ప్రభుత్వ కొలువులు.. ప్రైవేట్‌లో సేవలు

ABN , First Publish Date - 2022-07-03T06:13:32+05:30 IST

ప్రాణాలను కాపాడే దేవుళ్లుగా వైద్యులను ప్రజలు భావిస్తారు.

ప్రభుత్వ కొలువులు.. ప్రైవేట్‌లో సేవలు

- సమయ పాలన పాటించని సర్కారు వైద్యులు

- ఫలితం ఇవ్వని బయోమెట్రిక్‌

- జిల్లా ఆసుపత్రిలో ఇబ్బంది పడుతున్న రోగులు

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌: ప్రాణాలను కాపాడే దేవుళ్లుగా వైద్యులను ప్రజలు భావిస్తారు. అలాంటి వైద్యులు వృత్తి ధర్మానికి తిలోదకాలిస్తూ కాసుల సంపాదనకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేట్‌ వైద్యం పొందే స్థోమత లేక ఆర్థిక పరిస్థితులు బాగాలేని పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు సర్కారు వైద్యంపైనే ఆధారపడుతున్నారు. సర్కారు వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పైనే మోజు చూపిస్తూ కొందరు విధులకు ఎగనామం పెడుతుతున్నారు. మరికొందరు విధులకు సకాలంలో హాజరుకాకుండా, వచ్చినా విధి నిర్వహించవలసిన సమయంలో బయటకు వెళుతున్నారు. సర్కార్‌ వైద్యుల విధులకు సక్రమంగా హాజరయ్యేందుకు, బయటకు వెళ్లిన సమయం తెలుసుకునేందుకు ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ విధానం కూడా ఫలితం ఇవ్వకుండా పోతున్నది. జిల్లా ఆసుపత్రి, దానికి అనుబంధంగా ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో ఆసుపత్రి సూపరింటెండెంట్‌తోపాటు 64 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు.

ఆన్‌కాల్‌లో ప్రైవేట్‌ సేవలు

అనస్థీషియన్లు, ఫిజీషియన్లు, ఆర్థో డాక్టర్లకు ప్రైవేట్‌లో బాగా డిమాండ్‌ ఉన్నది. ఈ విభాగాలకు చెందిన వైద్యులు ప్రైవేట్‌ వైద్యంవైపు మొగ్గు చూపుతున్నారని, కొందరు ఆన్‌కాల్‌లో వెళ్లి ప్రైవేట్‌లో సేవలందిస్తున్నారు. మరికొందరు వివిధ ఆసుపత్రులకు అనుబంధంగా పని చేస్తున్నారు. దీంతో అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో వారి సేవలు రోగులకు సకాలంలో అందడం లేదని విమర్శలు వస్తున్నాయి. మరికొందరు వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రి డ్యూటీకి వచ్చి రెండు, మూడు గంటలు వైద్యం అందించి ఆ తర్వాత బయటకు వెళ్లి ప్రాక్టీస్‌ నిర్వహించుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. 

నిబంధనలను పట్టించుకోని వైనం

జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాలతోపాటు కొమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాల నుంచి కూడా నిత్యం రోగులు వస్తుంటారు. ఆర్థిక స్థోమత బాగాలేక ప్రభుత్వ వైద్యంపై నమ్మకంతో ఆసుపత్రులకు వస్తున్న వారికి వైద్యులు అందుబాటులో లేకపోవడం శాపంగా మారుతున్నది. విధిలేని పరిస్థితుల్లో మళ్లీవారు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ నిర్వహించరాదని నిబంధనలు విధించడాన్ని ప్రజలు హర్షిస్తున్నారు. ఈ నిబంధనలు కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే వైద్యులకు మాత్రమే వర్తిస్తాయి. ఇప్పటి వరకు నియామకాలు పొందిన వైద్యులకు ఈ నిబంధనలు వర్తించకపోవడం, ప్రైవేట్‌ ప్రాక్టీస్‌లో ప్రభుత్వం అందించే వేతనంకంటే మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా సంపాదించుకునే అవకాశాలుండడంతో వైద్యులు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌వైపే మొగ్గుచూపుతూ నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు పెంచి డాక్టర్లలో జవాబుదారితనాన్ని తీసుకురావాలని, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో కూడా నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ ప్రభుత్వ వైద్యులు అక్కడ విధి నిర్వహణ సమయంలో పని చేస్తున్నట్లయితే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-07-03T06:13:32+05:30 IST