గొల్లకుంట కాలనీలో ఇంటి వద్దకు వెళ్లి మహిళకు వైద్యం చేస్తున్న ‘ఆలన’ బృందం
వయోవృద్ధులకు, మంచాన పడ్డ రోగులకు ఇంటివద్దే వైద్యం
దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉపశమనం
రోగులకు అందుబాటులో ఆలన వాహనం
హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లా ప్రజలు
నెహ్రూసెంటర్, మార్చి 23 : గ్రామీణ ప్రాంతాల్లో ధీర్ఘకాలిక వ్యాఽధితో మంచానికే పరిమితమై ఇబ్బందులు పడుతున్న రోగులను గుర్తించి ఆలన కేంద్రం అక్కున చేర్చుకోని ఉచితంగా ఆహారం, మందులు, వైద్యసేవలు అందిస్తూ తోడుగా నిలిచి మనోదైర్యం కల్పిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలోని ఆలన కేంద్రంలో వైద్యులు 2021 నవంబర్‌లో వైద్య సేవలను ప్రారంభించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లో క్యాన్సర్ వ్యాధితో 1000 మంది, ఇతర వ్యాధులతో 1200 మంది మంచానికి పరిమితమై ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యశాఖ గుర్తించింది. క్యాన్సర్, పక్షవాతం, డయాబేటిస్, రోడ్డు ప్రమాదాల్లో గాయాలపాలై మంచంపట్టిన వారిని ఆలన కేంద్రానికి తీసుకువచ్చి ఉచితంగా వైద్యం అందిస్తూ అండగా నిలుస్తున్నారు. చికిత్స కేంద్రం వరకు రాలేనివారి కోసం ప్రత్యేకంగా ఆలన వాహనం ఏర్పాటు చేసి ఇంటి వద్దకే వైద్యులు వెళ్లి వైద్యం అందిస్తున్నారు. ఆర్దిక ఇబ్బందులతో బాధపడుతున్న రోగులకు, నిరుపేదలకుదలకు అలన వైద్యం ఉపశమనం కలిగించింది. దింతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా రోగుల వివరాలు ఇలా..
మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా 16 మండలాల్లోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో పీహెచ్‌సీల్లో పని చేస్తున్న వైద్యులు, ఆశ వర్కర్లు, అంగన్వాడీల సహకారంతో ఆలన వైద్య బృందం వివిధ రోగాల బారిన పడి మంచానికి పరిమితమైన రోగుల వివరాలు సేకరించి రికార్డు నమోదు చేస్తున్నారు. ఇలా జిల్లా వ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధితో 1000 మంది, ఇతర వ్యాధులతో 1200 మంది బాధపడుతున్నట్లు గుర్తించారు. వారందరిని విడతల వారీగా జిల్లా ఆస్పత్రిలోని ఆలన కేంద్రానికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.
అందుబాటులో వైద్య సేవలు..
దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసుకోవడానికి వైద్యం చేయించలేక ఆర్దిక ఇబ్బందులతో బాదపడుతున్న రోగులకు సౌకర్యార్దంగా వైద్య సేవలు అందించడానికి కావాల్సిన పరికరాలన్ని ఆలన కేంద్రంలో అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక యంత్రాలు, పరీక్షలు నిర్వహించే మిషన్లతో పాటు విలువైన మందులు, రోగులను ఆలన కేంద్రానికి తీసుకువచ్చే వాహనం అందుబాటులో ఉన్నాయి. రోగులకు కావాల్సిన పూర్తి సమాచారం కోసం 9441779729 నంబర్‌ను కేటాయించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) కింద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2017లో పది ఆలన కేంద్రాలను ప్రారంభించారు. మహబూబాబాద్ జిల్లాలో 2021 సవంబర్లో జిల్లా ఆస్పత్రిలో ఆరంభించగా తాజాగా మంగళవారం ఆలన వాహనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. తద్వారా మంచాన పడ్డ రోగులు, దీర్ఘకాలిక వ్యాదిగ్రస్ధుల మరింత వైద్య అవకాశం ఉంది, ఆలన కేంద్రంలో మెత్తం ఏడుగురు వైద్య సేవలందిస్తున్నారు. అందులో డాక్టర్, ముగ్గురు స్టాఫ్ నర్సులుండగా, ఫిజియోథెరపి వైద్యుడు, ఇద్దరు ఆయాలతో పాటు వాహన డ్రైవర్ విధులు నిర్వర్తిస్తున్నారు.
వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి : పెరుమాళ్ళ అనిత, ఆలన మెడికల్ అధికారి, మానుకోట
ధీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న రోగులకు ఈ కేంద్రంలో చికిత్స అందించి ఉపశమనం కల్పిస్తాం. ధీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులకు ఉచితంగా మందులు, డైట్ అందిస్తున్నాం. చికిత్స కోసం వచ్చిన రోగులకు తీసుకోవాల్సిన జాగ్రతలపై అవగహన కల్పిస్తున్నాం..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఆలన కేంద్రంలో వైద్యం బాగుంది.. : నిదానపల్లి పద్మ, మల్యాల
పక్షవాతం వచ్చి రెండు సంవత్సరాలుగా బాధపడుతున్నా..అనేక ఆస్పత్రులు తిరిగిన ఎక్కడ నయం కాలేదు..ప్రైవేట్ ఆస్పత్రుల్లో తిరిగి డబ్బులను ఖర్చు చేశా. ఆలన వైద్యులు సమాచారం తెలుసుకుని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలోని ఆలన కేంద్రంలో వైద్యం అందిస్తున్నారు. ఇక్కడ వైద్యం బాగుంది. కాస్త లేచి నిలబడగలుగుతున్నా..