప్పటికీ వీటిని వెలికితీసే ప్రయత్నాలు జరగడంలేదు. జిల్లాలో ఖనిజ సంపదపై విధించే రాయల్టీ ద్వారా ఏటా రూ.17కోట్ల ఆదాయం సమకూరుతుండగా ఇందులో సింహభాగం గ్రానైట్‌ క్వారీల నుంచే వస్తోంది. గ్రానైట్‌ క్వారీలకు అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయడం ద్వారా వందల మంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది. అయితే జిల్లాకు ఉన్న ఖనిజసంపదను ఆధారంగా చేసుకొని పరిశ్రమల ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  


ప్రధాన ఖనిజ వనరు బ్లాక్‌గ్రానైట్‌...

మహబూబాబాద్‌ జిల్లాకు సహజ సిద్ధంగా ఉన్న ఖనిజ నిల్వల్లో బ్లాక్‌ గ్రానైట్‌ అత్యధికంగా ఉండడం విశేషం. జిల్లాలో 27లక్షల ఘనపు మీటర్ల బ్లాక్‌ గ్రానైట్‌ నిల్వలు ఉన్నట్లు జియాలజిస్టులు పరిశోధనల అనంతరం ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేశారు. తర్వాతి స్థానంలో రాతిఖనిజం (స్టోన్‌ అండ్‌ మెటల్‌) 53లక్షల ఘనపు మీటర్ల నిల్వలు ఉండగా బైరటీస్‌ ఖనిజం 21.6లక్షల టన్నులు, డోలమైట్‌ అండ్‌ బైరటీస్‌ ఖనిజం 10లక్షల టన్నులు, కలర్‌ గ్రానైట్‌ ఖనిజం 30వేల ఘనపు మీటర్లు, క్వార్జ్‌ ఖనిజం 22వేల టన్నులు, డోలమైట్‌ 20వేల టన్నుల నిల్వలు జిల్లాలో భూగర్భంలో నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ రికార్డుల ప్రకారం అంచనా. ఖనిజ సంపదలో అత్యధికంగా ప్రథమస్థానంలో బ్లాక్‌ గ్రానైట్‌ నిల్వలు ఉండడం గమనార్హం. ఈ సమాచారం బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీలకు, అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను కల్పించాల్సిన ఆవశ్యకతను గుర్తుచేస్తోంది. దీని ద్వారా ప్రభుత్వానికి ఖనిజాల ఎగుమతిపై ఆదాయం లభించడమేకాకుండా వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 


అనుబంధ పరిశ్రమలను విస్మరించిన ప్రభుత్వం...

అపార ఖనిజ నిల్వలను వెలికితీసి వాటికి అనుబంధ పరిశ్రమలను నెలకొల్పితే ఖనిజ పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందుతుంది. 30 ఏళ్లుగా ఇక్కడ గ్రానైట్‌ క్వారీల్లో ఉత్పత్తి జరుగుతుండగా వాటికి అనుబంధ పరిశ్రమలను ఏర్పాటు చేయకుండా గత, ప్రస్తుత ప్రభుత్వాలు విస్మరిస్తూ వచ్చాయని ఆరోపణలున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయిన ముడి బ్లాక్‌ గ్రానైట్‌ రాయి ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం ఓడరేవుల ద్వారా చైనా, బంగ్లాదేశ్‌, దక్షిణ ఆఫ్రికా, ఇరాన్‌ తదితర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి.  ఈ ముడి గ్రానైట్‌ను ప్రాసెసింగ్‌ చేసేందుకు అనుబంధ పరిశ్రమలైన పాలిషింగ్‌ యూనిట్‌లు నెలకొల్పితే బహుళ ప్రయోజనాలు ఉంటాయి. తద్వారా గ్రానైట్‌ రాయి ఉత్పత్తి వ్యయం తగ్గడమేకాకుండా నేరుగా పాలిషింగ్‌ అయిన రాయినే ఉత్పత్తి చేయడం ద్వారా అధిక ఆదాయం సమకూరుతుంది. అంతకంటే ముఖ్యమైనది ప్రాసెసింగ్‌ యూనిట్ల ద్వారా వందలాది మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 


అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలి : శివ్వారపు శ్రీధర్‌, ఇఫ్టూ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కేసముద్రం 

మహబూబాబాద్‌ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధికంగా బ్లాక్‌ గ్రానైట్‌ నిల్వలు ఉండడంతో గత 30 ఏళ్లుగా ఇక్కడ క్వారీలు నడుస్తున్నాయి. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న పరిశ్రమల అధిపతులు మైనింగ్‌, కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. పాలకులు పట్టించుకోకపోవడం వల్లనే గ్రానైట్‌ పరిశ్రమ అభివృద్ధి చెందడంలేదు. అనుబంధ పరిశ్రమలను నెలకొల్పడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది.

Updated Date - 2022-05-24T05:53:22+05:30 IST