
వినియోగదారుడికి గుదిబండగా గ్యాస్ ధర
సిలిండర్‌పై రూ.50 పెంచిన ప్రభుత్వం
జిల్లాలో ఏడాదికి రూ.3.60 కోట్ల అదనపు భారం
కమర్షియల్‌కు తగ్గింపు... గృహ వాడకానికి పెంపు
జిల్లాలో ప్రతి నెల 60 వేల సిలిండర్ల వాడకం
జిల్లా వ్యాప్తంగా 1,88,298 గ్యాస్ వినియోగదారులు
సబ్సిడీ రూ.350 నుంచి రూ.47కు కుదింపు
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, మార్చి 24 : కరోనా కాలం నుంచి అన్ని విధాలుగా ఆర్థికంగా చితికి పోయిన ప్రజలకు గ్యాస్ సిలిండర్ ధర పెంపు గుదిబండగా మారింది. ఆయిల్ కంపెనీలు ధరలను మళ్లీ పెంచడంతో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరగడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారరింది. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటి విలవిలలాడుతున్న నిరుపేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్ బండ ధర రూ.50కి పెరగడంతో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. 14.2కిలోల గృహ వినియోగ (డొమెస్టిక్) సిలిండర్లపై రూ.50 పెంచగా, కమర్షియల్ సిలిండర్లపై మాత్రం తగ్గించడం గమనార్హం. సబ్సిడీపై అందించే గృహ వినియోగ సిలిండర్ల ధరలను రూ. 50 కి పెంచడంతో సామాన్య ప్రజలకు భారంగా మారింది. కాలానుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్యాస్ వినియోగం పెరిగింది. ప్రస్తుతం 90 శాతం కుటుంబాలు గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఇందులో పేద, మధ్య తరగతి కుటుంబాలే అధికంగా ఉంటాయి. గ్యాస్‌ధర పెరగడంతో జిల్లా ప్రజలపై అధికంగానే ఆర్థిక భారం పడుతుంది.
జిల్లాలో నెలకు 60 వేల సిలిండర్ల వాడకం...
జిల్లాలో ఉన్న 16 మండలాల పరిధిలో భారత్, హెచ్‌పీ, ఇండియన్ గ్యాస్ కంపెనీల పరిధిలో 13 ఏజెన్సీలు ఉండగా వాటిలో గృహవినియోగ సిలిండర్లు 1,87,119, కమర్షియల్ సిలిండర్లు 1179 ఉన్నాయి. వెరసీ మొత్తంగా 1,88,298 గ్యాస్ వినియోగదారులు ఉన్నారు. జిల్లాలోని అన్ని కంపెనీల ధరలు ఒకేలా ఉన్నాయి. గతంలో అన్ని గ్యాస్‌ల ధరలు 971 ఉండగా తాజా పెంచిన ధరల ప్రకారం రూ. 1021కి చేరింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 2222 ఉండగా తాజాగా రూ. 9.50 తగ్గించటం విశేషం.
జిల్లా వాసులపై ఏడాదికి రూ. 3.60 కోట్ల భారం...
జిల్లా వ్యాప్తంగా కమర్షియల్, గృహ వాడకం కోసం 1,88,298 గ్యాస్ వినియోగదారులు ఉండగా ప్రతి నెల 60 వేల గ్యాస్‌లను వినియోగిస్తున్నారు. అలా ఏడాదిలో సుమారు 7.20 లక్షల సిలిండర్ల వాడుతున్నారు. తాజాగా గ్యాస్ బండపై రూ.50 పెంచడంతో నెలకు రూ. 30లక్షల అదనపు బారం పడుతుంది. దీంతో ఏడాదికి రూ.3.60 కోట్ల భారం పడుతుంది.
రూ.350 నుంచి రూ.47కు తగ్గిన సబ్సిడీ...
పేద ప్రజలకు సబ్సిడీలపై గ్యాస్‌ను అందించి వాడకాన్ని అలవాటు చేసిన ప్రభుత్వాలు ఇప్పుడు ఆ సబ్సిడీని తగ్గించి భారాన్ని మోపుతున్నారు. గ్యాస్ బండ ధర రూ.650 ఉన్నప్పుడు రూ.350 సబ్బిడీ ఇచ్చేవారు. అనంతరం గ్యాస్ ధరలను విడతల వారీగా పెంచిన కేంద్రం నాటి నుంచి సబ్సిడీని మాత్రం యథావిధిగా ఇస్తూ వచ్చింది.
రెండేళ్ల కితం నుంచి రూ.350 నుంచి రూ.47కు తగ్గించి దానినే కొనసాగిస్తున్నారు. కరోనా కష్ట కాలంలో గ్యాస్ సబ్సిడీ కొనసాగించకుండా రూ.47కు తగ్గించటంతో పేద, మధ్య తరగతి ప్రజలపై మరింత ఆర్థిక భారం పడుతుంది.
ధరలు పెంచుకుంటూ పోతే బతికేదెలా...: శ్రీలత, గృహిణి, ఆర్టీసీ కాలనీ, మానుకోట
గ్యాస్ సిలిండర్ ధరలను ఇష్టారీతిన పెంచుకుంటూ పోతే బతికేదెలా. ప్రతి ఏటా పెరుగుతున్న గ్యాస్ ధరలు దినసరి కూలీల బతుకులపై భారం పడుతుంది. గ్యాస్ సిలిండర్ ఽధరలు పెంచుతూ సబ్సిడీని తగ్గించటం సరికాదు. తాజాగా రూ.50 పెంచడంతో ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం ఇస్తున్న సబ్సిడీ రూ.47 కాకుండా రెండెళ్ల కిందట ఇచ్చిన విధంగా రూ.350 కొనసాగించాలి.
ఎమ్మార్పీ ధరలనే తీసుకోవాలి : నర్సింగరావు, జిల్లా సివిల్ సప్లై అధికారి, మహబూబాబాద్
జిల్లాలోని గ్యాస్ ఏజెన్సీలు సిలిండర్‌పై ఉన్న ఎమ్మార్పీ ధరకే వినియోగదారులకు అందజేయాలి. నిబంధనలకు విరుద్దంగా ఎమ్మార్పీ కంటే అధిక ధరలు వసూలు చేసినట్లు తమ దృష్టికి తీసుకువస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. గ్యాస్ ఏజెన్సీ, సిబ్బంది ఎవరు వినియోగదారులను ఇబ్బందులకు గురిచేయొద్దు.