చుక్కల్లో ధరలు.. తినలేం కూరలు

Nov 29 2021 @ 00:14AM

నాడు తెలంగాణ, నేడు ఏపీలో వర్షాలతో దెబ్బతిన్న పంటలు

నెల రోజుల్లోనే రేట్లు పైపైకి..

క్యారెట్‌ కిలో రూ.100 

విలవిల్లాడుతున్న జిల్లా జనాలు


మహబూబాబాద్‌ టౌన్‌, నవంబరు 28 : పచ్చడి మెతుకులు.. పెరగన్నంతో కడుపునింపుకునేవాళ్లు.. లేదంటే పల్లెటూళ్లలో పంటపొలాల్లో కాసిన కూరగాయలను వంట చేసుకుని కాలం వెళ్లబుచ్చే వాళ్లు.. అది ఒకప్పటి మాట! ప్రస్తుతం పల్లెల్లోనైనా.. పట్టణాల్లోనైనా.. ఇంట్లో కూరలేనిదే పూట గడవదు.. అది కూడా ఒక్కటి కాదు.. రెండు మూడు కూరలుండాల్సిందే.! ఇక్కడి వరకు బాగానే ఉంది. నాడు తెలంగాణలో.. నేడు ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతిని వాటి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత నెలరోజుల క్రితం కురిసిన వర్షాలకు పంటలు పూర్తిగా పాడైపోవడంతో, అప్పుడే రేట్లు డబుల్‌ అయ్యాయి. మరోపక్క ఈ ప్రాంత రైతులు వాణిజ్యపంట మిరప, పత్తివైపు మెగ్గుచూపడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. దీంతో ఇక్కడి వ్యాపారులు గత్యంతరం లేక ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు, మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని టామాట విక్రయాలను జరుపుతున్నారు.


హఠాత్తుగా వారం రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వర్షాలు కురిసి అక్కడ కూడా కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. దీంతో అమాంతం ధరలు ఆకాశన్నంటడంతో కూరగాయల్లో కొన్నింటి ధరలు కిలో రూ.100 పలుకుతుండడంతో మరికొన్నింటి ధరలు 100కు చేరువలోకి రావడంతో ప్రజలు బెంబెలేత్తి పోతున్నారు. ఇక అన్నింటితో కలిసే టమాట ధరలు ఎన్నడే లేని విధంగా కిలో ధర రూ.75 పలకడంతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు, ఇక క్యారెట్‌ ధర రూ. 100 పలుకుతోంది. మిగతావన్నీ రూ.80కి విక్రయిస్తున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ రేయిన్‌ ఎఫెక్టుతో..

పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల వారం రోజులుగా వర్షాలు కురుస్తోండడంతో అంతా అతలాకులమవుతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కురిసిన వర్షాలు మానుకోట ప్రాంతంపై ప్రభావం చూపుతున్నాయని చెప్పకతప్పదు. ఇక్కడ నెలరోజులుగా క్రితం కురిసిన వర్షాలతో పంటలు దెబ్బతిని ఏపీలోని చిత్తూరు, మదనపల్లి ప్రాంతాల నుంచి కూరగాయలను దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నారు. వారం రోజులుగా అక్కడ వర్షాలు పడడంతో ఒక్కసారిగా కూరగాయల పంటలు తెబ్బతిని దిగుమతి తగ్గడంతో రేట్లు అమాంతం పెరిగి చుక్కలను చూపిస్తున్నాయి. ధరలు అమాంతం పెరగడంతో కొనుగోలు కోసం ప్రజలు మార్కెట్‌ వైపు వెళ్లడానికి జంకుతున్నారు. 


చేతిలో రూ. 500పట్టుకుని పోయినప్పటికి చిన్నసంచి నిండడంలేదని, వారానికి సరిపడ కూరగాయలు రావడంలేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నెలకు కనీసం కూరగాయలకే రూ.2000 పెట్టాల్సి ధైన్యస్థితి. కూరగాయల ధరలు ఇలా మండి పోతుంటే.. చాలీచాలనీ వేతనాలతో కుటుంబం గడిచేదేలా అని.. చిరు ఉద్యోగులు, కూలీనాలీ చేసుకునే నిరుపేద, మధ్యతరగతి ప్రజానీకం కలవరపడుతున్నారు. ఏది ఏమైనప్పటికి కూరగాయల ధరల రెట్టింపు అన్నివర్గాల ప్రజలపై ఆర్థిక ప్రభావం పడుతోంది. కాగా, మానుకోటలో రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల కూరగాయల క్రయవిక్రయాలు జరుగుతాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచి ప్రధానంగా టమాట, మిగితా కూరగాయలు ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తాయి.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.