అన్నదాతలను ఆదుకోవాలి: విజయశాంతి

ABN , First Publish Date - 2022-08-13T23:01:49+05:30 IST

వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ నేత విజయశాంతి (Vijaya Shanthi) డిమాండ్ చేశారు.

అన్నదాతలను ఆదుకోవాలి: విజయశాంతి

హైదరాబాద్: వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని బీజేపీ నేత విజయశాంతి (Vijaya Shanthi) డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రైతాంగం పడుతున్న బాధలను ఆమె ఏకరవు పెట్టారు. ‘‘రాష్ట్రంలో పత్తి పంట సాగు చేసిన వేలాది మంది రైతులు వరుస వర్షాలతో పరేషాన్​ అవుతున్నరు. వానాకాలం సీజన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా (Medak District) వ్యాప్తంగా దాదాపు 7లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతోందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. అయితే సంగారెడ్డి జిల్లాలో మాత్రమే దాదాపు పూర్తి స్థాయిలో పత్తి సాగు చేయగా... జులై మూడో వారంలో భారీ వర్షాలు కురవడంతో సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో దాదాపు 50 శాతం వరకు మాత్రమే పత్తి సాగైంది. అయితే ఇందులో వేలాది ఎకరాల పంట ఇటీవల కురిసిన వర్షాలకు పాడైంది. పంట ఎదుగుదల ఆగిపోయింది. తెగుళ్ల సమస్య కూడా ఉంది. నీళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండడంతో మొలకలు మురిగిపోతున్నయి. ముసురు కారణంగా కలుపు తీయలేని పరిస్థితి ఉండటంతో వేలాది ఎకరాలు బీడు భూముల్ని తలపిస్తున్నయి. మళ్లీ గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని ముసురుతో పత్తి పంటపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నరు. ఒక్క ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు... తెలంగాణ అంతటా ఇదే పరిస్థితి ఉంది. తమని ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నప్పటికీ.... కేసీఆర్ (KCR) సర్కార్ నుంచి కనీస స్పందన కరువైంది. ప్రభుత్వం ఇప్పటికైనా దీనిపై స్పందించి అన్నదాతలను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నం. రాష్ట్రానికి అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెడుతున్న కేసీఆర్ సర్కార్‌కు రైతాంగం కచ్చితంగా తగిన బుద్ధి చెబుతుంది’’ అని విజయశాంతి హెచ్చరించారు.


Updated Date - 2022-08-13T23:01:49+05:30 IST